ఆగని టీడీపీ దాడులు.. పెరిగిన విధ్వంసం | TDP Leaders Attacks On YSRCP Leaders | Sakshi
Sakshi News home page

ఆగని టీడీపీ దాడులు.. పెరిగిన విధ్వంసం

Published Sun, Jun 16 2024 4:40 AM | Last Updated on Sun, Jun 16 2024 7:05 AM

పల్నాడు జిల్లా గొట్టిపాళ్లలో టీడీపీ నాయకులు ధ్వంసం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇల్లు

మాజీ మంత్రి పేర్ని నాని ఇంటివైపు దూసుకెళ్లేందుకు టీడీపీ శ్రేణుల యత్నం 

రాళ్ల దాడి చేయడంతో పోలీసులకు గాయాలు 

పుంగనూరులో దళిత, బీసీ నేతలపై దాడి.. హత్యాయత్నం 

విజయవాడలో వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లు, దుకాణాల కూల్చివేత

సాక్షి నెట్‌వర్క్‌: టీడీపీ పార్టీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో చేపట్టిన అభి­వృద్ధి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపనల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాల వద్ద  మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రాలున్న శిలాఫలకాలను టీడీపీ శ్రేణులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశాయి. శనివారం ఉదయం విధులకు హాజరైన సచివాలయ సిబ్బంది దీనిని గుర్తించారు. ఈ ఘటనపై తణుకు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు తెలిపారు.  

నూజివీడులో శిలాఫలకం కూల్చివేత 
ఏలూరు జిల్లా నూజివీడు నెహ్రూ పేటలో శనివారం తెల్లవారుజామున ఒక శిలాఫలకాన్ని కూల్చివేశారు. వారం రోజుల క్రితం  చాట్రాయి మండలం పోలవరంలో నాలుగు శిలాఫలకాలను ధ్వంసం చేయగా.. ఈ నెల 11న రాత్రి నూజివీడు మండలం బోర్వంచలో గ్రామ సచివాలయ భవనం కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఎంఎన్‌పాలెంలో రెండు శిలాఫలకాలను, సీతారామపురంలో ఒక శిలాఫలకాన్ని, తూర్పుదిగవల్లిలో గ్రామ సచివాలయం బోర్డును ధ్వంసం చేశారు.   


సచివాలయంపై టీడీపీ జెండా 
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం సచివాలయం ప్రారం¿ోత్సవ శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు నెలకుర్తి దినే‹Ù, గుత్తా మహేందర్‌ ధ్వంసం చేశారు. సచివాలయం, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనం వద్ద ఉన్న శిలాఫలకం కూడా ధ్వంసం చేశారు. అనంతరం గ్రామ సచివాలయంపై టీడీపీ జెండా పెట్టారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలను టీడీపీ కార్యకర్తలు వీడియో తీసి వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టి మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని కామెంట్లు పెట్టారు. 



ధ్వంసం చేసిన శిలాఫలకాల బోర్డులను, సచివాలయ భవనాలను శనివారం వైఎస్సార్‌సీపీ నాయకులు, సర్పంచ్‌ వడ్లమూడి మురళీమోహన్, ఎంపీటీసీ కోండ్రు వెంకటేశ్వర్లు, మాజీ వైస్‌ ఎంపీపీ ఉన్నం శ్రీనివాసులు పరిశీలించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి నాగార్జున ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదిలి సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ మాధవరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ, ఎస్‌ఐ చెప్పారు.  

వైఎస్సార్‌ పేరు తొలగింపు 
ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని నూతన మునిసిపల్‌ కార్యాలయంపై గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు, కార్యాలయం ప్రవేశ ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ పేర్లను టీడీపీ నాయకులు శనివారం తొలగించారు. మునిసిపల్‌ కార్యాలయం 6 నెలల క్రితం ప్రారంభం కాగా.. ఆర్చిని  బూచేపల్లి శివప్రసాదరెడ్డి సొంత నిధులతో నిర్మించారు. 

వీటితో పాటు చీమకుర్తిలోని ప్రభుత్వాస్పత్రి ప్రవేశ ద్వారం ఆర్చిపై ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ పేర్లను కూడా తొలగించారు. ఈ ఘటనలపై వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్‌ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, కౌన్సిలర్‌ సోమా శేషాద్రి, గోపురపు చంద్ర, ఆముదాలపల్లి రామబ్రహ్మం తదితరులు సీఐని కలిసి వినతిపత్రం అందించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement