బ్యూటీషియన్ పద్మ , అనుమానితుడు నూతనకుమార్
జిల్లాలోని హనుమాన్‌జంక్షన్‌లో ఓ బ్యూటీషియన్‌పై జరిగిన దారుణ హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. నిందితుడు కత్తితో కర్కశంగా ఆమె చేతులు, మెడ కోశాడు. కాళ్లను వైర్‌తో కట్టేసి ఊడిపోకుండా ట్యాగ్‌లు వేశాడు. ముఖాన్ని కవర్‌తో ముసుగు వేసి పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వాళ్లకు కేకలు వినిపించకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి విచక్షణారహితంగా కత్తిపోట్లు పొడిచాడు. తీవ్ర గాయాలతో బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది.
హనుమాన్‌జంక్షన్ రూరల్ : హనుమాన్ జంక్షన్‌లో ఓ బ్యూటీషియన్‌పై జరిగిన దారుణ హత్యాయత్నం తీవ్ర కలకలం సృష్టించింది. కాళ్లు కట్టేసి, చేతులను కత్తితో అత్యంత క్రూరంగా నరికి వేయటం, ముఖానికి పూర్తిగా కవర్ చుట్టి వేసిన అఘాయిత్యం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఇరుగుపొరుగు వాళ్లకు ఆమె కేకలు వినిపించకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి పైశాచికంగా హత్యాయత్నం చేశారు. మహిళ శరీరంపై విచక్షణరహితంగా కత్తిపోట్లు పొడిచి శాడిజాన్ని చూపించారు. హత్యాయత్నం చేసిన వారు పరారైన తర్వాత బాధితురాలు రక్తపు మడుగులో దాదాపు 36 గంటల పాటు మృత్యువుతో పోరాడింది.
వివరాల్లోకి వెళ్లితే.. రాజమండ్రికి చెందిన పల్లె పద్మ, సూర్యనారాయణలకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల పాటు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉన్న వీరు ఆ తర్వాత జంక్షన్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో సూర్యనారాయణకు ఉద్యోగం రావటంతో ఇక్కడకు మకాం మార్చారు. పద్మ కూడా ఏలూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకుంది. అప్పటి వరకూ సాఫీగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు మొదలయ్యాయి.
దీంతో భర్తతో విభేదించిన పద్మ కొద్దికాలంగా ఏలూరులోని వెన్నవల్లి వారి వీధికి చెందిన బత్తుల నూతనకుమార్ విక్టర్ అనే వ్యక్తితో సహ జీవనం చేస్తోంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యూటీపార్లర్‌లో పద్మ బ్యూటీషియన్‌గా పని చేస్తుండగా, నూతనకుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం తారకరామ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో వీళిద్దరూ కలిసి అద్దెకు దిగారు. ఈ నెల 23వ తేదీ రాత్రి పద్మ, నూతనకుమార్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని భర్త దగ్గరే ఉంటున్న తన పెద్ద కూతురుతో ఫోన్‌లో పద్మ ఆ రాత్రే చెప్పింది. ఆ తర్వాత నుంచి ఆమె సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో ఆందోళన చెందిన కుమార్తె తన తండ్రి సూర్యనారాయణకు విషయం చెప్పింది. దీంతో ఇద్దరూ పద్మ అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు శనివారం ఉదయం వచ్చి తలుపులు తీయటంతో రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. జంక్షన్ పోలీసులకు సమాచారం అందించటంతో హుటాహుటిన 108 అంబులెన్స్‌లో పద్మను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఘటనా స్థలంలో దృశ్యం అత్యంత క్రూరంగా ఉండటం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ఒంటిపై దుస్తులు తీసివేసి కత్తితో కర్కశంగా చేతులు, మెడ నరికివేయటం, కాళ్లు రెండు వైర్‌తో కట్టేసి, మళ్లీ ఆ వైర్ ఊడిపోకుండా ట్యాగ్‌లు వేయటం, ముఖానికి కవర్‌తో ముసుగు వేయటం హత్యాయత్నానికి పాల్పడిన దుండగుల పైశాచికత్వాన్ని తెలియజేస్తున్నాయి. పద్మ పడి ఉన్న గదిలో ఇంజక్షన్లు, సిరంజన్‌లు, మందు బాటిళ్లు పడి ఉన్నాయి. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్లకు ఆమె అరుపులు వినిపించకూడదనే ఉద్దేశ్యంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బహుశా 24వ తేదీ ఉదయమే హత్యాయత్నం జరిగి ఉండవచ్చని ఘటనాస్థలిలో ఎండిపోయిన రక్తపు మరకలను బట్టి పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ హత్యాయత్నంపై జంక్షన్ సీఐ వైవీవీఎల్. నాయుడు, ఎస్‌ఐ వి.సతీష్ ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పద్మతో కలిసి సహజీవనం చేస్తున్న ఏలూరుకు చెందిన బత్తుల నూతనకుమార్ విక్టర్‌పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో ఆ అనుమానానికి మరింత బలం చేకూరింది. వీళ్లిద్దరూ సహ జీవనం ప్రారంభించిన తర్వాత నూతనకుమార్ వ్యవహారంతో విసుగు చెందిన పద్మ గతంలో జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. కాగా, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగానే నిందితుడిని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment