j v ramudu
-
'ఏవోబీలో పరిస్థితి అదుపులో ఉంది'
విజయనగరం : ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లో పరిస్థితి అదుపులో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు వెల్లడించారు. మంగళవారం విజయనగరం గ్రామీణ పోలీస్‌స్టేషన్‌తోపాటు పీటీసీలోని నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం జె.వి.రాముడు మాట్లాడుతూ... విజయనగరం జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులతోపాటు పోలీస్ సౌకర్యాలు పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని చెప్పారు. పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని డీజీపీ రాముడు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ డీఐజీ, జిల్లా ఎస్పీతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఒక్క కేసులోనే సత్యానందంకి బెయిల్ : డీజీపీ
విజయవాడ : కాల్‌మనీ కేసుకి సంబంధించి ఓ కేసులో మాత్రమే డీఈ సత్యానందం బెయిల్ పొందాడని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు వెల్లడించారు. అతని మీద మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో విచారణ కోసం సత్యానందంను అదుపులోకి తీసుకుంటామని రాముడు స్పష్టం చేశారు. గురువారం విజయవాడలో ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన నేరాల సంఖ్యపై జేవీ రాముడు మాట్లాడారు. ఈ ఏడాది 100 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. మరో 96 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాలో 2,710 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. 2014తో పోలిస్తే ఈ ఏడు నేరాల సంఖ్య 4.23 శాతం తగ్గిందని డీజీపీ రాముడు విశ్లేషించారు. -
సైకో సూది వ్యవహారం పెద్దది చేయవద్దు
నెల్లూరు : తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టిస్తున్న సైకో సూది వ్యవహరాన్ని పెద్దది చేయవద్దని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు మీడియాకు సూచించారు. ఈ అంశాన్ని పద్దది చేసి మరింత మందికి ఆలోచన కల్పించ వద్దని కోరారు. ఆదివారం నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా తడలో చెక్‌పోస్ట్ వద్ద ఐ క్లిక్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పోలీస్ శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంపొందిస్తామని ఆయన తెలిపారు. ఆ తర్వాత భీమునిపాలెం చెక్ పోస్ట్ పనితీరును జె.వి.రాముడు పరిశీలించారు. -
అదో సిల్లీ కేసు
దాని పూర్తి వివరాలు నా దృష్టిలో ఉండవు కేటీఆర్ గన్‌మెన్‌పై ఉన్న కేసుపై డీజీపీ వ్యాఖ్య మత్తయ్య మా దృష్టిలో ఫిర్యాదుదారుడని స్పష్టీకరణ హైదరాబాద్: విశాఖపట్నం పోలీసు కమిషనరేట్‌లోని పెందుర్తి పోలీసుస్టేషన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ గన్‌మెన్, అనుచరులపై నమోదుయిన కేసు సిల్లీ కేసు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట రాముడు వ్యాఖ్యానించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాముడు మాట్లాడారు. ఈ కేసుతో పాటు ఓటుకు కోట్లు కౌంటర్ కేసులపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు డీజీపీ ఇలా స్పందించారు. విలేకరులు: 2013లో పెందుర్తితో కేటీఆర్ గన్‌మెన్, అనుచరులపై ఉన్న కేసు ఏమిటి? ఇన్నాళ్ళ తరవాత ఇప్పుడు హడావుడిగా నోటీసులు ఎందుకు జారీ చేశారు? డీజీపీ: అదో సిల్లీ కేసు. అలాంటి వాటికి సంబంధించిన వివరాలన్నీ నా దగ్గర ఉండవు. రోటీన్‌గానే నోటీసులు ఇచ్చి ఉంటారు. స్థానిక పోలీసుల్ని అడగండి. విలేకరులు: తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఓటుకు కోట్లు కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్యకు ఏపీ పోలీసులు షెల్టర్ ఇచ్చారనే విమర్శలున్నాయి కదా...! డీజీపీ: మత్తయ్య ఓ ఫిర్యాదుదారిడిగానే మాకు తెలుసు. ఓ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తికి అండగా ఉండాల్సిన బాధ్యత పోలీసులకు, ప్రభుత్వానికి ఉంది. అందుకు తగ్గట్టే స్పందించాం. విలేకరులు: రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడులు పెరిగాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని సంఘటనలూ కనిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? డీజీపీ: రాష్ట్రంలో ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎవరైనా బాధితులు ఉంటే వచ్చి నాతో మాట్లాడవచ్చు. అయితే ఈ సందర్భంగా అక్కడే ఉన్న అదనపు డీజీ (శాంతిభద్రతలు) ఆర్పీ ఠాకూర్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ... గడిచిన ఆరు నెలల్లో ఒక్క ఫ్యాక్షన్ హత్య కూడా నమోదు కాలేదన్నారు. పొలిటికల్ క్రైమ్ పూర్తిగా తగ్గిందని చెప్పారు. విలేకరులు: ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తున్న కేసులు తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఓటుకు కోట్లుకు కౌంటరేనా? నోటీసుల జారీ కూడా వారి యాక్షన్‌కు రియాక్షన్‌లా కనిపిస్తోంది... డీజీపీ: వీటిపై మీ ఉద్దేశం ఏమిటి? అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. సీఐడీ దగ్గర ఉన్న కేసు దర్యాప్తులో భాగంగానే నోటీసుల జారీ ప్రక్రియ జరుగుతోంది. దీనిపై ఎక్కువ ఆలోచించకండి. విలేకరులు: కొందరు మాజీ డీజీపీలే మీవి కౌంటర్ కేసులని, మీది రియాక్షన్ అని అంటున్నారు కదా..! డీజీపీ: రిటైర్ అయినవాళ్ళు ఏదైనా చెప్పవచ్చు. వారికి ఎలాంటి క్రమశిక్షణా నియమావళిలు ఉండవు. అది వాస్తవం కాదు. విలేకరులు: ఏపీ-తెలంగాణ పోలీసు మధ్య విభేదాలు వచ్చాయని, అవి కొనసాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి... డీజీపీ: మేమంతా ఆలిండియా సర్వీసు అధికారులం. మాకు నేషనల్ ఇంట్రెస్ట్ అనేది తొలి ప్రాధాన్యం. దేశం మొత్తానికి ఒకే పోలీసు వ్యవస్థ ఉంటుంది. తెలంగాణ అధికారులతో స్నేహపూరితంగా ఉన్నాం. ఎలాంటి అగాధం లేదు. -
నార్కెట్పల్లిని సందర్శించిన డీజీపీ
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు శుక్రవారం అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్కెట్‌పల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు అభివృద్ధి పనులను ఆయన సమీక్షించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే స్థానిక కొండ మీద కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణ పనులను రాముడు ప్రారంభించారు. అనంతరం రూ. 1.05 కోట్లతో నూతనంగా నిర్మించనున్న రోడ్డుతోపాటు... గ్రామంలోని శ్మశాన వాటిక ప్రహరిగోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత రూ. 1.60 కోట్లతో గ్రామంలో నిర్మించిన రోడ్డును రాముడు ప్రారంభించారు. -
ఏపీలో 22 మంది డీఎస్పీలు బదిలీ
హైదరాబాద్ : రాష్ట్రంలో 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు శనివారం ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో ఎస్పీలకు డీజీపీ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అలాగే ఆర్థిక, ఇతర నేరాలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలకు డీజీపీ వెల్లడించారు. -
విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే తుళ్లూరు
డీజీపీ జేవీ రాముడు వెల్లడి విజయవాడ సిటీ : రాజధాని ప్రతిపాదిత ప్రాంతమైన తుళ్లూరు సబ్ డివిజన్ విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే ఉంటుందని రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్ జేవీ రాముడు తెలిపారు. కమిషనరేట్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో డీజీపీ పాల్గొన్నారు. రాజధాని పట్టణం స్మార్ట్ సిటీగా రూపొందించాల్సి ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కమిషనరేట్ పరిధిలోకి ఆ ప్రాంతాన్ని తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు. ఏ ప్రాంతం ఏ కమిషనరేట్ పరిధిలో ఉండాలనేది మాత్రం ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్టు వివరించారు. సమావేశంలో అదనపు డీజీపీలు ఎన్వీ సురేంద్రబాబు, అనూరాధ, వీఎస్ కౌముది, ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
నా పరిస్థితే ఇలా ఉంటే...
గత ఏడాది నవంబర్‌లో చోరీకి గురైన రూ.18 లక్షలు సొమ్ము ఇప్పటి వరకు రికవరీ చేయలేకపోయారంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లో జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడ్ని కలసి కేసు పురోగతిపై వివరణ కోరారు. తాను ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు పోలీసులు పట్టించుకోకపోవడంపై జేసీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే చోరీకి గురైంది జూబ్లిహిల్స్ ప్రాంతంలో కనుక ఆ కేసు తెలంగాణ రాష్ట్ర పరిధిలోనిదని జేసీకి జేవీ రాముడు వివరించారు. నగదు చోరీ కేసు ఎంత పురోగతి సాధించిందో తెలుసుకోవాలని రాముడు అక్కడే ఉన్న హైదరాబాద్ నగర డీసీపీ కమలాసన్‌రెడ్డికి సూచించారు. గత ఏడాది నవంబర్‌లో జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ బ్యాంక్ నుంచి జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది రూ. 18 లక్షల నగదు డ్రా చేశారు. ఆ క్రమంలో బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన జేసీ సిబ్బంది వద్దనున్న ఆ నగదు చోరీకి గురైంది. దాంతో జేసీ దివాకర్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగి ఎనిమిది నెలల కావస్తున్న కేసులో ఇంత వరకు పురోగతి లేదని జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.