'వల'పుబాణంతో.. 'వెబ్‌'చారం | Prostitution Scandal in Krishna | Sakshi
Sakshi News home page

'వల'పుబాణంతో.. 'వెబ్‌'చారం

Published Thu, Dec 6 2018 1:13 PM | Last Updated on Thu, Dec 6 2018 1:13 PM

Prostitution Scandal in Krishna - Sakshi

నాగరికత పెరుగుతున్న కొద్దీ.. విశృంఖల పోకడలు కూడా దానితో పాటు పోటీపడుతున్నాయి. టెక్నాలజీని తప్పుదారి పట్టించడంలో వ్యభిచార ముఠాలు ముందుంటున్నాయి. ఇటీవల కాలంలో ఏది కొనాలన్నా.. తినాలన్నా.. చూడాలన్నా అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతోంది. సరిగ్గా దీనినే కొందరు ఆసరాగా తీసుకుని హైటెక్‌ వ్యభిచారానికి తెరతీస్తున్నారు. వెబ్‌సైట్లు క్రియేట్‌ చేసుకుని వ్యాపార ప్రముఖుల పిల్లలు, పెద్దింటి యువకులే లక్ష్యంగా సొషల్‌ మీడియాను అస్త్రంగా మార్చుకుని దందా సాగిస్తున్నారు. ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్‌ తదితర మెట్రో నగరాలకే పరిమితమైన ఈ తరహా వ్యవహారం విజయవాడలోనూ కొరలు చాచుతోంది. వీటిపై పోలీసుల నిఘా కొరవడటంతో యువత తప్పుదారి పడుతోంది.

సాక్షి, అమరావతిబ్యూరో : బెజవాడ నగరంలో వ్యభిచార ముఠాలు బరితెగిస్తున్నాయి. అందివచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఇంటర్నెట్‌ ద్వారా యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా విటులను ఆకర్షిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి.

చిన్న సెర్చ్‌ చాలు..
గూగుల్‌లో ఒక్కసారి సెర్చ్‌చేస్తే పదుల సంఖ్యలో వ్యభిచార వెబ్‌సైట్లు మహిళల చిత్రాలు, చిరునామాలతో సహా దర్శమిస్తాయి. నచ్చితే ఫొన్‌ నంబర్లలో సంప్రదించాలని మెసేజ్‌లు కనిపిస్తాయి. అంతే కాక ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూపులను కూడా ముఠాలు ఉపయోగిస్తున్నారని సమాచారం. ఆ గ్రూపుల్లో అమ్మాయిల ఫొటోలు పెడుతూ.. నచ్చితే సంప్రదించమని కోరుతుంటారని తెలుస్తోంది. దీనికోసం వారు కుటుంబం, వ్యాపారం, కన్సల్టెన్సీ తదితర పేర్లతో అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత నివాస గృహాలను అద్దెకు తీసుకుంటూ.. విటుల్ని,  అమ్మాయిల్ని అక్కడికే పిలిపిస్తుంటారు. నగరంలో నున్న, సింగ్‌నగర్, కృష్ణలంక, రామవరప్పాడు తదితర ప్రాంతాల్లో పట్టపగలే వ్యభిచార ముఠాలు విజృంభిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.  

ఇదిగో ఇలా వల..
హైటెక్‌ వ్యభిచార ముఠాలు తమ వ్యవహారాల్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నాయి. ముందుగా వెబ్‌సైట్‌లో దరఖాస్తును ఉంచుతారు. ఆసక్తిగలవారు దాన్ని పూర్తి చేయాలి. ఫోన్‌ నంబర్లు ఇతరత్రా పూర్తిగా సేకరించిన సమాచారంతో దరఖాస్తుదారుడి గురించి ముఠా సభ్యులు విచారణ చేస్తారు. అనుమానాస్పద వ్యక్తులు కాదని నిర్థారించుకున్న తర్వాత అతన్ని కలుసుకుంటారు. అప్పటికీ అతన్ని పూర్తిగా నమ్మరు. ఒకట్రెండు చోట్లకు తిప్పుతారు. అవతలి వ్యక్తిపై పూర్తిగా నమ్మకం కలిగిన పిమ్మటే ఇంటికి తీసుకెళతారు. 20 నుంచి 25 ఏళ్ల యువకులే ఈ ముఠాల వలలో చిక్కుతున్నారు. విటులకు ఇల్లుతో సహా సకల సౌకర్యాలు కల్పిస్తారు.

స్నేహహస్తమంటూ ఉచ్చు..
ఇంటర్నెట్‌లో కొందరు మహిళల స్నేం చేస్తామంటూ ఫొటోలు, వివరాలు ఉంచుతున్నారు. యువకులు కదా అని వారికి ఫోన్‌ చేస్తే వారి ఉచ్చులో చిక్కుకున్నట్లే. ముందుగా స్నేహం, ఆ తర్వాత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇక కాల్‌గరల్స్‌ అంటూ వెబ్‌సైట్లలో ఉంచుతున్న ఫొటోలు చాలామటుకు తప్పుడివే ఉంటాయి. అందమైన అమ్మాయిల ఫొటోలు ఉంచి యువతను మోసం చేస్తున్నాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

దాడులు మానేసిన పోలీసులు..
నగరంలో వ్యభిచార ముఠాల ఆగడాలపై పోలీసులు నోరుమెదపడం లేదు. నిత్య వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఇతర ముఖ్యమైన పనులు అప్పగించారు. ఇది చాలా చిన్న వ్యవహరమంటూ వ్యభిచార గృహాలపై దాడులు చేసే పనిని స్థానిక పోలీసులకే అప్పజెప్పారు. అప్పటి నుంచి వ్యభిచార ముఠాల జోరుకు పగ్గాల్లేకుండా పోయాయన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక పోలీసులకు తమ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసన్న వాదన వినిపిస్తోంది. కానీ ఎప్పుడూ దాడులు చేసింది లేదు. పోలీసుల నిర్లిప్తత వల్ల వేలాది మంది బాలికలు, మహిళల జీవితం నరకకూపంలో మగ్గిపోతున్నాయి. అయితే ఇంటర్నెట్‌ వ్యభిచార గుట్టును రట్టు చేసినా నిర్వాహకులు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండటం వల్ల వారిపై చర్యలు తీసుకోవడం కష్టమే అవుతోందంటున్నారు ఓ సీనియర్‌ పోలీసు అధికారి. ఇలాంటి కేసులను దర్యాప్తు చేయడానికే ప్రత్యేకంగా ‘సైబర్‌సెల్‌’ను ఏర్పాటు చేశారు. ఖరీదైన కాలనీల్లో తిష్టవేసే ఈ ముఠాలు అపార్టుమెంట్ల కన్నా వ్యక్తిగత నివాసాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement