చిట్టినగర్(విజయవాడ పశ్చిమ) : ఆన్‌లైన్ లక్కీ డ్రాలో కారు వచ్చిందంటూ ఓ మహిళ నుంచి పలు దఫాలుగా రూ. 4.49 లక్షలు బ్యాంక్‌లలో జమ చేయించుకున్న ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలికి రెండు నెలలుగా కారు ఇవ్వకుండా ఇంకా డబ్బులు చెల్లించాలని నిందితులు నిత్యం ఫోన్లు చేసి మాట్లాడుతుండటంతో ఎట్టకేలకు విషయం పోలీసులకు చేరింది. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి కాలనీలో జరిగింది.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలనీలోని బ్లాక్ నెం 272 టీఎఫ్–1లో సత్యవరపు విజయ, మల్లేశ్వరరావు దంపతులు నివాసం ఉంటున్నారు. విజయ కుమారుడు వినోద్‌కుమార్ కు మే 15న ఆన్‌లైన్‌లో కారు వచ్చిందంటూ ఫోన్ రావడంతో ఆ కుటుంబానికి అనందానికి అవధులు లేకుండా పోయ్యాయి. కారు రోడ్డు టాక్స్ మీరే చెల్లించాలని చెప్పడంతో తొలుత రూ.12,800 చెల్లించారు. కారు పంపకుండా క్యాష్ ప్రైజ్‌గా కూడా తీసుకోవచ్చునని నమ్మించారు. దీంతో వారు మరో మారు ఫోన్ చేసి టాక్స్ మొత్తం మీరే చెల్లించాలని చెప్పగా రూ.25,600 ఆన్‌లైన్ అకౌంట్‌లో చెల్లించారు. అదే నెల మరోసారి ఫోన్ చేయడంతో రూ. 51,200 చెల్లించారు.
మీ ప్రైజ్ మనీ రెట్టింపు
బ్యాంక్‌లో డబ్బులు పడతాయని ఆశగా ఎదురు చూస్తున్న వారికి మరోసారి సదరు కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. మీకు కంపెనీ ఇచ్చే ప్రైజ్‌మనీ రెట్టింపు అయిందని, ఒకటి రెండు రోజులలో మీ అకౌంట్‌లో నగదు వేస్తామని చెప్పి మరి కొన్ని వివరాలను తీసుకున్నారు. ఆ తర్వాత జూన్ 1న రూ. 1,13,600, 6న మరో రూ. 40 వేలు, 25న మరో రూ. 1.09,600 చెల్లించారు. ఇక అంతటితో ఆగకుండా గత నెల 27న రూ. 20 వేలు, ఈ నెల 23న మరో రూ. 50 వేలు వేశారు. ఈ నెల 23వ తేదీ ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు రాఘవేంద్రగా చెప్పి మరో రూ. 26,100 చెల్లిస్తే డబ్బులు గంటలో మీ అకౌంట్‌లో వేస్తామని చెప్పారు. ఆ డబ్బులు వేయకపోవడంతో ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ. 4.49 లక్షల నగదును పలు బ్యాంకుల్లో ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిరుపతిరావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment