మృతదేహం వద్ద బోరున విలపిస్తున్న తల్లి లక్ష్మీ (ఇన్‌సెట్)లో వంశీధర్ (ఫైల్)
కన్నా..బంగారుకొండ వంశీ పైకి లేవరా.. ప్రతి నెలా నన్ను ఎవరు హాస్పటల్‌కి తీసుకెళ్తారురా? మేము ఎవరి కోసం బతకాలిరా..’ అంటూ తల్లి లక్ష్మీ ఎస్‌ఐ వంశీధర్ మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మాకు దిక్కెవరయ్యా..! అంటూ తండ్రి హరిప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్న ఏకైక సోదరుడిని పొగొట్టుకున్న బాధలో అన్న శైలకుమార్ విలపించిన తీరు కలిచివేసింది. పేదరికాన్ని సైతం తన తెలివితేటలు, విలువిద్యతో జయించి లక్ష్యం వైపు ముందుకు సాగుతున్న వంశీధర్ కేఈబీ కెనాల్‌లో గల్లంతయి శవమై తేలడంతో ఇస్మాయిల్‌బేగ్‌పేట బోరుమన్నది. వేలాది మంది ప్రజలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పోలీసులు విల్లు వీరుడు వంశీధర్‌కు కన్నీటివీడ్కోలు పలికారు.
కోడూరు (అవనిగడ్డ) : కోడూరుకు చెందిన ఎస్‌ఐ కోట వంశీధర్ ఆదివారం కేఈబీ కెనాల్‌లో శవమై తెలడంతో కుటుంబ సభ్యుల రోదనలతో ఇస్మాయిల్‌బేగ్‌పేట గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం మధ్యాహ్నం తన తల్లి లక్ష్మికి విజయవాడలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోడూరుకు వస్తున్న వంశీధర్ ఘంటసాల మండల పాపవినాశనం దగ్గరకు రాగానే కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి పల్టీ కొట్టిన సంగతి విదితమే. ఈ ఘటనలో తల్లి లక్ష్మి ప్రాణాలతో బయటపడగా ఎస్‌ఐ మాత్రం కాలువ ప్రవాహంలో గల్లంతయ్యారు. అయితే వంశీధర్ కోసం 15 గంటల పాటు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీస్ శాఖాధికారులకు ఆదివారం ఉదయం 7 గంటల సమీపంలో అన్నవరం–మంగళాపురం కాలువలో వంశీధర్ మృతదేహాన్ని గుర్తించారు. ఎస్‌ఐ గల్లంతైన ప్రాంతానికి మృతదేహం లభ్యమైన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ శవపంచనామ అనంతరం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించడంతో మృతదేహాన్ని స్వగ్రామమైన ఇస్మాయిల్‌బేగ్‌పేటకు తీసుకెళ్లారు.
‘బంగారు కొండా పైకి లేవరా’..కలచివేసిన తల్లి రోదన
కళ్ల ముందే కాలువలో కొట్టుకుపోయిన కుమారుడు శవమై ఇంటికి రావడంతో తల్లి లక్ష్మి రోదనను ఎవరూ ఆపలేకపోయారు. ‘బంగారుకొండా వంశీ.. పైకి లేవరా.. ప్రతి నెలా నన్ను ఎవరు ఆస్పత్రికి తీసుకెళ్తారురా.. ఇంకా మేము ఎవరి కోసం బతకాలిరా..’ అంటూ లక్ష్మి కుమారుడు వంశీధర్ మృతదేహంపై పడి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ‘ఎస్‌ఐగా చేరిన తరువాత నిన్ను చూసి చాలా మంది గొప్ప కొడుకును కన్నావంటూ నన్ను మెచ్చుకున్నారు రా.. ఇప్పుడు హఠాత్తుగా మముల్ని వదిలి వెళ్లిపోతే మాకు దిక్కెవరు..’ అంటూ తండ్రి హరిప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్న ఏకైక సోదరుడిని పోగొట్టుకున్న బాధలో అన్న శైలకుమార్ మృతదేహం ముందు కూర్చొని విలపించిన తీరు కలచివేసింది.
గ్రామం నుంచి ఏకైక ఎస్‌ఐ..
తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ పేదరికాన్ని సైతం లెక్కచేయకుండా కుమారులిద్దరికి ఉన్నత చదువులు చెప్పించారు. అయితే వంశీధర్‌కు చిన్నప్పటి నుంచి ఎస్‌ఐ అవ్వాలని ఆసక్తి ఉండడంతో దానిని జయించేందుకు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాడు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించాడు. అర్చరీ క్రీడతో పాటు గజఈ తగాళ్లకు పోటీగా ఈదేవాడు. ఇవన్నీ వంశీధర్‌కు ఎస్‌ఐ ఉద్యోగం వచ్చేందుకు దోహదపడ్డాయి. 2012లో ఎస్‌ఐగా విధుల్లో చేరిన వంశీధర్ అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఇస్మాయిల్‌బేగ్‌పేట గ్రామం నుంచి ఎస్‌ఐ ఉద్యోగం సాధించిన ఏకైక వ్యక్తి వంశీధర్ మాత్రమే కావడంతో గ్రామస్తులు సైతం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఉద్యోగంలో చేరిన ఆరేళ్లకే వంశీధర్ ఇలా మరణించడం గ్రామస్తులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కడసారిగా వం శీధర్‌ని చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు.
కోడూరు : ఎస్‌ఐ కోట వంశీధర్ అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం కోడూరులో పోలీసు లాంఛనాల మధ్య నిర్వహించారు. మచిలీపట్నానికి చెందిన ప్రత్యేక పోలీస్ దళం ఇంటి వద్ద శాఖాపరమైన నివాళులర్పించింది.
చివరి వరకు అక్కడే ఉన్నవైఎస్సార్‌సీపీ నేత రమేష్‌బాబు..
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబుకు వంశీధర్ వరుసకు మేనల్లుడు కావడంతో గల్లంతైన దగ్గర నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యుల వెన్నంటే ఉన్నారు. తల్లిదండ్రులను ఓదారుస్తూ, వంశీధర్‌తో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు, విజయనగరం ఏఆర్ డీఎస్పీ బి.మెహర్, అవనిగడ్డ, రామచంద్రాపురం సీఐలు జేవీవీఎస్ మూర్తి, శ్రీధర్‌కుమార్, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, ఘంటసాల, పెద్దాపురం, ఐనవోలు ఎస్‌ఐలు మణికుమార్, రాజారెడ్డి, ప్రియకుమార్, షణ్ముఖసాయి, భగవాన్, జాన్‌బాషాతో పాటు వివిధ స్టేషన్ల సిబ్బంది మృతదేహానికి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కడవకొల్లు నరసింహరావు, పూతబోయిన చినవెంకటేశ్వరరావు, యూత్, టౌన్ కన్వీనర్లు యాదవరెడ్డి సత్యనారాయణ, బడే గంగాధరరావు, జెడ్పీటీసీ సభ్యుడు బండే శ్రీనివాసరా వు, ఎంపీపీ మాచర్ల భీమయ్య, సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం నారాయణరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవుల బసవయ్య, మాజీ సర్పంచి దాసరి విమల, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పించినవారిలో ఉన్నారు. వంశీధర్‌కు ప్రత్యేక పోలీసు దళం నివాళి
Comments
Please login to add a commentAdd a comment