హవాలా హవా! | Hawala Business in Vijayawada | Sakshi
Sakshi News home page

హవాలా హవా!

Published Fri, Feb 21 2020 11:41 AM | Last Updated on Fri, Feb 21 2020 11:41 AM

Hawala Business in Vijayawada - Sakshi

బెజవాడలో హవాలా, జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. వన్‌టౌన్, కొత్తపేట, భవానీపురం, గవర్నర్‌పేట, లబ్బీపేట, మొగల్రాజపురం, కృష్ణలంక ప్రాంతాల్లో ఇలాంటి వ్యాపారం చేసే ఏజెంట్లు లెక్కలేనంత మంది ఉన్నారు. ఈ అక్రమ దందా బాగోతం జీఎస్టీ అధికారులకు, ఆదాయపన్ను శాఖాధికారులకు, పోలీసులకుతెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  

విజయవాడ కొత్తపేట పరిధిలోని గణపతిరోడ్డులో కేఆర్‌ ఫ్యాషన్‌ వరల్డ్‌ అనే వస్త్ర దుకాణం ఉంది. దీనిని రాజస్థాన్‌కు చెందిన జగదీష్‌ అనే వ్యక్తి నడుపుతున్నాడు. అయితే బుధవారం రాత్రి అతను షాపులో డబ్బు లెక్కిస్తుండగా రూ. 35లక్షల నగదును కొత్తపేట  పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదుకు షాపు లావాదేవీలకుఎలాంటి ఆధారాలు దొరకలేదు. విచారిస్తే ఈ మొత్తం డబ్బు  హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు తెలిసింది. 

సాక్షి, అమరావతిబ్యూరో: ఎందుకు.. ఏమిటీ అన్న వివరాలు అవసరం లేదు.. బ్యాంకు ఖాతాతో పనేలేదు... ఇన్‌కంట్యాక్స్‌ బాధా లేదు. ఆ రూట్లో అంతా నోటిమాటపైనే పని జరుగుతుంది. గుట్టుచప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా డబ్బు పంపిస్తారు.. అదే హవాలా దందా..! ముంబై తర్వాత వాణిజ్య నగరంగా పేరుగాంచిన విజయవాడలో ఈ దందా యథేచ్ఛగా సాగుతుంది. నగరంలో బంగారం, వస్త్ర, చెప్పులు తదితర వ్యాపారాలు జోరుగా సాగుతుంటాయి. రూ. కోట్లల్లో లావాదేవీలు జరుగుతుండటంతో వ్యాపారులు కేంద్ర, రాష్ట్రాలకు కట్టాల్సిన పన్నుల చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. వివిధ నగరాల నుంచి దుకాణాలకు తెప్పించుకునే సరుకులో సగానికి మాత్రమే బిల్లులు చూపుతూ.. మిగిలిన సగం సరుకును ‘జీరో’కింద ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే వ్యాపారులకు ఇచ్చే డబ్బును సైతం హవాలా మార్గం ద్వారా యథేచ్ఛగా చెల్లింపులు చేస్తున్నారు. పైనే పేర్కొన్న రెండు ఉదంతాలు ఆకాశరామన్నలు పోలీసులకు పక్కా సమాచారం ఇవ్వడంతోనే వెలుగులోకి వచ్చాయి. 

ఐరన్‌ వ్యాపారం మాటున..  
నగరంలో బంగారం జీరో దందా ఒక ఎత్తయితే.. ఐరన్‌ వ్యాపారం మరో ఎత్తు. ఈ వ్యాపారానికి సంబంధించి హైదరాబాద్‌ నుంచి ఐరన్‌ చానళ్లు, షీట్లు, యాంగ్‌లర్లు తదితరాలను లారీల్లో దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఈ సరుకును తెచ్చే సమయంలో ఐరన్‌ ముడి సరుకును సరఫరా చేసే వ్యాపారులు రెండు రకాల బిల్లులను లారీ డ్రైవర్లకు ఇచ్చి పంపుతున్నారు. లారీలో తచ్చే స్టాకు వివరాలు తెలుపుతూ ఒరిజినల్‌ బిల్లును సీల్డ్‌ కవర్‌లో డ్రైవర్‌కు అందజేస్తారు. రెండో బిల్లులో స్టాకుకు.. వాటి విలువలో భారీ వ్యత్యాసం ఉంటోంది. వాణిజ్య ఇతరత్రా చెక్‌పోస్టు తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడకుండా సాఫీగా సాగిపోతే.. డ్రైవర్‌ తెచ్చిన ఒరిజినల్‌ బిల్లును మళ్లీ తిరిగి సరఫరా దారుడికి అందజేస్తాడు. రెండో బిల్లు విజయవాడలోని వ్యాపారికి అందజేసి సరుకు దించేస్తారు. ఉదాహరణకు రూ. 12 లక్షల సరుకును విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి పంపితే.. ఎక్కడా తనిఖీల్లో చిక్కకుండా సాఫీగా దుకాణానికి సరుకు చేరుకుంటే.. ఒరిజినల్‌ బిల్లు రూ. 12 లక్షల స్థానంలో రూ. 1.20 లక్షల బిల్లును తిరిగి పంపి.. పాత బిల్లులను కంప్యూటర్‌లో డీలిట్‌ చేసేస్తారు. ఇలా రూ. 12 లక్షల సరుకు సంబంధించి సరఫరాదారుడికి రూ. 1.20 లక్షలు వ్యాపారం జరిగినట్లు లెక్కల్లో చూపుతాడు. అలాగే వ్యాపారి నుంచి మిగితా మొత్తం రూ. 10.80 లక్షలు హవాలా మార్గం ద్వారా తీసుకుంటాడు. ఇక్కడ విజయవాడలో కూడా ఇదే తరహాలో వ్యాపారులు దందా సాగిస్తున్నారు. ఈ తరహా దందా వన్‌టౌన్, కొత్తపేట, భవానీపురం, ఆటోనగర్‌ ప్రాంతాల్లో ఉండే ఐరన్‌ దుకాణాల్లో నిత్యకృత్యమైందనే ఆరోపణలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement