పట్టుబడిన నకిలీ పోలీసులతో సీఐ రమణ, ఎస్‌ఐ కిషోర్
సాక్షి, విజయవాడ(నూజివీడు) : పోలీసులమని చెప్పి డబ్బు వసూలు చేసిన నకిలీ పోలీసులను అరెస్టు చేసినట్లు హనుమాన్‌జంక్షన్ సీఐ డి.వి.రమణ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జి.కొండూరు మండలం కందులపాడుకు చెందిన నాగారపు సురేష్‌బాబు, గణేష్ కలసి బత్తులవారిగూడెం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సీతారామపురం గ్రామం చివర పోలీస్ స్టిక్కర్‌లతో ద్విచక్ర వాహనంపై ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు వెనుకగా వచ్చి ఆపారు. ‘మేము పోలీసులం బైక్ ఆపమంటే ఆపకుండా వస్తున్నావు అని బెదిరించి రూ.5,900 లాక్కోని నూజివీడు వైపు వెళ్లారు. దీనిపై నాగారపు సురేష్‌బాబు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు, గ్రామస్తులకు తెలిపి శనివారం ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ఏఎస్‌ఐ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శోభనాపురం సమీపంలోని గణపవరం అడ్డరోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా నంబర్ లేని వాహనాన్ని నడుపుతూ అనుమానాస్పదంగా ఉన్న మైలవరం మండలం గణపవరానికి చెందిన బెల్లంకొండ నాగరాజు(33), బెల్లంకొండ వంశీ(19)లను అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బులు వసూలు చేసినట్లు నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్.ఐ పి.కిషోర్, ఏఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment