గట్టు వామన్‌రావు దంపతుల హత్యోదంతం వివరాలు విలేకరులకు వెల్లడిస్తున్న ఐజీ వై.నాగిరెడ్డి
సాక్షి, కరీంనగర్: హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణి హత్యకు సొంత గ్రామంలో నెలకొన్న గొడవలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు నిందితులు ఉపయోగించిన నల్లని బ్రీజా కారు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుదని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. గురువారం రాత్రి పెద్దపల్లిలో రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, డీఐజీ ప్రమోద్ కుమార్‌తో కలిసి వరంగల్ జోన్ ఐజీ వి.నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్, బిట్టు శ్రీను కారు డ్రైవర్ శివందుల చిరంజీవి కలిసి కొబ్బరికాయలు నరికే కత్తులతో ఈ హత్యాకాం డకు పాల్పడ్డారని తెలిపారు. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్ ఇంటి నిర్మాణాన్ని వామన్‌రావు అడ్డుకోవడం, ఊరిలో నిర్మిస్తున్న దేవాలయం పనులకు అభ్యంతరం తెలపడం, రామాలయ కమిటీ వివాదాల కార ణంగా హత్యలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు.
‘రిజిస్ట్రేషన్ కాని బ్రీజా కారును, కొబ్బరికాయలు కోసే కత్తులను బిట్టు శ్రీను సమకూర్చగా.. అతడి కారు డ్రైవర్ చిరంజీవితో కలిసి కుంట శ్రీనివాస్ నడిరోడ్డుపై హత్యాకాండకు తెగబడ్డాడు. కుంట శ్రీనివాస్‌ను ఏ1గా, చిరంజీవిని ఏ2గా, అక్కపాక కుమార్‌ను ఏ3గా పేర్కొంటూ కేసు నమోదు చేశాం. కుంట శ్రీనివాస్, చిరంజీవిని గురువారం మహారాష్ట్ర సరిహద్దుల్లో అరెస్టు చేశాం. కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నాం. వామన్‌రావు తండ్రి ఫిర్యాదు మేరకు రిటైర్డ్ డీఈ వసంతరావుకు ఈ కేసులో ఏమైనా ప్రమేయం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నాం. హత్య చేయడానికి కారు, కత్తులను సమకూర్చిన బిట్టు శ్రీను కోసం గాలిస్తున్నాం’అని నాగిరెడ్డి వెల్లడించారు.
పథకం ప్రకారమే హత్య...
న్యాయవాద దంపతుల హత్య పక్కా పథకం ప్రకారమే జరిగిందని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ‘గుంజపడుగు గ్రామంలోని దేవాలయానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు తన తండ్రి, సోదరుడి సంతకాల కోసం గట్టు వామన్‌రావు దంపతులు గురువారం మంథని కోర్టుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకొన్న కుంట శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్లేటప్పుడు వామన్‌రావును చంపాలని పథకం వేసుకున్నాడు. తన కారును అక్కపాక కుమార్‌కు ఇచ్చి వామన్‌రావు కదలికలను తెలియజేయాలని సూచించాడు. బిట్టు శ్రీను అనే వ్యక్తి నుంచి నల్లని బ్రీజా కారును, రెండు కొబ్బరి కాయలు కోసే కత్తులు తీసుకుని అతడి డ్రైవర్ చిరంజీవితో కలిసి మధ్యాహ్నం సమయంలో కల్వచర్ల శివారులో కాపు కాశాడు. వామన్‌రావు కారు రాగానే దానిని ఢీకొట్టి కారు ఆపారు. అనంతరం కుంట శ్రీను కత్తి తీసుకుని వెళ్లి కారు అద్దం పగలగొట్టాడు. దీంతో డ్రైవర్ భయపడి కారు దిగిపోవడంతో వామన్‌రావు డ్రైవర్ సీట్లోకి వచ్చి కారు నడిపే ప్రయత్నం చేశారు. వెంటనే కుంట శ్రీను ఆయన్ను కారులో నుంచి బయటకు లాగి కత్తితో దాడి చేశాడు.
అదే సమయంలో చిరంజీవి రెండోవైపు నుంచి వచ్చి వామన్‌రావు భార్య నాగమణిపై కత్తితో దాడి చేయడంతో ఆమె కారులోనే కుప్పకూలిపోయారు. తర్వాత చిరంజీవి కూడా వామన్‌రావు వద్దకు వచ్చి విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం ఇరువురూ బ్రిజా కారులో ఇంక్లైన్ కాలనీ నుంచి సుందిళ్ల బ్యారేజీ వైపు వెళ్లిపోయారు. రక్తపు మరకలు అంటున్న బట్టలు, దాడికి ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజీలో పడేసి, అక్కడి నుంచి మహారాష్ట్ర వైపు పారిపోయారు. మహారాష్ట్ర ప్రాంతంలో తెలంగాణ పోలీసుల కదలికలున్నాయనే అనుమానంతో ముంబై వెళ్తుండగా, వాంకిడి చంద్రపూర్ మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు’అని నాగిరెడ్డి వివరించారు.
ఐదేళ్లుగా వివాదాలు..
వామన్‌రావుకు తన గ్రామానికే చెందిన కుంట శ్రీనివాస్‌తో ఐదేళ్లుగా వివాదాలున్నట్లు ఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఇటీవల గుంజపడుగులో ఉన్న రామస్వామి గోపాలస్వామి దేవాలయం మేనేజ్‌మెంట్ కమిటీ వివాదంతోపాటు ఇల్లు, కుల దేవత పెద్దమ్మ ఆలయం నిర్మాణాలు నిలిపివేయించారనే కక్షతోనే కుంట శ్రీను వామన్‌రావును చంపాలని కుట్ర పన్ని, బిట్టు శ్రీను సహకారంతో హత్య చేసినట్లు వివరించారు. కుంట శ్రీనివాస్ గతంలో నిషేధిత సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)లో పనిచేశాడని, బస్సు దహనం, 498ఏ కేసుల్లో నిందితుడని తెలిపారు. చిరంజీవికి ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా, ఆర్థికంగా ఆదుకున్న కుంట శ్రీనివాస్ మీద అభిమానంతో ఈ హత్యలో పాలుపంచుకున్నట్లు చెప్పారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు వెల్లడించారు. కేసులో ఎలాంటి రాజకీయ కారణాలు వెల్లడి కాలేదని, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. హత్య సమయంలో ప్రయాణికులు తీసిన వీడియో క్లిప్పింగులు ఏవైనా ఉంటే తమకు పంపించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment