నోట్ల రద్దు.. తొలి ఫలితం వచ్చింది!
పెద్దనోట్ల రద్దు ఫలితంగా ఉగ్రవాదులకు నిధులు అందడం గణనీయంగా తగ్గిపోయిందని, దాంతోపాటు నకిలీనోట్ల రాకెట్లు, హవాలా వ్యవహారాలు కూడా గణనీయంగా తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం.. పెద్దనోట్ల రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు దాదాపు 60 శాతం తగ్గాయి. డిసెంబర్ నెల మొత్తమ్మీద కశ్మీర్ లోయలో కేవలం ఒకే ఒక్క పేలుడు సంభవించింది.
హవాలా వ్యాపారం కూడా సగానికి సగం తగ్గిపోయింది. హవాలా ఏజెంట్ల కాల్ ట్రాఫిక్ సగం పడిపోయిందని టెల్కోలు చెబుతున్నాయి. నకిలీ నోట్లు కూడా బాగా తగ్గాయని అంటున్నారు. ప్రధానంగా పాకిస్థాన్‌లో ప్రింట్ అయ్యే ఈ నకిలీ నోట్ల వ్యవహారానికి ఒక్కసారిగా చెక్ పడింది. కొత్త నోట్లలో ఉన్న సెక్యూరిటీ ఫీచర్లు, ఉపయోగించిన రంగులు వీటన్నింటినీ కాపీ చేయడానికి వాళ్లకు చాలా సమయం పడుతోంది. దాంతో ఇప్పట్లో నకిలీనోట్లు వచ్చే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. క్వెట్టా, కరాచీలలో ఉన్న సెక్యూరిటీ ప్రెస్‌లలో ఎంతోకాలం నుంచి భారత కరెన్సీ నోట్లకు నకిలీ నోట్లను పాకిస్థాన్ ముద్రిస్తోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత నకిలీనోట్లు ఆగడంతో పాటు ఉగ్రవాదులకు నిధులు అందడం కూడా బాగా తగ్గింది.
500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో రాళ్లు రువ్వే ఘటనలు బాగా తగ్గిపోయాయి. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే కొన్ని బృందాలు ఈ పెద్దనోట్లను స్థానిక కమాండర్లకు ఇచ్చి, వాళ్ల ద్వారా స్థానిక యువకులకు డబ్బులిచ్చి వారిని రెచ్చగొట్టి రాళ్లు రువ్వించేవి. ఇప్పుడు పెద్దనోట్లను రద్దు చేయడం, కరెన్సీ పెద్దమొత్తంలో అందుబాటులోకి రాకపోవడంతో ఇలా డబ్బులిచ్చి రెచ్చగొట్టడం కూడా తగ్గింది.