small employees
-
డిప్యూటీ సీఎం కార్యాలయం ఎదుట చిరుద్యోగుల ఆందోళన
సాక్షి, అమరావతి: ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్‌లలో పనిచేసే చిరుద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఎదుట మరో విడత ఆందోళన చేపట్టారు. 15–20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి.. వారి స్థానంలో తాము చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూటమి ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు తీసుకొస్తుండటంతో చిరుద్యోగులు ఇప్పటికే సెపె్టంబర్ 13, అక్టోబర్ 6 తేదీల్లో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. చిరుద్యోగుల ఆందోళన విషయాన్ని కార్యాలయ అధికారులు చిరుద్యోగుల సంఘ ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. ఉద్యోగులెవరినీ తొలగించకుండా శాఖాపరంగా చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్ తన కార్యాలయ అధికారుల ద్వారా హామీ ఇచ్చినట్టు ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మోనిటరింగ్ లే»ొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డి.మూర్తిరెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ చోట్ల తొలగించిన ఉద్యోగుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని.. రెండు మూడు రోజుల్లో ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు చెప్పారని ఆయన తెలిపారు. -
వైవీయూలో చీప్ పాలిట్రిక్స్
యోగివేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న చిరుద్యోగుల జీవితాలతో అధికారపార్టీ నాయకులు ఆడుకుంటున్నారు. ఒక చేత్తో మీకు సాయం చేస్తామంటూ.. మరో చేత్తో వీరికి వేతనాలు ఎందుకు పెంచారంటూ ఫిర్యాదు చేశారు. ఈ పాలి‘ట్రిక్స్’ తెలియని చిరుద్యోగులకు గత్యంతరం లేకపోవడంతో ‘గతిలేనమ్మకు మతిలేని మొగుడే దిక్కు’ అన్న చందంగా ప్రొద్దుటూరులోని ఓ మాజీ ప్రజాప్రతినిధిని కలిశారు. దీంతో మీకు నేను సాయం చేస్తానని... మీ అందరినీ టైంస్కేల్కు మార్చేలా చూస్తానని.. దీనికి ప్రతిఫలం చెల్లించాలని మెలికపెట్టడంతో చేసేదేమీ లేక ఒక్కో అభ్యర్థి రూ.లక్ష వరకు మొక్కు చెల్లించేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి కడప: యోగివేమన విశ్వవిద్యాలయం, ప్రొద్దుటూరులోని వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 52 మంది చిరుద్యోగులు ఎన్ఎంఆర్ (నాన్ మస్టర్డ్ రోల్) ఒప్పంద పద్ధతిలో 2008లో విధుల్లో చేరారు. గత కొద్ది సంవత్సరాలుగా వీరంతా తమను టైం స్కేల్ పరిధిలోకి తీసుకోవాలంటూ విశ్వవిద్యాలయ అధికారులకు పలుమార్లు విన్నవించారు. వీరి న్యాయమైన కోరికకు బలం చేకూర్చేలా పొరుగున ఉన్న రాయలసీమ విశ్వవిద్యాలయంలో 5 సంవత్సరాల సీనియారిటీ కలిగిన ఎన్ఎంఆర్ ఉద్యోగులందరినీ టైంస్కేల్ కింద మార్పు చేశారు. దీంతో వైవీయూ ఎన్ఎంఆర్ ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. తాము పది సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పటికీ టైంస్కేల్ వర్తింప చేయకపోవడం పట్ల అసంతృప్తి మొదలైంది. దీంతో మళ్లీ అధికారుల వద్దకు వచ్చి తమను టైంస్కేల్కు మార్పుచేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నం. 151 ప్రకారం వేతనాలు పెంచాలని కోరారు. దీనికి స్పందిం చిన అధికారులు ఎన్ఎంఆర్ ఉద్యోగులను టైంస్కేల్ ఉద్యోగులుగా మార్పు చేయడం, వేతనాల పెంపు విషయం పాలకమండలి సమావేశంలో ఉంచగా...టైంస్కేల్ అంశం తర్వాత చూద్దామని..