మృతురాలు రత్నకుమారి (ఫైల్) పోలీసులకు లొంగిపోయిన భర్త
కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట : భార్యను కట్టుకున్న భర్త కడతేర్చిన ఘటన పట్టణంలోని వైవై కాలనీలో బుధవారం అర్థరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే మాడావత్ యలమంద నాయక్ భార్య రత్నకుమారి (40) నటరాజ్ సెంటర్‌లో నూడిల్స్ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి వివాహమైన కుమార్తె ఉంది. అయితే ఇటీవల యలమంద నాయక్ హోటల్ విక్రయించాడు. దీంతో భార్యాభర్తల మధ్య నగదు విషయమై వారం రోజులుగా గొడవ జరుగుతోంది. హోటల్ విక్రయించిన నగదు తనకు ఇవ్వాలని భార్యను యలమంద నాయక్ తీవ్ర వత్తిడి చేస్తున్నాడు. ఈ క్రమంలో అర్థరాత్రి 12 గంటల సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన భర్తకు బెడ్‌రూంలో భార్య ఎవరితోనే ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది.
ఎవరితో మాట్లాడుతున్నావంటూ అడిగాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మంచంపై ఉన్న కండువాను భార్య మెడకు చుట్టి ఊపిరాడకుండా చేశాడు. కొద్దిసేపటికి భార్య రత్నకుమారి అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందింది. ఏం చేయాలో తెలియక ఇంటికి తలుపులు వేసి బైకుపై సమీపంలోని వత్సవాయి మండలం గోపినేనిపాలెం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి భార్యను హత్య చేశానని భయంగా ఉందని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో వారు ఖమ్మంలో ఉంటున్న మృతురాలి కుమార్తెకు సమాచారం అందించారు. గురువారం తెల్లవారుజామున బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే మృతి చెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అబ్దుల్ నబీ, ఎస్‌ఐలు ధర్మరాజు, తాతాచార్యులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతురాలి సోదరి బాణావత్ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పోలీసులకు లొంగుబాటు..
భార్యను హత్య చేసిన భర్త యలమంద ఉదయం 10 గంటల సమయంలో పోలీసులకు లొంగిపోయాడు. ఇదిలా ఉండగా తనకు ఇద్దరు భార్యలున్నారని చెప్పారు. మృతి చెందినది మొదటి భార్య కాగా, రెండవ భార్య మిర్యాలగూడలో ఉంటుందని చెప్పారు. కానీ తరచూ ఇరువురి భార్యలు ఘర్షణ పడేవారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment