సాక్షి, హైదరాబాద్/నాగోలు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు విచారణలో భాగంగా రాచకొండ పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. ప్రేమించిన ప్రియురాలు దూరం అవుతుందన్న సాకుతో ఫిబ్రవరి 17 న తోటి స్నేహితుడిని అత్యంత పాశవికంగా నిందితుడు హరిహరకృష్ణ హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం పోలీసులు గుర్తుపట్టకుండా మృతదేహాన్ని క్రూరంగా చేతి వేళ్ళు, పెదాలు, గుండె, మర్మాంగాలను కోసి దహనం చేశాడు. అనంతరం దొరికిపోతాననే భయంతో తానే స్వయంగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఎదుట గత నెల 24న లొంగిపోయాడు.
ఈ క్రమంలో పోలీసులు హత్యకు ముందు, తర్వాత పరిణామాలను సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసి తెలుసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నిందితుడు హరిని హత్య జరిగిన ప్రదేశం అబ్దుల్లాపూర్ మెట్ కు తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. దానికంటే ముందు నిందితుడు హరిని చర్లపల్లి జైలు నుంచి తరలించి వనస్థలిపురం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి కస్టడీ విచారణ ప్రారంభించారు. యువతితో పరిచయం, సేహితుడి మధ్య విభేదాలను ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడు హరిని తిరిగి చర్లపల్లి జైలులో రిమాండుకు తరలించారు.
హసన్‌తో పాటు హరి సోదరినీ విచారించిన పోలీసులు
నిందితుడు హరి సోదరి మూసారాంబాగ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను కూడా విచారించినట్టు తెలిసింది. హత్య గురించి ఆమెకు ముందే తెలుసునని అనుమానించిన పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నిందితుడు హరి స్నేహితుడు హసన్‌ను కూడా శనివారం మరోసారి పోలీసులు విచారించినట్టు తెలిసింది.
యువతికి సంబంధించిన ఆధారాలు దొరకలేదు– రాచకొండ సీపీ చౌహాన్
అబ్దుల్లాపూర్ మెట్ హత్య కేసులో యువతి కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ చెప్పారు. హరిని విచారిస్తున్నామని అన్ని ఆధారాలూ సేకరిస్తున్నామని తెలిపారు. దర్యాప్తులో ఉన్న కేసుపై ఇప్పుడే పూరిస్థాయిలో సమాచారం చెప్పలేమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment