
మృతుడు దుర్గాప్రసాద్ (ఫైల్)
యనమలకుదురు (పెనమలూరు) : యనమలకుదురులో రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరిలో ఒకరు కేఈబీ కాల్వలో శవమై దొరకగా, బాలిక ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో కేసు మిస్టరీగా మారింది. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.యనమలకుదురు డొంక రోడ్డులో నేలటూరి దుర్గ ఓ అపార్టుమెంట్‌లో పని చేస్తుంది. భర్త నారాయణరావుకు ఆమె దూరంగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. అయితే దుర్గ (35) కొద్దికాలంగా తాపీ పని చేసే మచ్చా దుర్గాప్రసాద్ (25) తో కలిసి ఉంటోంది. కాగా దుర్గ కుమార్తెలు విజయవాడ మొగల్రాజపురంలో చదువుతున్నారు. ఈ నెల 27వ తేదీన దుర్గ పెద్ద కుమార్తె అనూష (15) ను స్కూల్ నుంచి తీసుకు వస్తానని దుర్గాప్రసాద్ బైక్‌పై వెళ్లాడు. అయితే ఇద్దరూ తిరిగి ఇంటికి రాలేదు. యనమలకుదురు చిన్న వంతెన వద్ద దుర్గాప్రసాద్ బైక్, సెల్ ఫోన్ దొరికాయి. దీంతో దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో రెండు రోజుల క్రితం దుర్గాప్రసాద్, అనూష మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
కేఈబీ కెనాల్‌లో దుర్గాప్రసాద్ శవం..
కాగా, చోడవరం గ్రామం వద్ద కేఈబీ కెనాల్‌లో శవం ఉందని గ్రామస్తులు సమాచారం ఇవ్వటంతో పోలీసులు వచ్చి కాల్వ నుంచి బయటకు తీశారు. ఆ వ్యక్తి దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన దుర్గాప్రసాద్ కాల్వలో శవమై దొరకటంతో గ్రామంలో కలకలం రేగింది. అయితే అతనితో ఇంటికి రావాల్సిన అనూష ఆచూకీ మాత్రం తెలియలేదు. అసలు ఇద్దరూ ఎందుకు అదృశ్యమయ్యారు.. దుర్గాప్రసాద్ కాల్వలో దూకి ఎందుకు చనిపోయాడు.. అనూష ఎక్కడ ఉంది.. అసలు బతికే ఉందా.. లేదా అన్న విషయాలు స్పష్టం కాకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. పోలీసులు కేఈబీ కెనాల్‌లో ఇంకా గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment