సాక్షి, జగిత్యాల(కరీంనగర్): సమాజాం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సైబర్ వేగంతో ముందుకు సాగుతోంది. కొందరు తమ ప్రతిభకు పదును పెడుతూ నైపుణ్యం పెంచుకుంటున్నారు. అనేక ఆవిష్కరణలతో అబ్బురపరుస్తున్నారు. ఇదేస్థాయిలో కొందరు మూఢనమ్మకాలతో అమాయకులను అంతం చేస్తున్నారు. మంత్రాలు, చేతబడులు.. ఇలా ఏవేవో కారణాలు చూపుతూ గిట్టనివారిని చంపేస్తున్నారు. గత మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా ఇలాంటి కారణాలతో 9మందిని హత్యచేశారు.
అనారోగ్యమైనా, ఆర్థిక సమస్యలు తలెత్తినా..
వాతావరణ సమతుల్యత దెబ్బతినడం, పరిసరాల అపరిశుభ్రత తదితర కారణాలతో, సీజనల్, దీర్ఘకాలిక వ్యాధులు, కరోనా తదితర వైరస్‌ల ఉధృతి పెరుగుతోంది. ఇందుకు సామాజిక రుగ్మతలూ తోడవుతున్నాయి. వీటిబారినపడ్డ కొందరు సమస్యకు శాస్త్రీయ పరిష్కారం వైపు దృష్టి మళ్లించకుండా.. తమకు గిట్టనివారు, అనుమానం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తున్నారని సామాజికవేత్తలు, పోలీసులు చెబుతున్నారు.
మూడేళ్లలో 9 హత్యలు..
► జిల్లా వ్యాప్తంగా 2019 సంవత్సరంలో 14 మంది హత్యకు గురయ్యారు.
► ఇందులో చేతబడి అనుమానంతో ముగ్గురిని అంతమొందించారు.
► 2020 సంవత్సరంలో 23 హత్యలు కాగా, అందులో 4 హత్యలు చేతబడి అనుమానంతోనే చోటుచేసుకున్నాయి.
► 2021 సంవత్సరంలో 25 హత్యలు చోటుచేసుకోగా, ఇందులో చేతబడి అనుమానంతో 2హత్యలు జరిగాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
క్షుద్రపూజలు, భూత వైద్యులు..
జిల్లాలోని మారుమూల పల్లెలతోపాటు ప్రధాన పట్టణాల్లోనూ చాలామంది సామాన్యులు భూతవైద్యులను సంప్రదిస్తున్నారని పోలీసులకు సమాచారం ఉంది. వీరి సూచన మేరకు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు క్షుద్రపూజలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అనారోగ్యం బారిన పడినా, వైద్యం చేయించినా నయం కాకపోయినా, ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతున్నా, సామాజిక రుగ్మతలతో బాధపడుతున్నా.. వాటి పరిష్కారం కోసం కొందరు భూత వైద్యులను సంప్రదిస్తున్నారు.
బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న భూతవైద్యులు.. ధనార్జనే ధ్యేయంగా క్షుద్రపూజలు చేయిస్తున్నారు. గిట్టనివారు చేతబడి, మంత్రాలు చేస్తున్నారని నమ్మిస్తున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకుంటున్న బాధితులు.. ఆవేశానికి లోనై అమాయకులను చంపేస్తున్నారని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జిల్లాలో మూడేళ్లలో తొమ్మిది మంది చనిపోయారు. గత మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు హతమయ్యారు. పోలీసులు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.
పరిష్కారంపై దృష్టి పెట్టాలి
అనారోగ్య సమస్యలు తలెత్తితే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. ప్రస్తుతం వైద్యరంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమకోర్చుతూ ఆధునిక వైద్యం అందిస్తున్నారు. ఇలాంటి వైద్యం వైపు దృష్టి పెట్టాలి. శాస్త్రీయ పరిష్కారం కోసం ఆర్థికపరమైన, సామాజికపరమైన సమస్యలనూ అవగాహనతో సమర్థవంతంగా ఎదర్కోవాలి.
అంతేకానీ, మంత్రాలు, చేతబడులు అంటూ మూఢనమ్మకాలవైపు వెళ్లొద్దు. మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం.
– సింధూశర్మ, ఎస్పీ
చదవండి: మద్యంప్రియుల్లో ‘నయా’ జోష్ .. తాగండి.. ఊగండి..! కానీ
Comments
Please login to add a commentAdd a comment