‘ఉచితం’తో ఆదాయం గోవిందా..
ప్రత్యామ్నాయం కోరుతున్న పంచాయతీలు
ఆత్మకూరురూరల్: టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో తెలుగుతమ్ముళ్లు అందిన కాడికి ఇసుకను దోచుకొని అమ్ముకున్నారు. గతంలో ఉన్న ఇసుక పాలసీతో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా మసకబారిన క్రమంలో ‘ఉచితం’ అంటూ తాయిలం చూపి ప్రజలను మభ్య పెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మేరకు సీనరేజ్ ఆదాయం కోల్పోతున్నామని పలు పంచాయతీ పాలకవర్గా లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇళ్లు నిర్మించుకునే వారు ఇసుకను ఉచి తంగా తరలించుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. పేద, మధ్య తరగతి ప్రజలకు సంతోషం కలుగుతున్నా ఇదే అదునుగా పలువురు అధికారపార్టీ నేతలు ఇసుకను దోచుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఉచితం మాటున ఓ వైపు ఇసుకను డంప్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం ఇసుక రీచ్ నుంచి ఉచితంగా ఇసుకను తరలించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
19 రీచ్‌లకు అనుమతి
వసూలు చేసే మొత్తంలో పంచాయతీలకు క్యూబిక్ మీటరుకు రూ.70 చొప్పున సీనరేజ్ కింద ప్రభుత్వం ఆయా పంచాయతీ ఖాతాల్లో గతంలో జమ చేసేది. జిల్లాలో 19 ఇసుక రీచ్‌లను ఉచితానికి అనుమతిచ్చింది. అప్పారావుపాళెం, గొల్లకందుకూరు, సజ్జాపురం, జమ్మిపాళెం, పడమటి కంభంపాడు, లింగంగుంట, మాముడూరు, మినగల్లు, ముదివర్తిపాళెం, పల్లిపాడు, పడమటిపాళెం, సూరాయపాళెం, పొట్టేపాళెం తదితర రీచ్‌లలో ఇసుకను ఉచితంగా పొందేందుకు అనుమతి ఉంది. దీంతో ఉచితం అవకాశంగా పలువురు ఇసుక కొల్లగొడుతున్నారు.
ప్రత్యామ్నాయ నిధులు మంజూరు చేయాలి
ఇసుకను ఉచితంగా తరలిస్తుండడంతో సీనరేజ్ ఆదాయం కోల్పోతున్న పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా నిధులు మంజూరు చేయాలని ఆయా పంచాయతీ పాలక వర్గాలు కోరుతున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉన్న పంచాయతీల ఆదాయం సీనరేజ్ కోల్పోతుండడంతో వాటి పరిస్థితి ఆర్థికంగా చతికిల పడ్డట్టు అయింది. గతంలో పంచాయతీల పరిధిలో తాగునీటి పథకాలు మరమ్మతులకు గురైతే కొంత సీనరేజ్ సొమ్ము ఖాతాల్లో ఉండడంతో సర్పంచ్‌లు పనులు చేయించేవారు. ప్రస్తుతం ఆదాయం కోల్పోవడంతో ప్రతి పనికీ ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. ఇలా ఇసుక రీచ్‌లున్న పంచాయతీల ఆదాయానికి గండి పడే రీతిలో ప్రకటన చేయడంతో వాటి ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఉచితం ప్రకటించిన రీచ్‌ల పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా అదనపు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.
పంచాయతీలు ఆదాయం కోల్పోవడం వాస్తవం :
పంచాయతీలకు సీనరేజ్ లేకపోవడంతో ఆదాయం కోల్పోతున్న విషయం వాస్తవమే. ఈ నెల 16,17 తేదీల్లో కలెక్టర్, ఇతర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లాలోని అన్ని మండల స్థాయి అధికారులతో పెంచలకోనలో సమావేశం జరగనుంది. ప్రస్తుతం శాఖాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆ సమావేశంలో అధికారుల దృష్టికి తెస్తాం. పరిష్కారానికి అక్కడ అధికారులు చర్యలు చేపడతారు.
- నిర్మలాదేవి, ఎంపీడీఓ