వాహనదారుల నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్సై ప్రసాద్,మీటర్ రీడింగ్‌ను తెలియజేస్తున్న మానిటర్
గుణదల (విజయవాడ తూర్పు): నిత్యం వందలాది వాహనాలతో కిటకిటలాడే ఒక పెట్రోలు బంకులో మీటర్ మాయాజాలం బట్టబయలైంది. లక్షలాది రూపాయాలు అక్రమంగా దండుకుంటున్న వ్యవహారం శనివారం రాత్రీ గుణదలలోని పడవలరేవు పెట్రోలు బంకులో వెలుగుచూసింది. సేకరించిన వివరాల ప్రకారం.. పడవలరేవు కూడలివద్ద దాదాపు మూడు దశాబ్దాలుగా విజయలక్ష్మీ ఎంట్రర్‌ప్రైజెస్ పేరుతో పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు. నగరంలో ప్రధాన రహదారిగా ఉన్న ఏలూరురోడ్డుపై ఈ పెట్రోలు బంకు ఉంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వందలాదిగా వినియోగదారులు ఇక్కడ పెట్రోలు కొట్టిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ వినియోగదారుడు పెట్రోలు తీసుకుంటుండగా పంపు తీయగానే మీటర్ రీడింగ్ రూ. 14గా నమోదైంది. దీంతో తనకు పెట్రోలు ఇవ్వకుండానే మీటర్ రీడింగ్‌పై నగదు నమోదవ్వడాన్ని సదరు వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. ఇంతలో మరో వాహనచోదకుడికి ఇలాగే జరిగింది. పెట్రోలు బండిలో కొట్టకుండానే రూ.5 బిల్లు మానిటర్‌పై వచ్చేసింది. దీంతో వినియోగదారులకు బంకు సిబ్బందికి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో మాచవరం ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నాడు. వివరాలు సేకరించారు.
గతంలో మూసివేత....
కల్తీ పెట్రోలు అమ్మకం, రీడింగ్‌లో అవకతవకల కారణంగా గతంలో రెండుసార్లు ఈ బంకుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అవకతవకలు బట్టబయలు కావటంతో రెండు సార్లు ఈ బంకు మూతపడింది. ఇటీవలే మరలా బంకును పునఃప్రారంభించారు. అదే తరహాలో మోసం బయటపడటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఆందోళన చేసినా బంకు యాజమాన్యం రాకపోగా, పనిచేస్తున్న సిబ్బంది పరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment