మాట్లాడుతున్న డీసీపీ విజయరావు, ఏడీసీపీ చంద్రశేఖర్, ఏసీపీ సుధాకర్
సాక్షి, అమరావతి : విజయవాడలో గత శనివారం ప్రగతి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో క్యాషియర్‌పై కర్రలతో దాడి చేసి నగదును కాజేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దోపిడీకి పథక రచన చేసిన సూత్రధారితోపాటు దోపిడీలో పాల్గొన్న ముగ్గురిని 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సూర్యారావుపేట స్టేషన్ కార్యాలయంలో డీసీపీ–2 విజయరావు మీడియాకు వివరాలు వెల్లడించారు.
స్నేహితుడే కానీ..
విజయవాడ నగరం 2వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని పంజా సెంటర్, పాడి వీధిలో ప్రగతి ట్రాన్స్‌పోర్టును సంతోష్ కుమార్ త్రిపాఠి నిర్వహిస్తున్నారు. ఆ కార్యాలయంలో మార్కెటింగ్ మేనేజర్‌గా త్రిపాఠి స్నేహితుడు ఎదుబోస్లే వేణుగోపాల్ పనిచేస్తుండేవాడు. కొంత కాలం తర్వాత వ్యాపార లావాదేవీల్లో తేడాలు వచ్చి వేణుగోపాల్ త్రిపాఠి వద్ద పనిచేసి సొంతంగా మరొక కంపెనీ ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహించాడు. ఆ వ్యాపారంలో నష్టం రావడంతో తన స్నేహితుడు త్రిపాఠిపై వేణుగోపాల్ కక్ష పెంచుకున్నాడు. అదే సమయంలో వేణుగోపాల్ అనారోగ్యం పాలయ్యాడు. ఈ సమయంలో ప్రగతి ట్రాన్స్‌పోర్టులో దొంగతనం చేయాలని పథకం వేశాడు. ఇందుకు తన భార్య అక్క కొడుకు విశాల్ రాజ్‌కుమార్ కోయిల్ సాయం తీసుకున్నాడు. విశాల్ ప్రగతి ట్రాన్స్‌పోర్టులోనే కిరాయి ఆటోను పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు.
పక్కా స్కెచ్..
ప్రగతి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో రోజూ రూ.5 లక్షలకు పైగా నగదు ఉంటుందనే విషయాన్ని గ్రహించారు. ముందుగానే పథక రచన చేశారు. క్యాషియర్‌గా పని చేస్తున్న ప్రదీప్ పాండే ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో రాత్రి 9.30 గంటల అనంతరం ఒక్కడే ఉండే విషయాన్ని తెలుసుకొని కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించారు. దోచుకోవడం విశాల్ ఒక్కడి వల్ల కాదనే భావనతో అతడి స్నేహితులైన మహారాష్ట్ర లాథూర్ జిల్లా దేవిని మండలం బొరొల్ గ్రామానికి చెందిన కోపె మాధవ్ త్రయంబక్, సందీప్ పాండురంగ యంకురేలను నగరానికి రప్పించాడు. ఈనెల 13వ తేదీ రాత్రి దోపిడీకి సిద్ధమయ్యారు. విశాల్ స్నేహితులు కొత్తపేట చేపల మార్కెట్ వద్ద ఉన్న షాదీఖానా ప్రాంతంలోని మేదర్ల వద్ద రెండు వెదురు కర్రలు కొన్నారు. అదే రోజు రాత్రి 9.30 గంటలకు ట్రాన్స్ పోర్టులో ఉన్న సిబ్బంది కూడా వెళ్లి పోయిన తర్వాత కార్యాలయంలోకి చొరబడి క్యాషియర్‌పై కర్రలతో దాడి చేసి రూ. 3.50 లక్షల నగదును దోచుకెళ్లారు.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా..
దోపిడీ జరిగిన తర్వాత క్యాషియర్ ప్రదీప్‌పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఏడీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని దోపిడీ తీరును పరిశీలించారు. ఆధారాలను సేకరించారు. అలాగే ప్రగతి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలోకి నిందితులు చొరబడిన తీరు సీసీ కెమెరాల ఫుటేజ్‌లో నమోదైంది. దాని ఆధారంగా విశాల్‌ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో సూత్రధారి వేణుగోపాల్‌ను.. దోపిడీలో పాల్గొన్న మరో ఇద్దరి కోసం మహారాష్ట్రకు ప్రత్యేక బృందాన్ని పంపించి వారిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం వారి వద్ద నుంచి రూ. 3.50 లక్షల నగదుతోపాటు దోపిడీకి వినియోగించిన బైక్, వెదురు కర్రలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు.
పోలీసులకు అభినందనలు..
దోపిడీ జరిగిన వెంటనే రెండు రోజుల్లోనే కేసును ఛేదించడమే కాకుండా మహారాష్ట్రకు వెళ్లి నిందితులను అరెస్టు చేసిన ఏడీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్‌తోపాటు వెస్ట్‌జోన్ ఏసీపీ సుధాకర్, టూటౌన్ సీఐ ఉమర్, ఎస్‌ఐలు కృష్ణ, సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఖాదర్, నాంచారయ్య, అజయ్, రాజేష్‌లను డీసీపీ విజయరావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment