దోచేయ్.. దాచేయ్! | Illegal sand trade | Sakshi
Sakshi News home page

దోచేయ్.. దాచేయ్!

Published Wed, May 18 2016 2:14 AM | Last Updated on Sat, Sep 29 2018 5:47 PM

దోచేయ్.. దాచేయ్! - Sakshi

దోచేయ్.. దాచేయ్!

* ఉచితం మాటున ఇసుక అక్రమ వ్యాపారం
* అనధికార రీచ్ ల నుంచి యథేచ్ఛగా తరలింపు
* నిబంధనలకు విరుద్ధంగా తోటల్లో డంపింగ్
* సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకొంటున్న ‘తమ్ముళ్లు’
* పర్యవేక్షణ మరచి, చోద్యం చూస్తున్న అధికారులు

ఉలవపాడు: తెలుగు తమ్ముళ్ల అక్రమ ఇసుక వ్యాపారం మూడు టిప్పర్లు, ఆరు డంప్‌లుగా వెలుగొందుతోంది.

తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంతో సామాన్య ప్రజలకు వనగూరే ప్రయోజనం మాటెలా ఉన్నా ఆపార్టీ శ్రేణులకు మాత్రం వరంలా మారింది. వారికి నిబంధనలు పట్టవు.. రవాణాకు పగలు, రాత్రి అనే బేధం లేదు.. అధికారులు పర్యవేక్షణ ఉంటుందనే భయం అసలే లేదు.. వారికి నచ్చిన రీచ్‌ల నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలించి, తోటల్లో రహస్యంగా డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి టిప్పర్లతో వివిధ జిల్లాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారమంతా తెలిసికూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
 
మన్నేరు నుంచి యథేచ్చగా తరలింపు..
రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంలో నిర్ణయించిన రీచ్‌ల నుంచే అవసరమైన వారు ఇసుక తెచ్చుకోవాలి. డంప్ చేయకూడదు. రాత్రి వేళల్లో ఇసుక తరలించకూడనే నిబంధన ఉంది. కానీ, ఇసుకాసురులకు ఈ నిబంధనలు పట్టడం లేదు. ఉలవపాడు మండల పరిధిలో ప్రభుత్వం అనుమతిచ్చిన చినిగేవారిపాలెం రీచ్ నుంచే కాక మన్నేరులోని అన్ని రీచ్‌ల నుంచి రాత్రివేళల్లో సైతం యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.

కొల్లూరుపాడు- ఆత్మకూరు మధ్య బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో, భీమవరం, కుమ్మరిపాలెం, మన్నేటికోట నుంచి ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులందరూ వీరి చేతుల్లోనే ఉండటంతో ఇసుక అవసరమైన సామాన్య ప్రజలు వీరినే ఆశ్రయించాల్సి వస్తోంది.  
 
తోటల్లో రహస్య డంప్‌లు...
ఉలవపాడు మండల పరిధిలోని నాయకులు పలు చోట్ల ఇష్టానుసారంగా ఇసుక డంప్ చేస్తున్నారు. ఇసుకను అవసరానికి మాత్రమే తీసుకెళ్లాలని తెలిసినా నాయకులు మాత్రం తోటల్లో కూడా రహస్యంగా డంపింగ్ చేస్తున్నారు. కృష్ణాపురం-భీమవరం సరిహద్దులోని తోటల్లో రోజూ రాత్రి వేళ భారీగా డంప్ చేయడం అక్కడ నుంచి వివిధ జిల్లాలకు టిప్పర్‌ల ద్వారా ఎగుమతులు చేస్తున్నారు.

ఇవికాక ఉలవపాడు, కొల్లూరుపాడు, ఆత్మకూరు, మన్నేటికోట రెవెన్యూ పరిధిలో కూడా ఇసుక డంప్‌లు ఏర్పాటుచేసి ఎగుమతులు చేస్తున్నారు. దీని వలన మండల పరిధిలో ఇసుక తగ్గిపోయి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తూ డంపింగ్ చేస్తున్నారని ఇటీవల రీచ్‌కి వచ్చిన అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఇకనైనా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు విన్నవిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement