విజయవాడ కోర్టులో సత్యానందం ప్రత్యక్షం
విజయవాడ: కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుల్లో ఒకరైన ఏపీఎస్‌పీడీసీఎల్ డివిజినల్ ఇంజనీర్ ఎం.సత్యానందం గురువారం విజయవాడలోని ఒకటో మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బెయిల్ కోసం పూచీకత్తు సమర్పించారు. కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో సత్యానందం ఏ4 నిందితుడిగా ఉన్నారు.
సత్యానందంకు హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్షతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులిచ్చారు.
ఈ కేసులో పోలీసులు కీలక వ్యక్తి శ్రీరామ్మూర్తి, మరికొందరిని అరెస్ట్ చేయగా, సత్యానందం ఇప్పటివరకు పరారీలో ఉన్నారు. కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో తన అరెస్ట్ తప్పదని గ్రహించిన సత్యానందం ముందస్తు బెయిల్ కోసం నేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ లభించడంతో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు.