
మృతిచెందిన నరసింహారావు
సాక్షి, మైలవరం: కుటుంబ సభ్యుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. బంధాలు భారమవుతున్నాయి..క్షణికావేశంలో బంధాలు తెంచుకుంటున్నారు.. చిన్నచిన్న విషయంలో పట్టింపులకు పోతున్నారు. ప్రాణాలు తీసుకునేందుకు వెనకడం లేదు.అన్నపై దాడి చేస్తున్నాడని ప్రశ్నించిన పాపానికి బాబాయిని అన్న కొడుకు కొట్టిచంపిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
తండ్రీకొడుకులు గొడవ పడుతున్న నేపథ్యంలో అడ్డుగా వెళ్లిన వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందిన ఘటన చెర్వుమాధవరం గ్రామంలో బుధవారం తెల్ల్లవారుజామున చోటుచేసుకొంది. ఎస్‌ఐ రాంబాబు అందించిన వివరాలు... జి.కొండూరు మండల పరిధిలోని చెర్వుమాధవరం గ్రామానికి చెందిన ఓర్సు బాబు, కొడుకు నాగరాజుకి జీవనోపాధి కోసం ఆటో కొని ఇచ్చాడు. అయితే మద్యానికి బానిసైన నాగరాజు ఆటోని సక్రమంగా నడపకుండా అప్పులు చేస్తుండడంతో తండ్రి మందలించాడు.
ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నాగరాజు తండ్రిని కొట్టాడు. ఇది గమనించి బాబు తమ్ముడు ఓర్సు నరసింహారావు(37) అడ్డుగా వెళ్లాడు. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజు బండరాయి తీసుకొని బాబాయి నరసింహారావు తలపై మోదాడు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో కుటుంబ సభ్యులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ శ్రీను, ఎస్‌ఐ రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment