వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌టీం సిబ్బంది
కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్ (మచిలీపట్నం): తాళాలు వేసి ఉన్న ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మచిలీపట్నం బచ్చుపేటకు చెందిన పింగళి విజయసూర్యనారాయణ అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. పిల్లలకు పెళ్లిళ్లు అయిపోవటంతో భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నారు. ఇటీవల సూర్యనారాయణ మనుమరాలి ఫంక్షన్ నిమిత్తం బ్యాంకు నుంచి కొంత సొమ్మును డ్రా చేశారు. ఫంక్షన్‌లో ఖర్చుకాగా మిగిలిన రూ.1.50 లక్షలను బీరువాలో భద్రపరిచారు. ఈ నేపథ్యంలో సూర్యనారాయణ భార్య అస్వస్థతకు గురికావటంతో ఆదివారం ఉదయం చికిత్స నిమిత్తం ఇంటికి తాళాలు వేసి ఇద్దరూ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఇంటికి తిరిగి వచ్చారు. లోనికి వెళ్లి చూడగా వెనుక భాగంలోని తలుపులు తెరిచి ఉన్నాయి.
బెడ్‌రూంలోని బీరువా కూడా తెరిచి ఉంది. అందులో రూ.1.50 లక్షల నగదు కనిపించలేదు. హాలులోని మరో అలమారాలో పెట్టిన 6 కాసుల బంగారు గొలుసు కూడా కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించిన బాధితుడు చిలకలపూడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిలకలపూడి ఎస్సై గజపతిరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. బాధితుడితో మాట్లాడారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల మేర చోరీ జరిగినట్లు తేలింది. క్లూస్‌టీం సిబ్బంది నిందితుల వేలిముద్రలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment