![Due To Dowry Harassment Married Women Suicide In Krishna - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/26/women.jpg.webp?itok=IUkXbCFa)
మొవ్వ(పామర్రు): పచ్చి బాలింతరాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఐదు నెలల ఆమె కుమార్తె తల్లి కోసం ఏడుస్తుండటం స్థానికులను కంట తడిపెట్టించింది. ఈ ఘటన మొవ్వ మండలం కూచిపూడి అగ్రహారంలో చోటు చేసుకుంది. కూచిపూడి ఎస్‌ఐ జి. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామానికి చెందిన దుర్గా నాగ సుచరిత (22)కి మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన పెనుమూడి నాగ నరేంద్ర శర్మతో 2018 ఏప్రిల్ 27న వివాహమైంది. వీరికి 5 నెలల చిన్నారి ఉంది. ఇటీవల యార్లగడ్డ నుంచి సారెతో సహా కూచిపూడి గ్రామానికి విచ్చేసిన సుచరితకు అత్తవారింటిలో వరకట్న వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆదివారం మృతిచెందింది.
ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు అత్తింటివారు ఫోన్ చేసి చెప్పారు. హుటాహుటిన చేరుకున్న కుటుంబ సభ్యులు కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుమార్తె మృతికి భర్త నాగ నరేంద్రశర్మ, అతని తల్లి విశాలాక్షిల వరకట్న వేధింపులే కారణమని మృతురాలి తండ్రి చావలి భీమేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా సోమవారం మొవ్వ తహసీల్దార్ డెక్కా రాజ్యలక్ష్మి సమక్షంలో పంచనామ నిర్వహించి మృతదేహాన్ని బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అవనిగడ్డ డీఎస్‌పీ మహబూబ్ బాషా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment