
మృతి చెందిన వెంకటేశ్వరమ్మ
కృష్ణాజిల్లా, ముసునూరు (నూజివీడు) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, అత్త మామలు, తోటి కోడలు, బావగార్లు మూకుమ్మడిగా పెడుతున్న వేధింపులకు తాళలేక ఓ మహిళ పురుగు మందు తాగి తనువు చాలించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కేవీజీవీ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చింతలవల్లి శివారు గోగులంపాడుకు చెందిన ఎలికే అనిల్ భార్య వెంకటేశ్వరమ్మ (25) భార్యా భర్తలు. వీరు 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరమ్మ ఆదివారం ఉదయం పురుగు మందు తాగింది. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ క్లినిక్‌లో ప్రథమ చికిత్స అందించి, అనంతరం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందింది.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తుండగా, అల్లుడు, అత్తింటివారే తమ బిడ్డను అంతమొందించినట్లుగా మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గోగులంపాడులోని ఇంటివద్ద అత్త, స్థానికులను ఎస్‌ఐ విచారించి ఆధారాలు సేకరిస్తున్నారు. నూజివీడు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. మృతురాలి తల్లిదండ్రులు కొండలరావు, రంగారావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment