ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలు
సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు లాయర్ల జంట హత్యల కేసు చివరికి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మెడకు చుట్టుకుంటోంది. కేసు చార్జిషీటు దాఖలు చేసే సమయంలో గన్‌మెన్‌లను వదిలి వారం రోజులపాటు అదృశ్యం కావడంతో ఆయన ప్రమేయంపై పోలీసులు ఆరా తీసే పరిస్థితి తలెత్తింది. లాయర్ల హత్యకేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీను జైలులో ఉండగా.. అతని ఇంటి నిర్మాణానికి పుట్ట మధు సహకరిస్తున్నట్లు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు చేశారు. వాటితోపాటు మరిన్ని అనుమానాస్పద అంశాలు జెడ్పీ చైర్మన్ మధుకు తలనొప్పిగా మారుతున్నాయి.
వారం రోజుల క్రితం అదృశ్యమైన మధును శుక్రవారం రాత్రి ఏపీలోని భీమవరంలో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పిన పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ.. వామన్‌రావు హత్య కేసులో ఆయన ప్రమేయంపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి ముగ్గురు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. హత్య కేసు విచారణాధికారి అడిషనల్ డీసీపీ అశోక్‌కుమార్, ఓఎస్‌డీ శరత్‌చంద్రపవర్, రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ వేర్వేరుగా విచారించారు. పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైది.
రూ, 2 కోట్లు సుపారీ నిజమేనా..?
హత్యకేసులో ప్రధాన నిందితులకు సుపారీ కింద రూ.2 కోట్లు ముట్ట జెప్పారని, ఏ 1 కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆరోపిస్తూ వామన్‌రావు తండ్రి కిషన్‌రావు గత నెల 16న ఐజీ నాగిరెడ్డికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖనే పుట్ట మధుపై ఎంక్వైరీకి కారణమైంది. వామన్‌రావు దంపతుల హత్యకు రూ.2 కోట్లు డీల్ మాట్లాడిందెవరు? బిట్టు శ్రీనుకు కొత్త కారు కొనిచ్చింది ఎవరు? కుంట శ్రీను ఇంటికి ఎవరు డబ్బులు స్పాన్సర్ చేస్తున్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కోట్ల రూపాయలను ఏ బ్యాంకు నుంచి తెచ్చారు? విత్‌డ్రా చేసిందెవరు? తదితర కోణాలపై రామగుండం పోలీసులు దృష్టి పెట్టారు. హత్య జరగడానికి ముందు నుంచి తరువాత చోటు చేసుకున్న పరిణామాల వరకు పుట్ట మధు ఎవరెవరితో మాట్లాడారో కాల్‌డేటా కూడా తీసుకుని విచారిస్తున్నారు. చార్జిషీటు దాఖలుకు సమయం ఆసన్నమైన పరిస్థితుల్లో కోర్టుకు సమాధానం చెప్పుకొనేందుకు.. వామన్‌రావును అంతమొందించడం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే కోణంపై పోలీసులు దృష్టి పెట్టినట్లు సమాచారం.
వారం రోజులు ఎందుకు అదృశ్యం..?
జెడ్పీ చైర్మన్ పుట్ట మధు వారం రోజులు అదృశ్యం కావడానికి గల కారణాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ కోసం గన్‌మెన్‌లుగా వచ్చిన నలుగురు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా.. ప్రభుత్వ కారును వదిలేసి ఎందుకు అదృశ్యం కావలసి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారని సమాచారం. పోలీసుల కళ్లు కప్పి మహారాష్ట్ర, హైదరాబాద్, భీమవరం ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశారనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ కేసుతో సంబంధం ఉందన్న కారణంగానే మధు గాయబ్ అయ్యాడా? ఇంకేమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అదృశ్యంపై గోప్యత ఎందుకు?
గత నెల 29న రాత్రి హైదరాబాద్ నుంచి ఓ పోలీస్ అధికారి నుంచి ఫోన్ కాల్ రావడంతో అదేరోజు రాత్రి పుట్ట మధు అదృశ్యమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మధు అదృశ్యమైన తరువాత మరుసటి రోజు ఉదయం గన్‌మెన్‌లు ఈ విషయాన్ని ఏఆర్ విభాగం చీఫ్‌కు తెలియజేయడం, ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిపోయాయి. గన్‌మెన్‌లు తమ ఆయుధాలను సరెండర్ చేసి, ఏఆర్‌కు అటాచ్డ్ అయ్యారు. ఆ వెంటనే రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం, మధు, ఆయన డ్రైవర్ సెల్ టవర్ సిగ్నల్స్ మేరకు మహారాష్ట్ర వెళ్లారు.
ఈనెల 1న మహారాష్ట్రలోని వని పట్టణంలో మధు సోదరుని నివాసానికి వెళ్లి విచారణ జరపగా, మధు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తేలింది. అదే సమయంలో ఈటల రాజేందర్ వ్యవహారం తెరపైకి రావడంతో హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. మధు కోసం జిల్లాకు చెందిన ఓ మంత్రి పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడు రోజుల క్రితం సదరు మంత్రికి ‘సాక్షి’ ఫోన్ చేయగా, మధు హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పడం గమనార్హం. సాక్షి కథనాలతో అప్రమత్తమైన పోలీసులు ‘భీమవరం’ నుంచి అదుపులోకి తీసుకోవడం కొసమెరుపు.
‘సాక్షి’ వరుస కథనాల సంచలనం
పుట్ట మధు అదృశ్యమైన విషయంపై ఈనెల 6న ‘సాక్షి’ దినపత్రికలో ‘పుట్ట మధు ఎక్కడ..?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అప్పటివరకు పుకారుగా ప్రచారంలో ఉన్న ఈ అంశాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరుసటి రోజు 7న ‘అజ్ఞాతంలోనే మధు’ శీర్షికతో వారం రోజులుగా వీడని సస్పెన్స్‌ను హైలైట్ చేస్తూ కథనం ప్రచురించింది. మధు ఎక్కడికి వెళ్లలేదని, గన్‌మెన్ ఆయనతోనే ఉన్నారని, మిస్సింగ్ ఫిర్యాదులు ఏవీ అందలేదని రామగుండం పోలీస్ కమిషనర్ ఇచ్చిన వివరణతోపాటు జరుగుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించడం జరిగింది.
అదే సమయంలో తన భర్త ఆచూకీ తెలపాలని మధు సతీమణి, మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కలిసిన వివరాలను ప్రచురించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు పుట్ట మధును అదుపులోకి తీసుకున్న విషయాన్ని మీడియాకు వెల్లడించాలని నిర్ణయించారు. అదే సమయంలో శుక్రవారం పుట్ట శైలజ ‘సాక్షి’తో మాట్లాడుతూ పుట్ట మధు హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ మేరకు 8న ‘అజ్ఞాతంలోకి పోలేదట..’ శీర్షికతో మరో కథనం ప్రచురితమైంది. చివరికి పుట్ట తమ అదుపులో ఉన్న విషయాన్ని పోలీసులు వెల్లడించక తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment