వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి కంపుకొడుతోంది. అధికార పార్టీ నాయకులు, కొందరు అధికారులు కుమ్మక్కై పథకం ఉద్దేశాన్ని పక్కదారి పట్టించి లక్షల రూపాయలు కొల్లగొట్టారు. కోవెలకుంట్ల మండలంలో ఏకంగా పాతమరుగుదొడ్లు చూపి బిల్లులు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గత రెండేళ్ల కాలంలో రెండు వందలు దాటని మరుగుదొడ్ల నిర్మాణాలు రెండు నెలల్లోనే కొత్తగా 300 నిర్మాణాలు పూర్తైనట్లు రికార్డుల్లో చూపడం అనుమానాలకు తావిస్తోంది.
కోవెలకుంట్ల: పల్లెలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోకేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మరుగుదొడ్డి మంజూరైన తర్వాత లబ్ధిదారుడు దానిని నిర్మించే ప్రదేశాన్ని అధికారులు జియోట్యాగింగ్ చేసి రికార్డుల్లో నమోదు చేయాలి. మరుగుదొడ్డి బేస్‌మెంట్ దశలో నిర్మాణ ఫొటో జత చేసి మొదటి విడత బిల్లుకు ప్రతిపాదిస్తే రూ. 6వేలు లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతుంది. మరుగుదొడ్డి పూర్తి అయ్యాక అధికారులు పరిశీలించి రికార్డుల్లో నమోదు చేసి మిగిలిన రూ. 9వేలు జమ చేస్తారు. ఇందులో ఎలాంటి అవకగతవకలు జరగకుండా సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు ఒక్కో గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. అయితే, కోవెలకుంట్ల మండలంలో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాల్లో ఈ నిబంధనలను తుంగలో తొక్కి చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది.
పాతవాటికే బిల్లులు:
కోవెలకుంట్ల పట్టణంలో గత రెండళ్లలో కేవలం 240 లెట్రిన్లు పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి 15 నాటికి వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఇటీవల లక్ష్యాన్ని నిర్దేశించగానే ఏకంగా 300కు పైగా మరుగుదొడ్లు నిర్మించినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ రెండు నెలల్లో అదేలా సాధ్యమని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని టీడీపీ కమిటీలో కీలకంగా ఉన్న ఓ నాయకుడు, కొందరి అధికారులతో కుమ్మక్కై గతంలో నిర్మించిన పాత మరుగుదొడ్లకే బిల్లులు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇదే తంతు నిర్వహించి సుమారు రూ. రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. తర్వాత ఆ నిధులను కొందరు అధికారులు, టీడీపీ నాయకులు, బోగస్ లబ్ధిదారులు కలిసి వాటాలు పంచుకున్నట్లు చర్చ జరుగుతోంది.
బిల్లులు చేయాలంటూ అధికారులపై ఫైర్:
తాము సూచించిన వ్యక్తులకే వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు మంజూరు చేయాలని, టీడీపీ నాయకులు ఇటీవల మండల అధికారులపై ఫైర్ అయ్యారు. అలాగే గుళ్లదూర్తి గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాలు మరుగుదొడ్ల కేటాయింపులో అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఒక వర్గానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా తమ వర్గానికి 50 కేటాయించాలని అధికారులకు లబ్ధిదారుల జాబితా అందజేశారు. ఉన్నతాధికారులు మండలంలోని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
పాత మరుగుదొడ్లకు బిల్లుల చెల్లింపు జరిగినవి మచ్చుకు కొన్ని
► కోవెలకుంట్ల గ్రామ పంచాయతీలో కాంట్రాక్ట్ బేసిక్‌పై పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాత మరుగుదొడ్లు చూపించి తమ బంధువుల పేరుతో మూడు బిల్లులు డ్రా చేసుకున్నాడు.
► ఇదే కార్యాలయంలో తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి రెండు బిల్లులు తీసుకున్నాడు.
► స్వామినగర్ కాలనీలో ఒకే ఇంటిపేరు మీద ఆరుగురికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా వీటిలో రెండింటికి పాత వాటికే బిల్లులు చేశారు.
► పట్టణంలోని గుదేట్టి వీధి, బసిరెడ్డి బావి వీధి, సంతపేట కాలనీల్లో 50 నుంచి 60 దాకా పాత మరుగుదొడ్లకే బిల్లులు చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment