హరిప్రసాద్‌ను, చోరీ సొత్తును ప్రదర్శించిన డీఎస్పీ పోతురాజు, సీఐ మూర్తి
కృష్ణాజిల్లా, నాగాయలంక (అవనిగడ్డ): ఇంటి దొంగల ఆటకు పోలీసులు బ్రేక్ వేశారు. అతి తక్కువ కాలంలోనే ఓ చోరీ కేసును ఛేదించి నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల నుంచి మొత్తం చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నాగాయలంక పోలీసు స్టేషన్‌లో అవనిగడ్డ డీఎస్పీ వీ.పోతురాజు సామవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు.
చెడు వ్యసనాలకు అలవాటుపడి..
నాగాయలంక ఏడో వార్డు నివాసి నాగిడి హరిప్రసాద్, అతని స్నేహితులైన మైనర్‌లు ఇద్దరు చెడు వ్యసనాలకు బానిసయ్యారు. విలాసాలకు అలవాటు పడ్డారు. ఎలాగైనా ఓ బైక్ కొనాలని అనుకున్నారు. గత నెల 26న ఓ మైనర్ స్నేహితుడి తల్లిదండ్రులైన కొక్కిలిగడ్డ సోమశేఖరరావు దంపతులు కార్తీక నోముల కోసం సమీపంలోని అవనిగడ్డ మండలం వేకనూరుకు వెళ్ళారు. ముగ్గురు స్నేహితులు అదే అదనుగా భావించారు. చల్లపల్లి వెళ్లి తాళాలు కోసే వ్యక్తిని కలిశారు. తమ ఇంట్లోని బీరువా తాళాలు పోయాయని, కోసి పెట్టాలని కోరారు. అతన్ని తీసుకొచ్చి ఇంట్లో గోడకు అమర్చి ఉన్న చెక్కపెట్టె తాళాలు కోయించారు. అతనికి వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత చెక్క పెట్టెలోని 77 గ్రాముల బంగారం, 82 గ్రాముల వెండి ఆభరణాలను, రూ.10 వేల నగదును తస్కరించారు. చోరీ సొత్తును హరిప్రసాద్ ఇంటి పక్కన ఉన్న వనమాలి తులసమ్మ ఇంట్లో ఎవరూ చూడకుండా దాచిపెట్టారు. కార్తీక నోముల నుంచి తిరిగొచ్చిన సోమశేఖరరావు దంపతులు దొంగతనం జరిగినట్లు గుర్తించి ఇరుగు పొరుగు వారిని విచారించారు. అయితే, కొడుకు, అతని స్నేహితులే ఇక్కడ తిరిగినట్లు వారు చెప్పారు. దీంతో వారిని గట్టిగా మందలించడంతో అసలు విషయం బయటపెట్టారు. అయితే తాళాలు కోయించి కొంత సొమ్మునే తస్కరిం చినట్లు, మిగతాది తమకు తెలియదంటూ బుకాయించారు. దీంతో గత్యంతరం లేక పోలీసు స్టేషన్‌లో సోమశేఖర్ ఫిర్యాదు చేశాడు.
సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో..
కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్న ల్స్, చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజి ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అపహరణకు గు రైన మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎ స్పీ వివరించారు. అయితే, ఫిర్యాదులో పేర్కొన్న దానికంటే స్వాధీనం చేసుకున్న సొత్తు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మైనర్లను జువైనల్ కోర్టులో, హరిప్రసాద్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని చెప్పారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన అవనిగడ్డ ఎస్‌ఐ సందీప్, సీఐ ఏఎన్‌ఎన్ మూర్తిలను అభినందించారు. సమావేశంలో నాగాయలంక ఎస్‌ఐ కే.రాజారెడ్డి, ఏఎస్‌ఐ వీరాంజనేయులు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment