సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తులో చాలా లోపాలున్నాయని సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు సోమవారం ఎన్‌ఐఏ కోర్టుకు నివేదించారు. ఎన్‌ఐఏ సరైన దిశలో దర్యాప్తు చేయలేదని.. అనేక కీలక అంశాలను సమాధానాల్లేని ప్రశ్నలుగా మిగిల్చిందని ఆరోపించారు.
దర్యాప్తును తూతూ మంత్రంగా పూర్తి చేసిందన్నారు. చార్జిషీట్‌ను కూడా చాలా హడావుడిగా దాఖలు చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై మొదట దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పలు కీలక సాక్ష్యాలను సేకరించిందన్నారు. అయితే ఆ తర్వాత దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ మాత్రం ఆ సాక్ష్యాలను ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. అందుకే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టుకు నివేదించారు.
ఎంట్రీ పాస్ లేకుండానే విమానాశ్రయంలోకి నిందితుడు..
వైఎస్ జగన్‌పై అక్టోబర్ 25, 2018లో హత్యాయత్నం జరిగిందని.. ఘటనా స్థలంలోనే నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీఎం తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు. ఆ మరుసటి రోజు శ్రీనివాసరావు ఇంటి నుంచి సిట్ అధికారులు విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు ఉపయోగించే ఏరోడ్రమ్ ఎంట్రీ పాస్ (ఏఈపీ)ని స్వాధీనం చేసుకున్నారన్నారు. హత్యాయత్నం జరిగిన రోజు ఎలాంటి ఎంట్రీ పాస్ లేకుండానే శ్రీనివాసరావు విమానాశ్రయంలోకి వెళ్లారని చెప్పారు. పాస్ ఇంటిలోనే ఉన్నప్పుడు శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా వెళ్లాడని ప్రశ్నించారు.
నిందితుడు కత్తిని లోపలకు ఎలా తీసుకెళ్లాడు?
జగన్‌తో కలిసి నిందితుడు ఫొటో దిగినట్లు ఉన్న ఫ్లెక్సీని కూడా సిట్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారని సీఎం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే అసలు ఈ ఫ్లెక్సీని ఎవరు తయారు చేశారు? ఏ ఉద్దేశంతో తయారు చేశారన్న వివరాలను ఎన్‌ఐఏ పట్టించుకోలేదని కోర్టుకు నివేదించారు. ఫెక్ల్సీ విషయంలో నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు ఇచి్చన వాంగ్మూలాన్ని సిట్, ఎన్‌ఐఏ రికార్డు చేశాయన్నారు. అయితే ఈ రెండు వాంగ్మూలాలకు వైరుధ్యం ఉందన్నారు. ఇందులో ఏది నిజమో తేల్చాల్సిన బాధ్యత ఎన్‌ఐఏపై ఉందని కోర్టుకు నివేదించారు. విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని గుర్తు చేశారు.
లోపల ఉన్న హోటల్‌లోకి వెళ్లే సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు. మరి శ్రీనివాసరావు కత్తి తీసుకుని ఎలా లోపలికి వెళ్లారో ఎన్‌ఐఏ చెప్పడం లేదన్నారు. ఈ విషయంలో విమానాశ్రయ అప్పటి భద్రతా అధికారులను, సిబ్బందిని ఎన్‌ఐఏ విచారించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. విమానాశ్రయంలో ఉన్న ఫ్యూజన్ హోటల్‌లో ఉద్యోగం సంపాదించేందుకు శ్రీనివాçÜరావు తనపై ఎలాంటి కేసులు లేవంటూ స్థానిక పోలీసుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారన్నారు.
దీన్ని ఆ హోటల్ యజమాని హర్షవర్ధన్ కూడా ధ్రువీకరించారని గుర్తు చేశారు. హర్షవర్ధన్ కారణంగానే శ్రీనివాసరావుకు అక్కడ ఉద్యోగం వచచిందన్నారు. శ్రీనివాసరావు హాజరు విషయంలో బయోమెట్రిక్ యంత్రాన్ని, సీసీ కెమెరాలను ఎన్‌ఐఏ సరిగా విశ్లేషించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటన్నింటి దృష్ట్యా ఈ కేసులో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ వాదనలు వినిపించేందుకు ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది సిద్ధిరాములు గడువు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment