vamshidhar
-
విల్లు వీరుడికి కన్నీటి వీడ్కోలు!
కన్నా..బంగారుకొండ వంశీ పైకి లేవరా.. ప్రతి నెలా నన్ను ఎవరు హాస్పటల్‌కి తీసుకెళ్తారురా? మేము ఎవరి కోసం బతకాలిరా..’ అంటూ తల్లి లక్ష్మీ ఎస్ఐ వంశీధర్ మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మాకు దిక్కెవరయ్యా..! అంటూ తండ్రి హరిప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్న ఏకైక సోదరుడిని పొగొట్టుకున్న బాధలో అన్న శైలకుమార్ విలపించిన తీరు కలిచివేసింది. పేదరికాన్ని సైతం తన తెలివితేటలు, విలువిద్యతో జయించి లక్ష్యం వైపు ముందుకు సాగుతున్న వంశీధర్ కేఈబీ కెనాల్లో గల్లంతయి శవమై తేలడంతో ఇస్మాయిల్‌బేగ్‌పేట బోరుమన్నది. వేలాది మంది ప్రజలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పోలీసులు విల్లు వీరుడు వంశీధర్‌కు కన్నీటివీడ్కోలు పలికారు. కోడూరు (అవనిగడ్డ) : కోడూరుకు చెందిన ఎస్ఐ కోట వంశీధర్ ఆదివారం కేఈబీ కెనాల్లో శవమై తెలడంతో కుటుంబ సభ్యుల రోదనలతో ఇస్మాయిల్‌బేగ్‌పేట గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం మధ్యాహ్నం తన తల్లి లక్ష్మికి విజయవాడలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోడూరుకు వస్తున్న వంశీధర్ ఘంటసాల మండల పాపవినాశనం దగ్గరకు రాగానే కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి పల్టీ కొట్టిన సంగతి విదితమే. ఈ ఘటనలో తల్లి లక్ష్మి ప్రాణాలతో బయటపడగా ఎస్ఐ మాత్రం కాలువ ప్రవాహంలో గల్లంతయ్యారు. అయితే వంశీధర్ కోసం 15 గంటల పాటు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ శాఖాధికారులకు ఆదివారం ఉదయం 7 గంటల సమీపంలో అన్నవరం–మంగళాపురం కాలువలో వంశీధర్ మృతదేహాన్ని గుర్తించారు. ఎస్ఐ గల్లంతైన ప్రాంతానికి మృతదేహం లభ్యమైన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ శవపంచనామ అనంతరం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించడంతో మృతదేహాన్ని స్వగ్రామమైన ఇస్మాయిల్‌బేగ్‌పేటకు తీసుకెళ్లారు. ‘బంగారు కొండా పైకి లేవరా’..కలచివేసిన తల్లి రోదన కళ్ల ముందే కాలువలో కొట్టుకుపోయిన కుమారుడు శవమై ఇంటికి రావడంతో తల్లి లక్ష్మి రోదనను ఎవరూ ఆపలేకపోయారు. ‘బంగారుకొండా వంశీ.. పైకి లేవరా.. ప్రతి నెలా నన్ను ఎవరు ఆస్పత్రికి తీసుకెళ్తారురా.. ఇంకా మేము ఎవరి కోసం బతకాలిరా..’ అంటూ లక్ష్మి కుమారుడు వంశీధర్ మృతదేహంపై పడి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ‘ఎస్ఐగా చేరిన తరువాత నిన్ను చూసి చాలా మంది గొప్ప కొడుకును కన్నావంటూ నన్ను మెచ్చుకున్నారు రా.. ఇప్పుడు హఠాత్తుగా మముల్ని వదిలి వెళ్లిపోతే మాకు దిక్కెవరు..’ అంటూ తండ్రి హరిప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్న ఏకైక సోదరుడిని పోగొట్టుకున్న బాధలో అన్న శైలకుమార్ మృతదేహం ముందు కూర్చొని విలపించిన తీరు కలచివేసింది. గ్రామం నుంచి ఏకైక ఎస్ఐ.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ పేదరికాన్ని సైతం లెక్కచేయకుండా కుమారులిద్దరికి ఉన్నత చదువులు చెప్పించారు. అయితే వంశీధర్‌కు చిన్నప్పటి నుంచి ఎస్ఐ అవ్వాలని ఆసక్తి ఉండడంతో దానిని జయించేందుకు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాడు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించాడు. అర్చరీ క్రీడతో పాటు గజఈ తగాళ్లకు పోటీగా ఈదేవాడు. ఇవన్నీ వంశీధర్‌కు ఎస్ఐ ఉద్యోగం వచ్చేందుకు దోహదపడ్డాయి. 2012లో ఎస్ఐగా విధుల్లో చేరిన వంశీధర్ అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఇస్మాయిల్‌బేగ్‌పేట గ్రామం నుంచి ఎస్ఐ ఉద్యోగం సాధించిన ఏకైక వ్యక్తి వంశీధర్ మాత్రమే కావడంతో గ్రామస్తులు సైతం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఉద్యోగంలో చేరిన ఆరేళ్లకే వంశీధర్ ఇలా మరణించడం గ్రామస్తులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కడసారిగా వం శీధర్ని చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. కోడూరు : ఎస్ఐ కోట వంశీధర్ అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం కోడూరులో పోలీసు లాంఛనాల మధ్య నిర్వహించారు. మచిలీపట్నానికి చెందిన ప్రత్యేక పోలీస్ దళం ఇంటి వద్ద శాఖాపరమైన నివాళులర్పించింది. చివరి వరకు అక్కడే ఉన్నవైఎస్సార్సీపీ నేత రమేష్‌బాబు.. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబుకు వంశీధర్ వరుసకు మేనల్లుడు కావడంతో గల్లంతైన దగ్గర నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యుల వెన్నంటే ఉన్నారు. తల్లిదండ్రులను ఓదారుస్తూ, వంశీధర్‌తో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకున్నారు. అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు, విజయనగరం ఏఆర్ డీఎస్పీ బి.మెహర్, అవనిగడ్డ, రామచంద్రాపురం సీఐలు జేవీవీఎస్ మూర్తి, శ్రీధర్‌కుమార్, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, ఘంటసాల, పెద్దాపురం, ఐనవోలు ఎస్ఐలు మణికుమార్, రాజారెడ్డి, ప్రియకుమార్, షణ్ముఖసాయి, భగవాన్, జాన్బాషాతో పాటు వివిధ స్టేషన్ల సిబ్బంది మృతదేహానికి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కడవకొల్లు నరసింహరావు, పూతబోయిన చినవెంకటేశ్వరరావు, యూత్, టౌన్ కన్వీనర్లు యాదవరెడ్డి సత్యనారాయణ, బడే గంగాధరరావు, జెడ్పీటీసీ సభ్యుడు బండే శ్రీనివాసరా వు, ఎంపీపీ మాచర్ల భీమయ్య, సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం నారాయణరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవుల బసవయ్య, మాజీ సర్పంచి దాసరి విమల, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పించినవారిలో ఉన్నారు. వంశీధర్‌కు ప్రత్యేక పోలీసు దళం నివాళి -
ఎస్ఐ వంశీధర్ మృతదేహం లభ్యం
-
22 కిలోమీటర్ల దూరంలో...