వేతనాల పెంపునకు వైవీయూ పాలకమండలి ఆమోదం తెలిపింది. పాలకమండలి సభ్యుల్లో ఇద్దరు మినహా మిగతా అందరూ ఆమోదం తెలపడంతో ఎన్ఎంఆర్ ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. కాగా తన మాట నెగ్గలేదన్న అక్కసుతో నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వానికి తెలపకుండానే వేతనాలు పెంచారంటూ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్‌పై అధికార పార్టీకి చెందిన ఓ పాలకమండలి సభ్యుడు గవర్నర్‌కు ఫిర్యాదు చేశాడు. ప్లేటు ఫిరాయించిన పాలకమండలి సభ్యుడు.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పాలకమండలి సభ్యుడు స్థానిక ఒత్తిళ్ల కారణంగా ప్లేటు ఫిరాయించారు. ప్రొద్దుటూరులోని వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆ ప్రాంత మాజీ ప్రజాప్రతినిధిని కలిసి సమస్యను పరిష్కరించాలని ఆశ్రయించినట్టు సమాచారం. దీంతో సదరు మాజీ ప్రజాప్రతినిధి వైవీయూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది.కాగా వ్యవహారం గవర్నర్కోర్టులో ఉన్నందున తామేమీ నిర్ణయం తీసుకోలేమని ఆయనకు చెప్పినట్లు తెలిసింది. వెంటనే సదరు నేత ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పాలకమండలి సభ్యుడితో మంతనాలు జరిపి సానుకూలంగా వ్యవహరించాలని ఆయనకు సూచించినట్లు తెలిసింది. దీంతో వీరి వేతనాల పెంపుపై ఫిర్యాదు చేసిన పాలక మండలి సభ్యుడు ఏ చెత్తో అయితే ఫిర్యాదు చేశాడో...మళ్లీ ప్లేటు ఫిరాయించి ఎన్ఎంఆర్ ఉద్యోగులు తీసుకువచ్చిన వినతిపత్రంలో వీరిని టైంస్కేల్ ఉద్యోగులుగా మార్పు చేయాలని నోట్ పెట్టి పంపారు. వాస్తవానికి ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పాలకమండలి సభ్యుడి హోదాలో సమావేశంలో పెట్టబోయే అజెం డాలో వీరి అంశాన్ని చేర్చాలని కోరుతూ చైర్మన్‌కు లేఖ రాయాలి. అలా చేయకుండా వారు రాసుకొచ్చిన వినతిపత్రంలో మాత్రం రెకమెండ్ చేస్తూ నోట్ పెట్టడం చూస్తుంటే.. నోటితో కావాలని.. నొసటితో వద్దన్న చందంగా ఉందని కొందరు ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమి జరిగిందో కానీ ఈ వ్యవహారం త్వరితగతిన తేల్చాలంటూ ఇద్దరు పాలకమండలి సభ్యులతో పాటు ప్రొద్దుటూరుకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి తరచూ వాకబు చేయడం చూస్తుంటే ఎక్కడా లేని ప్రేమ వెనుక ఉన్న మతలబు ఏంటో ఇట్టే అర్థం అవుతోంది. చిత్తశుద్ధి ఉంటే పాలకమండలి సభ్యుడు చేసిన ఫిర్యాదు వెనక్కు తీసుకుని తమను టైంస్కేల్ ఉద్యోగులుగా మార్చేందుకు సహకరించాలని పలువురు ఎన్ఎంఆర్ ఉద్యోగులు కోరుతున్నారు. గవర్నర్ వివరణ కోరడంతో అడ్డం తిరిగిన కథ.. ఎన్ఎంఆర్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్న విశ్వవిద్యాలయ అధికారులు ఈనెల 21న నిర్వహించాల్సిన (ప్రస్తుతం వాయిదా పడింది) పాలకమండలి సమావేశంలో అనుమతి పొందేందుకు రంగం సిద్ధం చేశా రు. అదే సమయంలో పాలకమండలి సభ్యుడి ఫి ర్యాదు మేరకు దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ వైవీయూ అధికారులకు గవర్నర్ కార్యాలయం నుంచి లేఖ అందింది. దీనికి విశ్వవిద్యాలయ అధికారులు తగిన ఆధారాలును క్రోడీకరించి నివేదికను పంపారు. తాము నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరించామని.. ఎటువంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడలేదని.. అవసరమైతే విచారణకు సైతం సిద్ధమేనన్న సందేశాన్ని పంపా రు. దీంతో ఎన్ఎంఆర్ ఉద్యోగుల టైంస్కేల్ ప్రక్రియకు నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఎన్ఎంఆర్ ఉద్యోగులను టైంస్కేల్‌గా మార్పు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. తాము సమస్య పరిష్కారానికి కృషిచేస్తుంటే ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చి న నేపథ్యంలో ముందుకు వెళ్లలేమంటూ విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొనడంతో ఎన్ఎంఆర్ ఉద్యోగుల నోట్లో పచ్చి వెలక్కాయపడ్డట్టు అయింది. -
చిరుద్యోగులకు ఊరటనిస్తారా..
సాక్షి, అమరావతి : బడ్జెట్ అంటేనే చిరుద్యోగులు దడదడలాడుతుంటారు. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో అని కంగారు పడుతుంటారు. చిరుద్యోగి జాతకంలో ఎప్పుడూ ఆదాయం 2గా ఉంటే వ్యయం 12గా ఉంటోంది. ఈ సారైనా కేంద్ర బడ్జెట్లో తమను కనికరిస్తారా అనే ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న చాలామంది మధ్యతరగతి, చిరు ఉద్యోగులు జీతాలు సరిపోక, పన్నులు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్లో ఆదాయపు పన్ను పరిమితిని పెంచి ఆర్థికమంత్రి ఉద్యోగులకు ఊరటనిస్తారని ఆశిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తారస్థాయికి చేరడంతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ స్థాయిలో జీతాలు మాత్రం పెరగడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత రెండేళ్ల నుంచి వ్యాపారాలు లేక ఉద్యోగులకు జీతాలు పెంచడం లేదని, కానీ ధరలు మాత్రం 20 నుంచి 30 శాతం పెరిగిపోవడంతో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థంకావడం లేదని చీరాలకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కిశోర్ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాల పెరుగుదల లేదు ధరలు పెరుగుతున్న స్థాయిలో జీతాలు పెరగడం లేదు. దీనికితోడు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటివాటితో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చాలా సంస్థలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచలేని పరిస్థితి. ఇప్పుడు చేతికి అందుతున్న జీతం 15వ తేదీ రాకుండానే ఖర్చు అయిపోతోంది. ఈ బడ్జెట్లోనైనా ఆదాయ పన్ను పరిమితి పెంచితే కొంతైనా ఊరట లభిస్తుంది. కె. నారాయణరావు, ప్రైవేట్ ఉద్యోగి, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా విజయవాడలో పెరిగిన ఖర్చులు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి రావాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఇంటి అద్దెలు, ఇతర వ్యయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో నగరాల్లో పనిచేసే హెచ్ఆర్ఏ నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేయాలి. అలాగే పెరిగిన జీవనవ్యయాలను దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ డిడక్షన్‌ను తిరిగి ప్రవేశపెట్టాలి. జి.గణేష్ కుమార్, ప్రభుత్వ ఉద్యోగి, అమరావతి. -
పీఎఫ్ వాటా చెల్లింపు ఇక ఐచ్ఛికం
- చిరుద్యోగులకు వెసులుబాటు న్యూఢిల్లీ: చిరుద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిర్దిష్ట పరిమితి కంటే తక్కువగా నెలవారీ వేతనం పొందుతున్న కార్మికులు ఇకమీదట ఈపీఎఫ్(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) కు తమ వంతు పీఎఫ్ వాటాను చెల్లించడం ఐచ్ఛికం కానుంది. అయితే యాజమాన్యాలు మాత్రం ఈ పథకానికి తమ వంతు వాటాను చెల్లించాల్సిందే. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం ప్రకటించారు. అయితే బడ్జెట్ ప్రతిపాదనల్లో వేతన పరిమితి ఎంతనేది నిర్దిష్టంగా పేర్కొనలేదు. ప్రస్తుతం ఉద్యోగులందరూ బేసిక్ శాలరీ, డీఏతోసహా తమ బేసిక్ వేతనంలో 12 శాతాన్ని పీఎఫ్ వాటాగా చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా యాజమాన్యాలు తమ వంతు వాటాను చెల్లిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్ పథకం, కొత్త పెన్షన్ పథకం(ఎన్పీఎఫ్)లలో ఏదో ఒకదానిని ఎంచుకునే సౌలభ్యం సంఘటితరంగ ఉద్యోగులకు లభించనుంది. అదేవిధంగా ఈఎస్ఐ కల్పించే ఆరోగ్య సదుపాయాలు లేదా బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ గుర్తింపు పొందిన ఆరోగ్య బీమాలలో ఏదో ఒకదానిని ఎంచుకునే వెసులుబాటు సైతం వారికి లభించనుంది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని ప్రభుత్వం సవరిస్తుందని జైట్లీ తెలిపారు. ఈపీఎఫ్‌వో సామాజిక భద్రతా పథకాల కింద ప్రస్తుతం ఐదుకోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. ఈపీఎఫ్, పీపీఎఫ్ ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని కారణంగా పేరుకుపోయిన రూ.తొమ్మిదివేల కోట్లతో(ఈపీఎఫ్‌లో రూ.6 వేల కోట్లు, పీపీఎఫ్‌లో రూ.3 వేల కోట్లు) వృద్ధుల సంక్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తాన్ని వృద్ధాప్య పింఛన్లు పొందేవారు, బీపీఎల్ కార్డుదారులు, చిన్న, సన్నకారు రైతులు, ఇతరు నిమ్నవర్గాలకు చెందినవారికి ప్రీమియం చెల్లింపులకోసం వినియోగిస్తారు. ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు సంబంధించిన చట్టాల్లో సమూల మార్పులను ప్రభుత్వం తీసుకురానుంది. ఇందులో భాగంగా ఉద్యోగులు తమ శాలరీని ఏ విధంగా పొందాలో వారే నిర్ణయించుకోవచ్చు. సంబంధితులందరితో చర్చించిన అనంతరం ఈ చట్టాన్ని సవరించనున్నట్టు జైట్లీ తెలిపారు.