సాక్షి, కరీంనగర్/మంథని: ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు... అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కత్తులతో వీరంగం... కారులో వెళ్తున్న న్యాయవాది గట్టు వామన్‌రావు, అతని భార్య నాగమణిపై దాడి.. ప్రాణాలతో కారు నుంచి బయటపడ్డ వామన్‌రావును ఆర్టీసీ బస్సుల పక్కన రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తులతో విచక్షణారహితంగా నరికివేత. ఈ దృశ్యాలను వీడియోలుగా తీసిన కొందరు యువకులు... బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద జరిగిన న్యాయవాద దంపతుల హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పట్టపగలు కారులో వెళ్తున్న న్యాయవాద దంపతులను అడ్డగించి కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపిన సంఘటన మంథని ప్రాంతంలోనే గాక ఉమ్మడి జిల్లాను ఉలికిపాటుకు గురి చేసింది. సొంత గ్రామానికి చెందిన వ్యక్తులు నడిరోడ్డుపై కాపు కాసి హత్య చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ జిల్లాల్లో ఈ తరహా హత్య జరగడం అరుదుగానే పోలీసులు కూడా ఒప్పుకుంటున్నారు.
ఫ్యాక్షన్ తరహాలోనే దాడి..
రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేని విధంగా ఫ్యాక్షన్ తరహాలో మంథని మాజీ ఎంపీటీసీ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ న్యాయవాద దంపతులపై పక్కా ప్రణాళికతో దాడి చేసి చంపడం చర్చనీయాంశంగా మారింది. వందలాది వాహనాల రాకపోకలతో ఎప్పుడూ బిజీగా ఉండే మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపైనే జనమంతా చూస్తుండగానే ఈ జంట హత్యలు జరిగాయంటే ఆశ్చర్యం వేయక మానదు. కారులో ప్రయాణిస్తున్న దంపతులను చంపాలనే లక్ష్యంతో నిందితులు చేసిన దాడిలో మహిళా న్యాయవాది నాగమణి కారులోనే ప్రాణాలు కోల్పోగా, వామనరావును రోడ్డుపై కత్తులతో నరుకుతున్నా పట్టించుకునే వారే కరువుయ్యారు. దుండగులు దాడి చేసే సమయంలో వారి వెనకాలే ఓ ఆర్టీసీ బస్సు నిలిచి ఉన్న దృశ్యాలు రోడ్డుపై నిలబడ్డ వ్యక్తులు తీసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
విలపిస్తున్న వామన్‌రావు తల్లిదండ్రులు
అలాగే మరో బస్సు దాడులు చేస్తున్న సమయంలోనే వస్తుండడంతోపాటు ద్విచక్రవాహనదారులు సైతం హత్యాకాండను చూసుకుంటూ వెళ్లారే తప్ప అడ్డుకునే ఏ ప్రయత్నం చేయలేదు. వాహనంలో గట్టు నాగమణిపై దాడి అనంతరం వామన్‌రావుపై దాడి చేసే దశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. హంతకులు వెళ్లిపోయిన తరువాత వామన్‌రావు శరీరం నుంచి రక్తం వస్తూ చివరి ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా... స్థానికులు అతని వివరాలు సేకరిస్తూ వీడియో తీశారే తప్ప సాయం అందించే ప్రయత్నం చేయలేకపోయారు. తాగడానికి నీళ్లివ్వమని అడగడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. నీళ్లు ఇస్తే ప్రమాదమనే కారణం చెబుతూ అతని వివరాలు సేకరించారు. అయితే వామన్‌రావు తనపై దాడి చేసిన వ్యక్తి కుంట శ్రీనివాస్ అని చెప్పడం ఇప్పుడు కేసులో నిందితులను పట్టుకోవడానికి ఉపయోగపడింది.
వివాదాస్పద కేసులతో కంట్లో నలుసుగా
వామన్‌రావు మొదటి నుంచి వివాదాస్పద కేసులు వాదిస్తూ పలువురికి కంట్లో నలుసుగా మారాడు. పెద్దపల్లి జిల్లాలోనే కాకుండా మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం అనేక కేసులు ఇరువురు దంపతులు వాదిస్తుంటారు. మంథని మండలం గుంజపడుగు గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగ పరుస్తున్నారే విషయంపై అప్పటి పెద్దపల్లి కలెక్టర్ దేవసేనతోపాటు జిల్లా పంచాయతీ అధికారి సుదర్శన్, జిల్లా అధికారులపై హైకోర్టులో దాఖలు చేసిన కేసులు అప్పట్లో చర్చనీయాంశం. పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్రమ ఆస్తులు కూడబెట్టారనే కేసు ఆయన పదవికే గండం తెచ్చింది. పుట్ట మధుపై ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయేషా అనే అభ్యర్థి పుట్ట శైలజపై వేసిన కేసును సైతం వామన్‌రావు వాధిస్తున్నారు. మంథని పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ శీలం రంగయ్య కేసులో హైకోర్టులో పిల్ వేసి ప్రధాన న్యాయమూర్తి దృష్టిని ఆకర్షించారు.
వామన్‌రావు దంపతులపై బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు అట్రాసిటీ, ఛీటింగ్ కేసులు నమోదు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసులు పెట్టిన కేసును కూడా హైకోర్టులో సవాల్ చేసి పోలీసులకు నలుసుగా మారారు. శీలం రంగయ్య లాకప్‌డెత్ కేసులో తాను హైకోర్టును ఆశ్రయించడం వల్లనే పోలీసులు తనను వేధిస్తున్నారని ప్రధాన న్యాయమూర్తికి తెలపడం గమనార్హం. రంగయ్య కేసు విచారణ పూర్తి అయ్యే వరకు వామన్‌రావు దంపతులను తెలంగాణ రాష్ట్రంలోని ఏ పోలీస్‌స్టేషన్‌కు పిలవకూడదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా... ఆ ఉత్వర్తులను మరో నాలుగు వారాలు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ఇటీవల వెల్లడించింది.
పెద్దపల్లికి తరలిన రాజకీయ నేతలు
హత్య విషయం దావానంలా వ్యాపించడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి గుంజపడుగు గ్రామస్తులు, రాజకీయ నాయకులు చేరుకున్నారు. ఈ హత్యలో ప్రధానంగా కుంట శ్రీనుతోపాటు అదే గ్రామానికి అక్కపాక కుమార్, వసంతరావ్‌ల హస్తం ఉన్నట్లు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేసారు. రాజకీయాలు సైతం ముఖ్య పాత్ర పోషించినట్లు కొందరు నాయకులు నేరుగా ఆరోపిస్తున్నారు. పోలీసుల వైఫల్యం వల్లే దంపతుల హత్య జరిగిందని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంఎల్‌సీ జీవన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
వామన్ కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిసి కూడా ఎందుకు రక్షణ కల్పించలేదని, పోలీసులకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తున్నాడనే కక్షతోనే ఇలా వ్యవహరించారని వారు పేర్కొన్నారు. న్యాయవాదుల హత్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందని, పూర్తిస్థాయిలో వి చార ణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల తప్పుడు పనులను ప్రశ్నించినందుకే దారుణంగా చంపించారని పలు పార్టీల నాయకులు ఆరోపించారు. హైకోర్టు న్యాయవాదుల హత్యలకు నిరసనగా కోర్టుల బంద్ నిర్వహించాలని పలు బార్ అసోసియేషన్‌లు తీర్మానాలు చేశారు. సోషల్‌మీడియాలో వీరి హత్య సంఘటనలు పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతున్నాయి.
ముగ్గురిపై కేసు నమోదు
న్యాయవాద దంపతుల హత్యపై పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్, వసంతరావులపై వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు. కాగా ప్రధాన నిందితుల్లో ఒకడైన అక్కపాక కుమార్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు కమిషనర్ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. హత్య చేసి తప్పించుకొన్న ఇద్దరిలో ఒక్కరే తమ అదుపులో ఉన్నట్లు చెప్పడం గమనార్హం. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ విషయం గురువారం తెలిసే అవకాశం ఉంది.
సీఎం పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని...
గట్టు వామనరావు దంపతులను హత్య చేసిన కేసులో ప్రథమ నిందితుడు కుంట శ్రీనివాస్ బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. ఉదయం మంథనిలో జరిగిన కార్యక్రమంలో జెడ్‌పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో హత్య జరిగిందంటే వేడుకల తరువాతే అక్కడికి వెళ్లి ఉంటాడనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment