hawala business
-
హవాలా హవా!
బెజవాడలో హవాలా, జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. వన్‌టౌన్, కొత్తపేట, భవానీపురం, గవర్నర్‌పేట, లబ్బీపేట, మొగల్రాజపురం, కృష్ణలంక ప్రాంతాల్లో ఇలాంటి వ్యాపారం చేసే ఏజెంట్లు లెక్కలేనంత మంది ఉన్నారు. ఈ అక్రమ దందా బాగోతం జీఎస్టీ అధికారులకు, ఆదాయపన్ను శాఖాధికారులకు, పోలీసులకుతెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విజయవాడ కొత్తపేట పరిధిలోని గణపతిరోడ్డులో కేఆర్ ఫ్యాషన్ వరల్డ్ అనే వస్త్ర దుకాణం ఉంది. దీనిని రాజస్థాన్‌కు చెందిన జగదీష్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. అయితే బుధవారం రాత్రి అతను షాపులో డబ్బు లెక్కిస్తుండగా రూ. 35లక్షల నగదును కొత్తపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదుకు షాపు లావాదేవీలకుఎలాంటి ఆధారాలు దొరకలేదు. విచారిస్తే ఈ మొత్తం డబ్బు హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు తెలిసింది. సాక్షి, అమరావతిబ్యూరో: ఎందుకు.. ఏమిటీ అన్న వివరాలు అవసరం లేదు.. బ్యాంకు ఖాతాతో పనేలేదు... ఇన్‌కంట్యాక్స్ బాధా లేదు. ఆ రూట్లో అంతా నోటిమాటపైనే పని జరుగుతుంది. గుట్టుచప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా డబ్బు పంపిస్తారు.. అదే హవాలా దందా..! ముంబై తర్వాత వాణిజ్య నగరంగా పేరుగాంచిన విజయవాడలో ఈ దందా యథేచ్ఛగా సాగుతుంది. నగరంలో బంగారం, వస్త్ర, చెప్పులు తదితర వ్యాపారాలు జోరుగా సాగుతుంటాయి. రూ. కోట్లల్లో లావాదేవీలు జరుగుతుండటంతో వ్యాపారులు కేంద్ర, రాష్ట్రాలకు కట్టాల్సిన పన్నుల చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. వివిధ నగరాల నుంచి దుకాణాలకు తెప్పించుకునే సరుకులో సగానికి మాత్రమే బిల్లులు చూపుతూ.. మిగిలిన సగం సరుకును ‘జీరో’కింద ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. అలాగే వ్యాపారులకు ఇచ్చే డబ్బును సైతం హవాలా మార్గం ద్వారా యథేచ్ఛగా చెల్లింపులు చేస్తున్నారు. పైనే పేర్కొన్న రెండు ఉదంతాలు ఆకాశరామన్నలు పోలీసులకు పక్కా సమాచారం ఇవ్వడంతోనే వెలుగులోకి వచ్చాయి. ఐరన్ వ్యాపారం మాటున.. నగరంలో బంగారం జీరో దందా ఒక ఎత్తయితే.. ఐరన్ వ్యాపారం మరో ఎత్తు. ఈ వ్యాపారానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఐరన్ చానళ్లు, షీట్లు, యాంగ్లర్లు తదితరాలను లారీల్లో దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఈ సరుకును తెచ్చే సమయంలో ఐరన్ ముడి సరుకును సరఫరా చేసే వ్యాపారులు రెండు రకాల బిల్లులను లారీ డ్రైవర్లకు ఇచ్చి పంపుతున్నారు. లారీలో తచ్చే స్టాకు వివరాలు తెలుపుతూ ఒరిజినల్ బిల్లును సీల్డ్ కవర్లో డ్రైవర్‌కు అందజేస్తారు. రెండో బిల్లులో స్టాకుకు.. వాటి విలువలో భారీ వ్యత్యాసం ఉంటోంది. వాణిజ్య ఇతరత్రా చెక్‌పోస్టు తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడకుండా సాఫీగా సాగిపోతే.. డ్రైవర్ తెచ్చిన ఒరిజినల్ బిల్లును మళ్లీ తిరిగి సరఫరా దారుడికి అందజేస్తాడు. రెండో బిల్లు విజయవాడలోని వ్యాపారికి అందజేసి సరుకు దించేస్తారు. ఉదాహరణకు రూ. 12 లక్షల సరుకును విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి పంపితే.. ఎక్కడా తనిఖీల్లో చిక్కకుండా సాఫీగా దుకాణానికి సరుకు చేరుకుంటే.. ఒరిజినల్ బిల్లు రూ. 12 లక్షల స్థానంలో రూ. 1.20 లక్షల బిల్లును తిరిగి పంపి.. పాత బిల్లులను కంప్యూటర్లో డీలిట్ చేసేస్తారు. ఇలా రూ. 12 లక్షల సరుకు సంబంధించి సరఫరాదారుడికి రూ. 1.20 లక్షలు వ్యాపారం జరిగినట్లు లెక్కల్లో చూపుతాడు. అలాగే వ్యాపారి నుంచి మిగితా మొత్తం రూ. 10.80 లక్షలు హవాలా మార్గం ద్వారా తీసుకుంటాడు. ఇక్కడ విజయవాడలో కూడా ఇదే తరహాలో వ్యాపారులు దందా సాగిస్తున్నారు. ఈ తరహా దందా వన్‌టౌన్, కొత్తపేట, భవానీపురం, ఆటోనగర్ ప్రాంతాల్లో ఉండే ఐరన్ దుకాణాల్లో నిత్యకృత్యమైందనే ఆరోపణలున్నాయి. -
నగరంలో ‘కట్టల’ పాములు!
సాక్షి, సిటీబ్యూరో: హవాలా దందాగా పిలిచే అక్రమద్రవ్య మార్పిడి నగరంలో జోరందుకుంది. ఎన్నికల నేపథ్యంలో పెరిగిన డిమాండ్‌తో డబ్బు తరలింపు సైతం పెద్ద ఎత్తున సాగుతోంది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి నగర పోలీసులు వరుసగా హవాలా ఏజెంట్లను పట్టుకుంటున్నారు. దీనికి కొనసాగింపుగా ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ట్రావెల్స్ ముసుగులో సాగుతున్న హవాలా దందా గుట్టురట్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.97 లక్షల నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సాదిఖ్ అహ్మద్ పదేళ్లుగా హుస్సేనిఆలం ప్రాంతంలో అహ్మద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థతో పాటు వెస్ట్రన్ యూనియన్ మనీ ఫ్రాంచైజీని నిర్వహిస్తున్నాడు. ఈ వ్యాపారాల్లో ఆశించిన లాభాలు రాకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన హవాలా వ్యాపారి ఫహీమ్తో పరిచయమైంది. దీంతో ఇతడూ హవాలా దందాలో దిగి దేశంలోని వివిధ ప్రాంతాలు, మెట్రో నగరాల్లో ఉన్న హవాలా ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. రూ.లక్షకు రూ.600 నుంచి రూ.800 వరకు కమీషన్ తీసుకుంటూ ఫహీమ్ సూచనల మేరకు నిర్ణీత ప్రదేశాలు, వ్యక్తుల నుంచి డబ్బు కలెక్ట్ చేసుకోవడం, వారికి అప్పగించడం చేసేవాడు. ఇందుకు సహకరించేందుకు హుస్సేనిఆలంకు చెందిన మహ్మద్ మునీర్‌ను నియమించుకున్నాడు. ఓ వ్యక్తి నుంచి వీరు డబ్బు తీసుకున్నప్పుడు వారికి రహస్య సంకేతం కానీ, ఓ కరెన్సీ నోటు నెంబర్ కానీ ఇస్తారు. దీన్ని డబ్బు రిసీవ్ చేసుకునే వ్యక్తి వీరికి చెప్పాల్సి ఉంటుంది. ఈ దందాలో భాగంగా అహ్మద్, మునీర్లు గురువారం బైక్‌పై వెళ్లి ఎస్పీ రోడ్లో రాజేష్ అనే వ్యక్తి నుంచి డబ్బుతో ఉన్న ఓ బ్యాగ్‌ను కలెక్ట్ చేసుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం వలపన్ని అహ్మద్, మునీర్‌లను పట్టుకుంది. వీరి నుంచి రూ.97 లక్షల నగదు, బైక్, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును మహంకాళి పోలీసులకు అప్పగించారు. -
హైదరాబాద్‌లో హవాలా వ్యాపారం
-
నోట్ల రద్దు.. తొలి ఫలితం వచ్చింది!
