అరెస్టు చేసిన దోపిడీ ముఠా సభ్యులను మీడియాకు చూపుతున్న విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు
సాక్షి, అమరావతిబ్యూరో: పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం దోపిడీ దొంగలు జన నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రిపూట ఆ ఇళ్ల తలుపులు పగులగొట్టి ఇంట్లో నిద్రిస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేసి దోపిడీలకు పాల్పడేవారు. ఇలాంటి దోపిడీలకు పాల్పడే ముఠాల్లో పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్ ముందువరుసలో ఉంటుంది. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో ఈ ముఠాలు దోపిడీలకు తెగబడేవి. సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత ఆ ముఠా తరహాలోనే విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉయ్యూరు మండలం కాటూరులో ఈ నెల 10న అర్ధరాత్రి ఓ ఇంట్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు 62 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.వెయ్యి నగదుతోపాటు ఓ సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు విచారణ చేసి తెనాలికి చెందిన పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు దోపిడీ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉయ్యూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.
తలుపులు పగలగొట్టి బీభత్సం..
ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగ రజనీకాంత్ కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి ఆరుగురు వ్యక్తులు ముఖానికి ముసుగులు, చేతులకు గ్లౌజులు, నిక్కర్లు ధరించి ఇంటి తలుపును గునపాలు, బండరాయితో ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు బద్ధలవుతున్న శబ్దం విన్న రజనీకాంత్ అతని భార్య హాలులోకి వచ్చేసరికి దోపిడీ దొంగలు వారిని కత్తులు, గునపాలతో బెదిరించి చేతులు కట్టేశారు. ఇంట్లో విలువైన వస్తువులు ఇవ్వాలని బెదిరించారు. తమ వద్ద ఉన్న 62 గ్రాముల బంగారు ఆభరణాలు ఇవ్వగా.. కోళ్లఫారం వ్యాపారివి నీ వద్ద ఇంతేనా ఉండేదని ప్రశ్నించగా.. రజనీకాంత్ తనకు కోళ్లఫారం లేదని.. పక్కింట్లోని వ్యక్తిదని పేర్కొనడంతో దొంగలు కొంత శాంతించారు. తర్వాత బంగారు ఆభరణాలతోపాటు ఒక ఐఫోన్‌ను రూ. వెయ్యి నగదును తీసుకెళ్లిపోయారు. చివరగా దొంగల సృష్టించి భయోత్పాతానికి రజనీకాంత్ దంపతులు తమ వద్ద ఉన్న వెండి ఆభరణాలు ఇవ్వగా వాటిని తిరిగి వారికే ఇచ్చేశారు.
ఆధారాలు సేకరించి..
బాధితుల ఫిర్యాదు మేరకు ఉయ్యూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలానికి వెళ్లి దోపిడీ జరిగిన తీరు పరిశీలించారు. ఘటనా స్థలం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సేకరించిన వివరాలను విశ్లేషించారు. దొంగల పాద ముద్రలు దొరికాయి. బాధితుల చెప్పిన వివరాల మేరకు దోపిడీకి వచ్చిన నేరగాళ్లు వచ్చిరాని తెలుగులో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో అంతరాష్ట్ర ముఠా పనేనని అనుమానించారు.
మిర్యాలగూడ దోపిడీతో కేసు కొలిక్కి..
కాటూరులో దోపిడీ ఏ ముఠా చేసిందనే కోణంలో దర్యాప్తు చేస్తుండగా.. అచ్చం ఈ తరహా దోపిడీనే డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో జరిగినట్లు తెలిసింది. వెంటనే సీసీఎస్ పోలీసులు అక్కడకు వెళ్లి బాధితులతో మాట్లాడగా.. అక్కడ కూడా నలుగురు వచ్చీరాని తెలుగులో మాట్లాడారని, ఒక్కడు మాత్రం కోస్తా యాసలో స్పష్టమైన తెలుగు మాట్లాడినట్లు వారు తెలిపారు. దీంతో ఈ తరహా దొంగతనాలు చేసే ముఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని దర్యాప్తు చేపట్టి.. చివరకు ఈ దోపిడీకి పాల్పడింది తెనాలికి చెందిన పెద్దింటి గొల్లాస్ గ్యాంగ్ అని గుర్తించారు.
తాత ముత్తాల నుంచి ఇదే వృత్తి..
దీంతో ఈ ముఠా సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు? అని పరిశోధించగా చివరకు తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలో పాల శివ, అతని కుమారుడు పాల వేణు, తమ్ముడు పాల లక్ష్మినారాయణ, పెనుమాక మహేష్, మేకల ఏసు, దొడ్డి పోతురాజులు అద్దెకు ఇల్లు తీసుకుని జీవిస్తున్నట్లు గుర్తించారు. దోపిడీ వీరి పనేని తేలడంతో పోలీసులు వారిలో ఐదుగురిని అరెస్టు చేయగా పాల లక్ష్మినారాయణ పరారీలో ఉన్నాడు. పాల శివపై 35 వరకు దోపిడీ కేసులు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
పక్కా రెక్కీ.. అనంతరమే దోపిడీ..
ఎవరికీ అనుమానం రాకుండా రాత్రి సమయాల్లో కోళ్లు, గొర్రెలు, మేకలు, బడ్డీ కొట్లు వంటి చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడే ఈ ముఠాకు పాల శివ నేతృత్వం వహిస్తాడు. కాటూరు గ్రామంలో నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి రజనీకాంత్ ఇంటిని టార్గెట్‌గా చేసుకున్నారు. రెక్కీ నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అందరూ పాల శివ ఆటోలో బయలుదేరి వెళ్లారు. ఆటోను రజనీకాంత్ ఇంటి సమీపంలో ఉన్న కోళ్లఫారం దగ్గర ఉన్న వెంచర్‌లో పార్క్ చేశారు. ఆ తర్వాత రజనీకాంత్ ఇంటి ప్రహరీ గోడను దూకి మొదట గునపంతో తలుపు తీయడానికి యత్నించారు. సాధ్యపడకపోవడంతో ఇంటి వెనుకవైపు ఉన్న పెద్ద బండరాయితో తలుపును బద్ధలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు.
Comments
Please login to add a commentAdd a comment