జిల్లాలో హవాలా వ్యాపారం జోరుగా సాగుతోంది. బ్లాక్ మనీని వైట్‌మనీగా మార్చుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు..
♦ మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ..
♦ దొడ్డిదారిన చేతులు మారుతున్న రూ.కోట్లు
♦ బ్లాక్‌మనీ.. వైట్‌మనీగా మార్పు
జిల్లాలో హవాలా వ్యాపారం జోరుగా సాగుతోంది. బ్లాక్ మనీని వైట్‌మనీగా మార్చుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించడం అవసరం.
రాజంపేట: నిన్న మొన్నటి వరకు గల్ఫ్‌దేశాలకు గంజాయి తదితర మత్తుపదార్థాలను ఎగుమతి చేసే డ్రగ్స్‌ముఠాను పోలీసులు ఆటకట్టించగా.. ఇప్పుడు హవాలా వ్యాపారం పోలీసులకు సవాల్‌గా మారింది. జిల్లాలో మూడు దశాబ్దాలుగా వాహలా (హుండీ) వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా వాహలా వ్యాపారంలో బ్లాక్‌మనీ..వైట్‌మనీగా మారిపోతుందని, ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. జిల్లాలో రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు ప్రాంతాల్లో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి సంఖ్య అధికంగా ఉంది. అక్కడి నుంచి అధికారికంగా డబ్బు పంపాలంటే సవాలక్ష నిబంధనలు ఉండటంతో చాలామంది హవాలా(హుండీ) వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం రూ.1లక్షకు తాము నిర్ణయించిన కమీషన్ మేరకు ఇచ్చిన ఒక కోడ్ ప్రకారం తమ ప్రాంతాల్లో చేరాల్సిన వారికి డబ్బు సురక్షితంగా చేర్చేస్తారు. ఈ విధంగా కొన్నేళ్ల నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి.
బెస్తపల్లె సంఘటనతోగుప్పుమన్న హవాలా..
రాజంపేట-నెల్లూరు రహదారిలోని బెస్తపల్లె (పెనగలూరు పోలీసు స్టేషన్ పరిధి)లో ఇటీవల హవాలా డబ్బు తరలించే సమయంలో రైల్వేకోడూరుకు చెందిన కొందరు తాము పోలీసులమని చెప్పి బెదిరించి హవాలా డబ్బును దోచుకునేందుకు చేసిన ప్రయత్నంలో పెద్దఎత్తున రెండు వర్గాలు బాహాబాహాకి దిగాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఓ సర్కిల్ స్థాయి అధికారి అక్కడకు వెళ్లి రెండు వర్గాలను చెదరగొట్టారు. కేసు కూడా నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి రాజంపేట పట్టణంలో మన్నూరుకు చెందిన హవాలా కీలక సూత్రధారితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెస్తపల్లె సంఘటనలో హవాలా నిర్వాహకుడిని తప్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
రాజంపేటలో హవాలా కీలకసూత్రధారి
రాజంపేటలో హవాలా కోటీశ్వరునిగా పేరొందిన వ్యక్తి పట్టణంలోని మన్నూరులో నివాసం ఉంటున్నాడు. ఇక్కడి వారందరికి ఆయన సుపరిచితుడు. రాజంపేట,నెల్లూరు, రైల్వేకోడూరుతో పాటు పలు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు కూడపెట్టుకున్నాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన హవాలా ముఠా, డీ గ్యాంగ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయని చాలా యేళ్ల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఓమారు ఇతనిపై నిఘా ఉంచి ఉన్నతాధికారులు దాడులు చేస్తే, ఆ సమయంలో తప్పించుకునేందుకు డబ్బు సంచులను కుమ్మరించినట్లుగా ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. బెస్తపల్లెలో చోటుచేసుకున్న సంఘటన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మళ్లీ హవాలా వ్యాపారం వ్యవహారం బయటికి పొక్కింది. ఏదిఏమైనా హవాలా వ్యాపారాన్ని నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ఏవిధంగా స్పందిస్తారోనని పలువురు చర్చించుకుంటున్నారు.