సోషల్ మీడియా కార్యకర్త రవికిరణ్‌కు బెయిల్ కోసం గుడివాడ వచ్చిన మాజీ మంత్రి
రెచి్చపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. పేర్ని నాని కారుపైకి రాళ్లు.. అద్దాలు ధ్వంసం
కారుపై పెట్రోలు పోసి నిప్పంటించే యత్నం
సాక్షి, అమరావతి/గుడివాడటౌన్/తాడేపల్లి/నెహ్రూనగర్: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) లక్ష్యంగా బీభత్సం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ప్రతినిధి ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రవి కిరణ్‌కు బెయిల్ ఇచ్చి విడుదల చేయించేందుకు పేర్ని నాని, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లో రవికిరణ్‌కు బెయిల్ ఇప్పించిన అనంతరం పేర్ని నాని ఆయన అనుచరులతో కలిసి రాజేంద్రనగర్‌లోని వైఎస్సార్‌సీపీకి చెందిన తోట శివాజీ ఇంటికి వెళ్లారు. పేర్ని నాని పట్టణానికి వచ్చిన సమాచారం అందుకున్న జనసేన, టీడీపీ నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు.
తోట శివాజీ ఇంటి వద్దకు చేరుకుని పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం కావడం, ఇతర కార్యక్రమాలు లేకపోవడంతో కార్యకర్తలు భారీగా గుమికూడారు. ఇంటిబైట ఉన్న నాని కారును ధ్వంసం చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు. కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని.. జనసేన నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారించినప్పటికీ ఫలితం లేకపోయింది. సుమారు రెండు గంటలు పైబడి పేర్ని నానికి, వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసుల సమక్షంలోనే ఈ దౌర్జన్యం, దాడులు కొనసాగాయి. దాడుల విషయం తెలుసుకుని టిడ్కో గృహాల వద్ద మరో కారుతో పేర్ని నాని డ్రైవర్ సిద్ధంగా ఉండగా.. అక్కడకూ వెళ్లి ఆ కారుపైనా దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరుగుతున్నా వారు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అనంతరం పోలీసులు జనసేన శ్రేణులను అక్కడ నుంచి పంపించి.. పేర్ని నానిని పట్టణం దాటించారు. కాగా, పేర్ని నానిపై టీడీపీ, జనసేన నేతల దాడిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఘటనలే తార్కాణమన్నారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ అరెస్టును ఆ పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment