నా పరిస్థితే ఇలా ఉంటే...
గత ఏడాది నవంబర్లో చోరీకి గురైన రూ.18 లక్షలు సొమ్ము ఇప్పటి వరకు రికవరీ చేయలేకపోయారంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్లో జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడ్ని కలసి కేసు పురోగతిపై వివరణ కోరారు. తాను ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు పోలీసులు పట్టించుకోకపోవడంపై జేసీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే చోరీకి గురైంది జూబ్లిహిల్స్ ప్రాంతంలో కనుక ఆ కేసు తెలంగాణ రాష్ట్ర పరిధిలోనిదని జేసీకి జేవీ రాముడు వివరించారు. నగదు చోరీ కేసు ఎంత పురోగతి సాధించిందో తెలుసుకోవాలని రాముడు అక్కడే ఉన్న హైదరాబాద్ నగర డీసీపీ కమలాసన్రెడ్డికి సూచించారు.
గత ఏడాది నవంబర్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ బ్యాంక్ నుంచి జేసీ దివాకర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది రూ. 18 లక్షల నగదు డ్రా చేశారు. ఆ క్రమంలో బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన జేసీ సిబ్బంది వద్దనున్న ఆ నగదు చోరీకి గురైంది. దాంతో జేసీ దివాకర్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగి ఎనిమిది నెలల కావస్తున్న కేసులో ఇంత వరకు పురోగతి లేదని జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.