మంగళాపురం (చల్లపల్లి)/కోడూరు : కృష్ణాజిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద శనివారం గల్లంతైన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్ఐ కోట వంశీధర్ (30) మృతదేహాన్ని మంగళాపురం వద్ద కనుగొన్నారు. ఆదివారం ఉదయం 6:30 గంటల సమయంలో పొలానికి వెళ్తున్న రైతులు మంగళాపురం సమీపంలో 9వ నంబర్ పంట కాలువలో బోర్లాపడి ఉన్న మృతదేహాన్ని చూశారు. పోలీసులకు సమాచారమివ్వగా అది వంశీధర్‌దిగా గుర్తించారు. డీఎస్పీ వి.పోతురాజు, సీఐ జనార్ధన్ నేతృత్వంలో మృతదేహానికి ఘటనా స్థలిలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. శనివారం గన్నవరంలో తల్లికి వైద్య పరీక్షలు చేయించి స్వగ్రామం ఇస్మాయిల్ బేగ్‌పేటకు వస్తుండగా పాపవినాశనం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు కాలువలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తల్లిని రక్షించిన ఆయన గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 22 కి.మీ.ల దూరంలో ఉన్న మంగళాపురం వద్దకు వంశీధర్ మృతదేహం ప్రవాహంలో కొట్టుకువచ్చింది. ఆదివారం అర్ధరాత్రి వరకు మృతదేహం కోసం నిమ్మగడ్డ లాకుల వద్ద గాలిస్తూనే ఉన్నారు. నీటి ఉధృతి వల్ల మృతదేహం వేగంగా కొట్టుకువెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇస్మాయిల్ బేగ్‌పేటకు తీసుకురావడంతో దివిసీమకు చెందిన పోలీసులు వంశీధర్‌కు నివాళులర్పించేందుకు తరలివచ్చారు. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వంశీధర్ మృతదేహాన్ని సందర్శించి, అతని తల్లిదండ్రులను ఓదార్చారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ, రామచంద్రాపురం డీఎస్పీ జేవీ సంతోష్‌లు కూడా వంశీధర్‌కు నివాళులర్పించారు. తనతో పాటు కానిస్టేబుల్, ఎస్ఐ శిక్షణ పొందిన వారు కూడా వంశీధర్ మృతదేహాన్ని కడసారిగా తిలకించి, కన్నీటి పర్యంతమైయ్యారు. మచిలీపట్నానికి చెందిన ప్రత్యేక పోలీస్ దళం వంశీధర్ ఇంటి వద్ద శాఖాపరమైన నివాళులర్పించారు. సాయంత్రం కోడూరులో సాయుధ వందనం అనంతరం పోలీసు లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, హోంమంత్రి చినరాజప్ప వంశీధర్ కుటుంబీకులను ఫోన్ ద్వారా పరామర్శించారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వంశీధర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఉన్మాది కత్తికి మరో యువతి బలి
కరీంనగర్ క్రైం: సమయం.. ఉదయం 10.30 గంటలు.. కరీంనగర్ కలెక్టరేట్.. షాపులన్నీ అప్పుడే తెరుచుకుంటున్నాయి.. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మీసేవ కేంద్రం కూడా తెరుచుకుంది.. అదే సమయంలో ఓ యువకుడు వచ్చాడు.. మీ సేవలో పనిచేస్తున్న యువతిని బయటకు పిలిచాడు.. ఆమె రాగానే ఉన్నట్టుండి కత్తితో గొంతు కోశాడు.. తానూ గొంతు కోసుకోబోయాడు.. రక్తపుమడుగులో విలవిల్లాడుతున్న ఆ ఆమ్మాయిని చుట్టుపక్కలవారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది! శుక్రవారం ఉదయం నగరం నడిబొడ్డున ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిగ్రీలో పరిచయంతో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శంకరపల్లి గ్రామానికి చెందిన ఫిరంగి వంశీధర్(25) పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డిగ్రీ చదివాడు. ఆ సమయంలో గోదావరిఖనిలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఉట్ల విష్ణువర్ధన్, విజయ దంపతుల కూతురు ఉట్ల రోహిణి అలియాస్ రసజ్ఞ(22)తో పరిచయం ఏర్పడింది. డిగ్రీ తర్వాత గోదావరిఖనిలోని మీ సేవలో రసజ్ఞ పని చేసింది. ఈ క్రమంలో రసజ్ఞ, వంశీధర్ చనువుగా తిరుగుతున్నారని తెలిసిన యువతి కుటుంబీకులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. ఇకపై కలవొద్దని తీర్మానించారు. రసజ్ఞ అక్కడే ఉంటే వంశీధర్‌తో మళ్లీ కలుస్తుందన్న అనుమానంతో ఆమె తల్లిదండ్రులు కరీంనగర్ పంపించారు. అప్పటికే మీసేవలో పనిచేసిన అనుభవం ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ.. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మీ సేవ కేంద్రంలో మూడు నెలలుగా పని చేస్తోంది. నెల స్తానని చెరోజుల క్రితమే రసజ్ఞ తాను పని మానేస్తానని చెప్పిందని, అయితే మళ్లీ చేప్పినట్లు మీసేవ నిర్వాహకుడు తెలిపాడు. కత్తితో వచ్చి.. గొంతు కోసి.. కొంతకాలంగా వంశీధర్‌ను పక్కన పెట్టిన రసజ్ఞ తన పనిలో ఉండిపోయింది. అయితే తరచూ వంశీధర్ ఫోన్ చేసి వేధించ సాగాడు. పెద్దలు చేసిన ఒప్పందం ప్రకారం మాట్లాడొద్దని రసజ్ఞ చెప్పడంతో రగిలిపోయాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం ఉదయం కరీంనగర్ వచ్చి రసజ్ఞ పని చేస్తున్న మీ సేవ కేంద్రానికి వెళ్లాడు. అప్పుడే వచ్చిన రసజ్ఞ టీ తాగేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో వంశీధర్ నేరుగా మీ సేవ కేంద్రంలోకి వెళ్లాడు. అతడిని చూసి రసజ్ఞ ఆశ్చర్యపోయింది. ‘నీతో మాట్లాడాలి..’అని చెప్పడంతో బయటకు వచ్చింది. ముందు యువతి, వెనుక వంశీధర్ నడుస్తున్నారు. మీ సేవ ద్వారం వద్దకు చేరుకోగానే అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో వంశీధర్ అకస్మాత్తుగా రసజ్ఞపై దాడి చేశాడు. గొంతు కోయడంతో ఆమె అక్కడికక్కడే పడిపోయింది. తర్వాత వంశీధర్ కూడా అదే కత్తితో గొంతు కోసుకునేందుకు యత్నించగా.. స్థానికులు అడ్డుకుని చితకబాదారు. ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న రసజ్ఞను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించింది. ఎన్కౌంటర్ చేయాలంటూ బంధువుల ఆందోళన ఘటనపై సమాచారం అందుకున్న సీపీ కమలాసన్‌రెడ్డి వెంటనే అక్కడికి వెళ్లారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సీపీ అక్కడ్నుంచి ఆస్పత్రికి వెళ్లి యువతి మృతదేహన్ని పరిశీలించారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ ఈ సందర్భంగా యువతి బంధువులు ఆందోళన చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ హమీ ఇవ్వడంతో శాంతించారు. -
కరీంనగర్లో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్ కార్యాలయానికి ముందే ఓ యువతిని ప్రేమోన్మాది గొంతుకోసి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడిఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతురాలి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆమె రామగుండంలోని హనుమాన్ నగర్ చెందిన రసజ్ఞగా గుర్తించారు. ఆమె కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మీ సేవా కేంద్రంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మీ సేవా కేంద్రం వద్దకు వచ్చిన యువకుడు మాట్లాడాలని ఆమెను బయటకు పిలిచాడు. అనంతరం యువతిపై దాడి చేసి ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకు చెందిన వంశీధర్ అని పోలీసులు తెలిపారు. ఇరువురి ప్రేమ వ్యవహారమే హత్య కారణంగా అనుమానిస్తున్నారు. -
కల్వకుర్తి ఫలితానికి బ్రేక్
పాలమూరు, న్యూస్‌లైన్: ఆ కౌంటింగ్ హాల్ వద్ద ఉదయం 7 గంటల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పడిగాపులు కాశారు.. ‘మా పార్టీ అభ్యర్థి గెలుపు సాధిస్తారంటే.. కాదు మా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అవుతారంటూ ’ పోటా పోటీ గా నినాదాలు చేస్తూ ఉత్కంఠతో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూశారు. చివరి రౌండ్ రానే వచ్చింది.. ఆ రౌండ్ పూర్తయితే.. 633 ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం బయటపడేది.. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని 119 నంబర్ పోలింగ్ బూత్‌కు చెంది న ఈవీఎం సాంకేతికలోపం కారణంగా పనిచేయలేదు. దీంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయిం ది. నిపుణులు వచ్చి బాగుచేస్తే ఫలితాలు వెల్లడిస్తారేమోనని.. అం తా రాత్రి 9.30 గంటల వరకు ఎదురు చూపులు చూశారు. కౌటింగ్ కేం ద్రం నిర్వహణాధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అవకాశం లేదని చెప్పడంతో ఉసూరంటూ అన్ని పార్టీలకు చెందిన వారు ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. కల్వకుర్తి 1వ రౌండ్ నుంచి 28వ రౌండ్ వర కు నువ్వా.. నేటా అన్న ట్లు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి మధ్య తీవ్రపోటీ ఏర్పడింది. కొన్ని రౌండ్లలో ఒకరు ముందంజలో నిలిస్తే.. అతర్వాత రౌండ్లలో మరొకరు మరొకరు ఆధిక్యతను ప్రదర్శించారు. ఆతర్వాత 32వ రౌండ్ వరకు ఆచారి ఆధిక్యతను ప్రదర్శించగా.. ఆతర్వాతి రౌండ్లలో వంశీచందర్ ఓటుశాతాన్ని పెంచుతూ వచ్చారు. చివరిరౌండ్ వచ్చేటప్పటికి 32 ఓట్ల ఆధిక్యతతో వంశీచందర్కు 42229 ఓట్లు నమోదయ్యాయి. ఆచారికి 42,197 ఓట్లు పోలయ్యాయి. చివరి రౌండ్ పూర్తయితేగాని వీరిద్దరిలో విజయం ఎవరిని వరించేదో తేటతెల్లమయ్యేది. చివరన ఈవీఎం పనిచేయకపోవడంతో ఫలితాలు నిలిచిపోయి. వీరితోపాటు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి పోటీ చేసిన వారిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్‌కు 29,687 ఓట్లు, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మకిష్టారెడ్డికి 13,734 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి కె.నారాయణరెడ్డికి 23,999 ఓట్లు పోలయ్యాయి. బీఎస్పీ అభ్యర్థి కె.జంగయ్యకు 1892, ఆర్ఎల్డీ అభ్యర్థి వి.హుస్సేన్‌కు 916, స్వతంత్ర అభ్యర్థులు బాలాజీ సింగ్ ఠాకూర్‌కు 3,212, దోనాల క్రిష్ణారెడ్డికి 687, ఎత్తం శ్రీనివాస్‌కు 651 ఓట్లు దక్కాయి. ఇక పోతే నోటాకింద 1132 ఓట్లు పోలైనట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈసీ ఆదేశిస్తే..! ప్రెసెంట్ ఎక్సీడెడ్ సాంకేతిక లోపం కారణంగా.. ఈ వీఎం మొరాయించింది. కల్వకుర్తి నియోజకవర్గం జూపల్లి గ్రామానికి చెందిన 119 నంబర్ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒక ఈవీఎం మెషిన్ మొరాయించడంతో కౌంటింగ్ నిలిచిపోయింది. ఈ పోలింగ్ బూత్ పరిధిలో 633 ఓట్లు పోలయ్యాయి. ఈ మొత్తాన్ని లెక్కించాల్సి ఉండగా.. సాంకేతిక లోపం ఏర్పడటంతో తాత్కాలికంగా నిలపాల్సి వచ్చింది. ఈ సాంకేతిక లోపం నిపుణుల ద్వారా సరిదిద్దగలిగితే కౌంటింగ్ పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తాం, ఒక వేళ ఈవీఎం పనిచేయకుంటే ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే.. ఆమేరకు రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. - కలెక్టర్ ఎం.గిరిజాశంకర్