పెద్దనోట్ల రద్దు ఫలితంగా ఉగ్రవాదులకు నిధులు అందడం గణనీయంగా తగ్గిపోయిందని, దాంతోపాటు నకిలీనోట్ల రాకెట్లు, హవాలా వ్యవహారాలు కూడా గణనీయంగా తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం.. పెద్దనోట్ల రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు దాదాపు 60 శాతం తగ్గాయి. డిసెంబర్ నెల మొత్తమ్మీద కశ్మీర్ లోయలో కేవలం ఒకే ఒక్క పేలుడు సంభవించింది. హవాలా వ్యాపారం కూడా సగానికి సగం తగ్గిపోయింది. హవాలా ఏజెంట్ల కాల్ ట్రాఫిక్ సగం పడిపోయిందని టెల్కోలు చెబుతున్నాయి. నకిలీ నోట్లు కూడా బాగా తగ్గాయని అంటున్నారు. ప్రధానంగా పాకిస్థాన్‌లో ప్రింట్ అయ్యే ఈ నకిలీ నోట్ల వ్యవహారానికి ఒక్కసారిగా చెక్ పడింది. కొత్త నోట్లలో ఉన్న సెక్యూరిటీ ఫీచర్లు, ఉపయోగించిన రంగులు వీటన్నింటినీ కాపీ చేయడానికి వాళ్లకు చాలా సమయం పడుతోంది. దాంతో ఇప్పట్లో నకిలీనోట్లు వచ్చే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. క్వెట్టా, కరాచీలలో ఉన్న సెక్యూరిటీ ప్రెస్‌లలో ఎంతోకాలం నుంచి భారత కరెన్సీ నోట్లకు నకిలీ నోట్లను పాకిస్థాన్ ముద్రిస్తోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత నకిలీనోట్లు ఆగడంతో పాటు ఉగ్రవాదులకు నిధులు అందడం కూడా బాగా తగ్గింది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో రాళ్లు రువ్వే ఘటనలు బాగా తగ్గిపోయాయి. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే కొన్ని బృందాలు ఈ పెద్దనోట్లను స్థానిక కమాండర్లకు ఇచ్చి, వాళ్ల ద్వారా స్థానిక యువకులకు డబ్బులిచ్చి వారిని రెచ్చగొట్టి రాళ్లు రువ్వించేవి. ఇప్పుడు పెద్దనోట్లను రద్దు చేయడం, కరెన్సీ పెద్దమొత్తంలో అందుబాటులోకి రాకపోవడంతో ఇలా డబ్బులిచ్చి రెచ్చగొట్టడం కూడా తగ్గింది. -
పడగవిప్పిన హవాలా
♦ మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ.. ♦ దొడ్డిదారిన చేతులు మారుతున్న రూ.కోట్లు ♦ బ్లాక్‌మనీ.. వైట్‌మనీగా మార్పు జిల్లాలో హవాలా వ్యాపారం జోరుగా సాగుతోంది. బ్లాక్ మనీని వైట్‌మనీగా మార్చుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించడం అవసరం. రాజంపేట: నిన్న మొన్నటి వరకు గల్ఫ్‌దేశాలకు గంజాయి తదితర మత్తుపదార్థాలను ఎగుమతి చేసే డ్రగ్స్ముఠాను పోలీసులు ఆటకట్టించగా.. ఇప్పుడు హవాలా వ్యాపారం పోలీసులకు సవాల్‌గా మారింది. జిల్లాలో మూడు దశాబ్దాలుగా వాహలా (హుండీ) వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా వాహలా వ్యాపారంలో బ్లాక్‌మనీ..వైట్‌మనీగా మారిపోతుందని, ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. జిల్లాలో రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు ప్రాంతాల్లో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి సంఖ్య అధికంగా ఉంది. అక్కడి నుంచి అధికారికంగా డబ్బు పంపాలంటే సవాలక్ష నిబంధనలు ఉండటంతో చాలామంది హవాలా(హుండీ) వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం రూ.1లక్షకు తాము నిర్ణయించిన కమీషన్ మేరకు ఇచ్చిన ఒక కోడ్ ప్రకారం తమ ప్రాంతాల్లో చేరాల్సిన వారికి డబ్బు సురక్షితంగా చేర్చేస్తారు. ఈ విధంగా కొన్నేళ్ల నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. బెస్తపల్లె సంఘటనతోగుప్పుమన్న హవాలా.. రాజంపేట-నెల్లూరు రహదారిలోని బెస్తపల్లె (పెనగలూరు పోలీసు స్టేషన్ పరిధి)లో ఇటీవల హవాలా డబ్బు తరలించే సమయంలో రైల్వేకోడూరుకు చెందిన కొందరు తాము పోలీసులమని చెప్పి బెదిరించి హవాలా డబ్బును దోచుకునేందుకు చేసిన ప్రయత్నంలో పెద్దఎత్తున రెండు వర్గాలు బాహాబాహాకి దిగాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఓ సర్కిల్ స్థాయి అధికారి అక్కడకు వెళ్లి రెండు వర్గాలను చెదరగొట్టారు. కేసు కూడా నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి రాజంపేట పట్టణంలో మన్నూరుకు చెందిన హవాలా కీలక సూత్రధారితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెస్తపల్లె సంఘటనలో హవాలా నిర్వాహకుడిని తప్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాజంపేటలో హవాలా కీలకసూత్రధారి రాజంపేటలో హవాలా కోటీశ్వరునిగా పేరొందిన వ్యక్తి పట్టణంలోని మన్నూరులో నివాసం ఉంటున్నాడు. ఇక్కడి వారందరికి ఆయన సుపరిచితుడు. రాజంపేట,నెల్లూరు, రైల్వేకోడూరుతో పాటు పలు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు కూడపెట్టుకున్నాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన హవాలా ముఠా, డీ గ్యాంగ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయని చాలా యేళ్ల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఓమారు ఇతనిపై నిఘా ఉంచి ఉన్నతాధికారులు దాడులు చేస్తే, ఆ సమయంలో తప్పించుకునేందుకు డబ్బు సంచులను కుమ్మరించినట్లుగా ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. బెస్తపల్లెలో చోటుచేసుకున్న సంఘటన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మళ్లీ హవాలా వ్యాపారం వ్యవహారం బయటికి పొక్కింది. ఏదిఏమైనా హవాలా వ్యాపారాన్ని నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ఏవిధంగా స్పందిస్తారోనని పలువురు చర్చించుకుంటున్నారు.