గతంలో ఎల్‌ఏ సాగరం వద్ద భారీ అపార్ట్‌మెంట్ తొలగించే విధంగా వేసిన హద్దురాయి
పెళ్లకూరు మండలం నుంచి నాయుడుపేట మీదుగా పండ్లూరు వరకూ ఆరు లైన్ల బైపాస్ నిర్మిస్తున్నారు. 20 కిలోమీటర్ల మేర అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అయితే సంపన్నుల కోసం ప్లాన్లు మార్చివేశారు. దీనికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తోడవడంతో పేదల ఇళ్లు, పంటలు పండే బంగారు భూములపై పడ్డారు అధికారులు. రోజురోజుకూ అధికారులు హద్దు లు మార్చేస్తూ పెద్దలకు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎనిమిది నెలల క్రితం వేసిన హద్దుల్లో బడాబాబులకు చెందిన భవనాలు, అపార్టుమెంట్లున్నాయి. ప్రస్తుతం వేస్తున్న హద్దుల్లో పంట పొలాలు, బోర్లు, పలు దళిత కాలనీలున్నాయి. కొత్త హద్దులను అడ్డుకుంటూ మాకు చావే శరణ్యం అంటున్నారు పేదలు. అయినా అధికారులకు వీరి గోడు పట్టడంలేదు.
నాయుడుపేటటౌన్ (నెల్లూర): కేంద్రం ఇటీవల ఏర్పాటుచేసిన 71వ జాతీయ రహదారిపై రేణిగుంట నుంచి (పూతలపట్టు – నాయుడుపేట) మండల పరిధిలోని నాయుడుపేట పట్టణంలోని జీఎన్‌టీ రోడ్డు మీదుగా తుమ్మూరు, పండ్లూరు గ్రామం వరకు 16వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ ఆరులైన్ల రోడ్డును నిర్మించాల్సి ఉంది. దీనికితోడు నాయుడుపేట నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి సైతం భూసేకరణ పనులు చేపట్టి ఉన్నారు. ఆరులైన్ల నిర్మాణానికి సంబంధించి ఈ జాతీయ రహదారిపై స్వర్ణముఖి నదిపై చాలా పొడవైన బ్రిడ్జి ఉండటం, అంతేకాకుండా మామిడి కాలువ, రైల్వేగేట్లు తదితరాలు అడ్డంకులుగా ఉండడంతో ఈ ప్రతిపాదనను ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) తిరస్కరించింది.
ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు 2017 సంవత్సరం ఆగస్ట్ 3న కొత్తగా మళ్లీ సర్వే చేపట్టారు. దీంతో నాయుడుపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి జాతీయ రహదారి కూడలి సమీపంలో ఉన్న 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి గోమతి సర్కిల్ ఆవతల వైపు నుంచి రేణిగుంట వరకు 71వ నంబర్ జాతీయ రహదారిలో ఆరులైన్ల రోడ్డు నిర్మాణానికి హద్దులు ఏర్పాటుచేసి ప్రతిపాదనలు (డీపీఆర్) తయారు చేశారు. 20 కిలోమీటర్లకు సంబంధించిన ఆ రిపోర్టును తిరుపతి డివిజన్‌కు చెందిన అధికారులు కలెక్టర్‌కు అందజేశారు.
నాయుడుపేట పట్టణ పరిధిలోని గోమతి సర్కిల్ నుంచి ఎల్‌ఏ సాగరం సమీప ప్రాంతాల నుంచి ఎల్‌ఏ సాగరం చెరువు, జువ్వలపాళెం గ్రామ పొలాల మీదుగా 16వ నంబర్ జాతీయ రహదారి కూడలి వరకు ప్రత్యేక సర్వే బృందం హద్దులు నాటారు. ఈ హద్దుల్లో గోమతి సర్కిల్ నుంచి జాతీయ రహదారి కూడలి వరకు అనేక భారీ భవంతులతో పాటు పలు అపార్ట్‌మెంట్లు సైతం ఉన్నాయి. అందుకు సంబంధించి భూసేకరణకు సైతం శ్రీకారం చేపట్టారు. ఇది అప్పట్లో సంచలనమైంది. అయితే అధికారులు బడాబాబులకు దాసోహమైపోయి హద్దు మార్చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నేతలు ఒత్తిడి కావడంతో హద్దులు మారిపోతున్నాయి.
నిరుపేద రైతులు, దళితులు నివాసం ఉండే ప్రాంతాలు, పచ్చని పంట పొలాల్లో హద్దు నాటుతున్నారు. కొద్దిరోజుల క్రితం జువ్వలపాళెంకు చెందిన దళితులు అధికారులను అడ్డుకున్నారు. అలాగే నాయుడుపేట, పెళ్లకూరు మండలాలకు చెందిన రైతులు సైతం వ్యవసాయ బోర్ల వద్ద ఆందోళనలు చేశారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వ్యవసాయ బోర్లు, బంగారు (వరి, చెరుకు) పండించే భూములను సైతం లాక్కునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రైతులు రెండు పర్యాయాలు కలెక్టర్ కార్యాలయంలో జేసీని కలిసి వినతిపత్రాలు సమర్పించారు కూడా. న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు, దళితులు అంటున్నారు.
నా దృష్టికి రాలేదు
ఎల్‌ఏసాగరం, తదితర ప్రాంతాల్లో రైతుల బోర్లల వద్ద రాళ్లు నాటి విషయమై రైతులు నా దృష్టికి తీసుకురాలేదు. ఆరులైన్ల రోడ్డు కోసం మొదట ఎన్‌హెచ్ అధికారులు సర్వే చేశారు. తర్వాత రెవెన్యూ అధికారుల సర్వే ఉంటుంది. ఏదైనా సమస్యలుంటే పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తా. -ఎం శ్రీదేవి, ఆర్డీఓ నాయుడుపేట
దుర్మార్గపు చర్య
జాతీయ రహదారిపై ఆరు లైన్ల నిర్మాణానికి కొత్తగా సర్వే చేస్తూ రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్లు, పోలాలతో పాటు దళితులు నివాసాలు సమీపంలో హద్దులు రాళ్లు వేస్తుండటం దారుణం. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ఈ స్థలాలను సేకరించి రహదారి నిర్మాణం చేపడితే అందరికీ సమ్మతమే. – తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, నాయుడుపేట
ఆత్మహత్యలే శరణ్యం
ఎల్‌ఏ సాగరంలో మాకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయ బోరు ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటున్నాం. తొలుత చేసిన సర్వేలో కొద్దిపాటి పొలం మాత్రమే పొయింది. తిరిగి నాటుతున్న హద్దుల్లో పొలాలతో పాటు బోర్లు ఉన్నాయి. బోర్లు పోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. రెవెన్యూ అధికారులు పరిశీలించి న్యాయం చేయాలి. – పుట్ట రాగమ్మ, మహిళ రైతు, తాళ్వాయిపాడు, పెళ్లకూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment