దీనంగా కూర్చున్న తల్లి నాంచారమ్మ (సర్కిల్‌లో) అక్కాచెల్లెళ్లు ప్రశాంతి, దివ్య (ఫైల్)
కృష్ణాజిల్లా, పెడన: ఒకరి తర్వాత ఒకరు 48 గంటల్లో అక్కాచెల్లెళ్లు చనిపోవడం పెడన పట్టణంలో సంచలనం కలిగించింది. వివరాలిలా ఉన్నాయి. మోకా రామాంజనేయులు, నాంచారమ్మలకు ఇద్దరు ఆడ పిల్లలు. పెడన చేపల మార్కెట్‌లోని నిరుపయోగంగా ఉన్న దుకాణాల్లోని ఒకదాంట్లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన రామాంజనేయులు ఈ ఏడాది జనవరి 1న అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి నాంచారమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. మంచిచెడ్డ అంతా బంధువులే చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల కిందట చుట్టుపక్కల వారితో పాటు, బంధువుల వద్ద కూడా మేం కూడా చనిపోతాం.. అని అంటోంది. అయితే, శనివారం రాత్రి వీరి చిన్న కుమార్తె మోకా దివ్య (3) చనిపోయింది.
ఆదివారం ఉదయం అందరికి తెలిసి పరామర్శించడానికి వెళ్లిన వారికి అనారోగ్యంతో చనిపోయిందని, విరేచనాలు, జ్వరం వచ్చిందని, మంచి వైద్యుడికి చూపించడానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదనే విషయాన్ని చెప్పింది. దీంతో చుట్టుపక్కల వారు, వివిధ సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొంత ఆర్థిక సాయం చేసి పెద్ద పాప మోకా ప్రశాంతి పేరు మీద డిపాజిట్ చేస్తామని నాంచారమ్మకు హామీ ఇచ్చారు. పాపను జాగ్రత్తగా చూసుకోవాలని కొంత నగదును కూడా చేతికి అందజేశారు. అయితే, సోమవారం ఉదయం పెద్ద పాప మోకా ప్రశాంతి (5) కూడా చనిపోవడంతో స్థానికులకు, బంధువులకు సైతం అనుమానాలు వెల్లువెత్తాయి. వారం నుంచి మేం చచ్చిపోతామంటున్న తల్లి నాంచారమ్మ కావాలనే ముందుగా పిల్లలను చంపేసిందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రశాంతికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల అంతకుముందే స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ వైద్యుడికి కూడా చూపించారు. ఆయన కూడా పాప ఆరోగ్యంగానే ఉందని, ఫుడ్ పాయిజన్ ఏమైనా అయి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం.
పోలీసుల రంగ ప్రవేశం..
ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సీఐ బి రవికుమార్, ఎస్‌ఐ బి అభిమన్యుతో సిబ్బంది వచ్చి మార్కెట్‌లో అందరిని విచారించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నాంచారమ్మ ఉంటున్న ఇంటిని (దుకాణాన్ని) సైతం పరిశీలించారు. బియ్యం, బంగాళాదుంపలు, కోడిగుడ్లు, ఉల్లిపాయలు తదితర ఆహార పదార్థాలు సైతం కుళ్లిపోయి ఉన్నట్లు గుర్తించారు. నాంచారమ్మను కూడా పోలీసులు విచారించారు. ప్రశాంతి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
పీఎం నివేదికను బట్టి పూడ్చిన మృతదేహానికి కూడా...?
చిన్న పాప మోకా దివ్యను ఆదివారం శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు. 48 గంటల్లోగా దివ్య అక్క ప్రశాంతి కూడా చనిపోవడంతో అనుమానంపై పోలీసులు ప్రశాంతికి పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఆ నివేదికలో విష ప్రయోగం ఏమైనా జరిగిందా లేక ఫుడ్ పాయిజన్ అయ్యిందా అనే విషయాలు వెల్లడి కానున్నాయి. విష ప్రయోగం జరిగినట్లు నిర్ధారణ అయితే చిన్నపాప మోకా దివ్య మృతదేహాన్ని కూడా వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుందనే వాదన వ్యక్తమవుతోంది. పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీసి పీఎం నిర్వహించాలంటే మండల మేజిస్ట్రేట్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ప్రశాంతి పోస్టుమార్టం నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆరోగ్య సిబ్బంది పరుగులు...
చిన్నారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం.. ఫు డ్ పాయిజన్ అని అనుకోవడంతో వైద్య, ఆరో గ్య సిబ్బంది పరుగులు పెట్టారు. చేపల మార్కెట్ వద్ద పరిస్థితి గమనించి ఎలా జరిగిందో ఆరా తీ యడంతో పాటు ఏం తిన్నారు, ఎప్పుడు తిన్నా రు..తదితర విషయాలను నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment