
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): చెడు అలవాట్లకు దూరంగా ఉండమని చెప్పడమే ఆమె చేసిన పాపం. తన బిడ్డ జీవితం నాశనం కాకుండా చూడాలన్న అత్త (మేనత్త) ను దారుణంగా రాయితో కొట్టి చంపిన చిన్న అల్లుడిని కొత్తపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వించిపేట ఫ్లోర్‌మెన్ బంగ్లా ప్రాంతానికి చెందిన షేక్ కరిమా, ఇస్మాయిల్ భార్యాభర్తలు. వీరి చిన్న కుమార్తెను మేనల్లుడైన టిప్పు సుల్తాన్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే కొంత కాలంగా టిప్పుసుల్తాన్ చెడు అలవాట్లకు బానిసై భార్యను వేధింపులకు గురి చేయసాగాడు.
అత్త కరీమా వారించింది. దీంతో తన ఆనందానికి అడ్డుగా ఉన్న అత్తను ఎలా అయినా సరే అడ్డు తొలగించుకోవాలనే భావనతో గత నెల 29వ తేదీన తోపుడు బండ్లు ఇస్తున్నారని చెప్పిన టిప్పుసుల్తాన్ అత్తను తనతో పాటు తీసుకువెళ్లాడు. రాత్రి చీకటి పడే వరకు నగరంలో అక్కడక్కడ తిప్పి అర్ధరాత్రి నైనవరం ఫ్‌లై ఓవర్ దిగువన ఉన్న రైలు పట్టాల వద్దకు కరీమాను తీసుకువెళ్లాడు. రాయి తీసుకుని అత్త తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భార్య కనిపించకపోవడంతో కరీమా భర్త ఇస్మాయిల్ 30వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెల్లవారుజామున రైల్వే ట్రాక్ వద్ద మహిళను హత్య చేసి పడేశారని తెలుసుకున్న ఇస్మాయిల్, ఇతర కుటుంబీకులు అక్కడకు వెళ్లి కరీమాను గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి టిప్పుసుల్తాన్ కోసం వెతుకులాడారు. ఫ్లోర్‌మెన్ బంగ్లా వద్ద మంగళవారం మధ్యాహ్నం నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ ఉమర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment