సత్యానందం లొంగుబాటు
* కాల్‌మనీ కేసులో కోర్టులో లొంగిపోయిన నిందితుడు
* మరో కేసులో అరెస్టు
విజయవాడ సిటీ/ఇబ్రహీంపట్నం: కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కేసులో నాలుగో నిందితుడైన విద్యుత్ శాఖ డీఇ ఎం.సత్యానందం గురువారం విజయవాడలో ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయాడు. మరో కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కాల్‌మనీ కేసులో సత్యానందంకు హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఒకటో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో సత్యానందం లొంగిపోయాడు. రూ.లక్ష పూచీకత్తు సమర్పించడంతోపాటు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మాచవరం పోలీసుస్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని సత్యానందంను హైకోర్టు ఆదేశించింది.
సత్యానందం కోర్టుకు సమర్పించిన పూచీకత్తును ఇన్‌చార్జి న్యాయమూర్తి డి.సత్యప్రభాకరరావు పరిశీలించారు. కాగా రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు వార్షిక నేర సమీక్షను విలేకరుల కు విడుదల చేస్తున్న సమయంలోనే సత్యానందం లొంగుబాటు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీం పట్నం పోలీసులు మరో కేసులో అతడిని అదుపులోకి తీసుకొని తరలించారు. ఇది ఇలా ఉండగా విజయవాడ కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం సత్యానందం విలేకరులతో మాట్లాడాడు. కాల్‌మనీ కేసులో తాను నిర్దోషినని చెప్పుకున్నాడు.