కరీంనగర్ క్రైం: సమయం.. ఉదయం 10.30 గంటలు.. కరీంనగర్ కలెక్టరేట్.. షాపులన్నీ అప్పుడే తెరుచుకుంటున్నాయి.. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మీసేవ కేంద్రం కూడా తెరుచుకుంది.. అదే సమయంలో ఓ యువకుడు వచ్చాడు.. మీ సేవలో పనిచేస్తున్న యువతిని బయటకు పిలిచాడు..
ఆమె రాగానే ఉన్నట్టుండి కత్తితో గొంతు కోశాడు.. తానూ గొంతు కోసుకోబోయాడు.. రక్తపుమడుగులో విలవిల్లాడుతున్న ఆ ఆమ్మాయిని చుట్టుపక్కలవారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది! శుక్రవారం ఉదయం నగరం నడిబొడ్డున ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డిగ్రీలో పరిచయంతో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శంకరపల్లి గ్రామానికి చెందిన ఫిరంగి వంశీధర్(25) పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డిగ్రీ చదివాడు. ఆ సమయంలో గోదావరిఖనిలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఉట్ల విష్ణువర్ధన్, విజయ దంపతుల కూతురు ఉట్ల రోహిణి అలియాస్ రసజ్ఞ(22)తో పరిచయం ఏర్పడింది.
డిగ్రీ తర్వాత గోదావరిఖనిలోని మీ సేవలో రసజ్ఞ పని చేసింది. ఈ క్రమంలో రసజ్ఞ, వంశీధర్ చనువుగా తిరుగుతున్నారని తెలిసిన యువతి కుటుంబీకులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. ఇకపై కలవొద్దని తీర్మానించారు. రసజ్ఞ అక్కడే ఉంటే వంశీధర్‌తో మళ్లీ కలుస్తుందన్న అనుమానంతో ఆమె తల్లిదండ్రులు కరీంనగర్ పంపించారు.
అప్పటికే మీసేవలో పనిచేసిన అనుభవం ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ.. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మీ సేవ కేంద్రంలో మూడు నెలలుగా పని చేస్తోంది. నెల స్తానని చెరోజుల క్రితమే రసజ్ఞ తాను పని మానేస్తానని చెప్పిందని, అయితే మళ్లీ చేప్పినట్లు మీసేవ నిర్వాహకుడు తెలిపాడు.
కత్తితో వచ్చి.. గొంతు కోసి..
కొంతకాలంగా వంశీధర్‌ను పక్కన పెట్టిన రసజ్ఞ తన పనిలో ఉండిపోయింది. అయితే తరచూ వంశీధర్ ఫోన్ చేసి వేధించ సాగాడు. పెద్దలు చేసిన ఒప్పందం ప్రకారం మాట్లాడొద్దని రసజ్ఞ చెప్పడంతో రగిలిపోయాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం ఉదయం కరీంనగర్ వచ్చి రసజ్ఞ పని చేస్తున్న మీ సేవ కేంద్రానికి వెళ్లాడు. అప్పుడే వచ్చిన రసజ్ఞ టీ తాగేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో వంశీధర్ నేరుగా మీ సేవ కేంద్రంలోకి వెళ్లాడు.
అతడిని చూసి రసజ్ఞ ఆశ్చర్యపోయింది. ‘నీతో మాట్లాడాలి..’అని చెప్పడంతో బయటకు వచ్చింది. ముందు యువతి, వెనుక వంశీధర్ నడుస్తున్నారు. మీ సేవ ద్వారం వద్దకు చేరుకోగానే అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో వంశీధర్ అకస్మాత్తుగా రసజ్ఞపై దాడి చేశాడు. గొంతు కోయడంతో ఆమె అక్కడికక్కడే పడిపోయింది. తర్వాత వంశీధర్ కూడా అదే కత్తితో గొంతు కోసుకునేందుకు యత్నించగా.. స్థానికులు అడ్డుకుని చితకబాదారు. ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న రసజ్ఞను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించింది.
ఎన్‌కౌంటర్ చేయాలంటూ బంధువుల ఆందోళన
ఘటనపై సమాచారం అందుకున్న సీపీ కమలాసన్‌రెడ్డి వెంటనే అక్కడికి వెళ్లారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సీపీ అక్కడ్నుంచి ఆస్పత్రికి వెళ్లి యువతి మృతదేహన్ని పరిశీలించారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ ఈ సందర్భంగా యువతి బంధువులు ఆందోళన చేశారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ హమీ ఇవ్వడంతో శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment