సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైల్వే పనుల అంచనాలు ఏటికేడాది పెరుగుతున్నాయి తప్ప.. పనులు మాత్రం ఎక్కడివి అక్కడే ఉన్నాయి. రైల్వే పనుల జాప్యానికి ప్రధానంగా భూసేకరణ, అధికార పార్టీ నేతల కమీషన్ల కక్కుర్తే కారణమని రైల్వే వర్గాలే చెబుతున్నాయి. ఈ కారణంగానే పనులు ముందుకు నడవక ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగుతోందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల్లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామకృష్ణ, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురగండ్ల రామకృష్ణ కాంట్రాక్టు కంపెనీల నుంచి కమీషన్ల కోసం డిమాండ్ చేసి నానాహంగామా సృష్టించిన విషయాలను వారు ఉదహరిస్తున్నారు. రైల్వే ప్రాజెక్టు భూ సేకరణ బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఆ సేకరణ సకాలంలో పూర్తి చేయడం లేదని రైల్వే శాఖ చెబుతోంది.
ఇక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే ప్రాజెక్టులకు కాస్ట్ షేరింగ్ విధానంలో నిధులు మంజూరు చేస్తున్నాయి. కాస్ట్ షేరింగ్ విధానంలో అటు రైల్వే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అరకొరగా నిధులు కేటాయిస్తుండటంతో ప్రాజెక్టుల పనులు నాలుగేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులు 8 ఉన్నాయి. వీటి అంచనా వ్యయం నాలుగేళ్ల క్రితం మొత్తం రూ. 13,200 కోట్లు. ఇప్పుడు అదనంగా మరో రూ. 2 వేల కోట్ల వరకు పెరిగినట్లు రైల్వే శాఖ నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైల్వే, ఏపీ ప్రభుత్వం జాయింట్ వెంచర్ కంపెనీ (జేవీ) ఏర్పాటు చేసినా.. అది కాగితాలకే పరిమితమైంది. జేవీ కాకుండా రాష్ట్రంలో రైల్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వంద కోట్లతో రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను గతేడాది ఆగస్టులో ఏర్పాటు చేసింది. 2016 డిసెంబర్ 30న ఏపీ ప్రభుత్వం రైల్వే శాఖ జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో రైల్వే వాటా 41%, ఏపీ సర్కారు వాటా 51 % ఉంటుంది.
కొలిక్కిరాని నడికుడి–శ్రీకాళహస్తి భూసేకరణ
రాష్ట్రానికి వెన్నెముకలాంటి నడికుడి–శ్రీకాళహస్తి రైల్వేలైన్ ఏర్పాటుకు భూ సేకరణ ప్రక్రియ ఇంతవరకు కొలిక్కి రాలేదు. రూ.1,314 కోట్లుగా ఉన్న అంచనా వ్యయం ప్రస్తుతం రూ. 2,200 కోట్లు దాటిందని రైల్వే శాఖ చెబుతోంది. విజయవాడ–భీమవరం–నిడదవోలు రైల్వే లైన్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు 2013లో రూ.1,009.08 కోట్లు అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు రూ.1,300 కోట్లను దాటుతోంది. కడప–బెంగళూరు రైల్వే లైన్‌కు రూ.1000.23 కోట్లు అంచనా వ్యయం కాగా, ఇప్పుడు రూ.1,300 కోట్లు దాటింది. కాజీపేట–విజయవాడ మూడో లైన్ నిర్మాణానికి రూ.3,246 కోట్లు అంచనా కాగా, రూ.3,780 కోట్లకు చేరింది.
అంచనాలు పురోగతి.. పనులు అధోగతి
Published Tue, Jul 10 2018 2:24 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment