ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గళ్ల నాగరాజు (అంతరచిత్రం) భార్య నాగమణితో భర్త నాగరాజు, డీజీపీకి నాగరాజు రాసిన సూసైడ్ నోట్
కృష్ణలంక (విజయవాడ తూర్పు) : మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న తన భార్య ఆత్మహత్యకు కారణమైన సహ ఉద్యోగిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర మనస్తాపం చెందిన ఆమె భర్త గళ్ల నాగరాజు (34) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీఎస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న గల్లా నాగమణి (29), భర్త నాగరాజు, ఇద్దరు పిల్లలు వర్షిత్ (5), దీపేష్ (2) లతో కలిసి కృష్ణలంక బాలాజీనగర్‌లోని మొదటి లైన్‌లో నివాసముంటున్నారు. గత మార్చి 19వ తేదీ రాత్రి డ్యూటీ అనంతరం ఉదయం భర్త నాగరాజు నాగమణిని ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం పిల్లలను స్కూల్‌లో దించి కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చి చూస్తే భార్య నాగలక్ష్మి బెడ్‌రూంలో చీరతో ఫ్యాన్ హుక్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని నిర్జీవంగా వేలాడుతూ కనిపిం చింది. దీంతో చుట్టుపక్కల వారి సాయంతో కిం దికి దించి చూడగా అప్పటికే ఆమె చనిపోయింది.
ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న పోలీసులు
అయితే భర్త నాగరాజు ఇటీవల లారీలు కొనుగోలు చెయ్యడంతో వ్యాపారంలో నష్టం వాటిల్లిందని, దీనిపై భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవలు జరుగుతున్నాయని, సున్నిత మనస్తత్వంగల నాగమణి దీని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, స్థానికులు, మృతురాలి తల్లిదండ్రులు మాత్రం ఇంట్లో భార్యభర్తల మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఆమె మృతికి ఇతర కారణాలు ఏమైనా ఉండి ఉండవచ్చని, ఆ దిశగా దర్యాప్తు చెయ్యాలంటూ కోరారు.
బాధితుడి ఫిర్యాదు బుట్టదాఖలు..
తన భార్య నాగలక్ష్మి మృతికి వన్ టౌన్‌లోని సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సహ ఉద్యోగి జె.నాగరాజు వేధింపులే కారణమని భర్త పోలీసులకు చేసిన ఫిర్యాదును బుట్టదాఖలు చేసి అనుమానితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. భార్య మృతి చెంది ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు అందుకు కారణమైన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన చావుకు గల కారణాలను తెలియజేస్తూ పోలీసు శాఖ డీజీపీకి సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నోటి నుంచి నురుగులు కక్కుతూ అపస్మారక స్థితిలో పడిన అతన్ని చూసి కుటుంబ సభ్యులు, స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతన్ని నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment