నిన్ను ప్రేమించాను.. నన్ను పెళ్లి చేసుకో | Women Commits Suicide In Krishna | Sakshi
Sakshi News home page

న్యాయం కోసం మృతురాలి బంధువుల ఆందోళన

Published Thu, Sep 13 2018 1:40 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Women Commits Suicide In Krishna - Sakshi

ఝాన్సీ (ఫైల్‌), మృతదేహం

కృష్ణాజిల్లా, కొణిజెర్ల (గంపలగూడెం) : కొణిజెర్లలో మంగళవారం రాత్రి మృతి చెందిన ఝాన్సీ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బంధువులు, అదే సామాజిక వర్గానికి చెందిన వారు బుధవారం ఆందోళనకు దిగారు. మృతురాలు ఝాన్సీని వేధింపులకు గురిచేసిన నంభూరి గోపి ఇంటి వద్ద మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. కాగా గ్రామ పెద్దలు, యాదవ సంఘం నాయకులు కలిసి రాజీ చేయడంతో బుధవారం సాయంత్రం ఆందోళనకారులు ఆందోళన విరమించారు. సంఘటనకు దారితీసిన వివరాలు ఇలా ఉన్నాయి.

‘నేను నిన్ను ప్రేమించాను.. నన్ను పెళ్లి చేసుకో’ అంటూ గోపి కొంతకాలంగా వెంటబడి వేధిస్తూ బెదిరింపులకు సైతం పాల్పడిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఝాన్సీ మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. సంఘటనపై మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన జోనెబోయిన శ్రీనివాసరావు ద్వితీయ కుమార్తె జోనెబోయిన ఝాన్సీ (20) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తోటమూలలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఆమె డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. రెండేళ్లుగా కొణిజెర్లకు చెందిన నంభూరి గోపి యువతి వెంటపడుతున్నాడు.

ప్రతి రోజులాగే ఝాన్సీ మంగళవారం కళాశాలకు వచ్చి క్లాసులు ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. మార్గంలో గోపి అడ్డగించి వేధించడంతో పాటు దాడికి పాల్పడ్డాడు. బస్‌ ఎక్కిన తర్వాత కూడా అందరూ చూస్తుండగానే మళ్లీ ఝాన్సీని కొట్టాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఝాన్సీ పొలానికి బండిమీద వెళుతుండగా బీసీ కాలనీ వద్ద కలిసి తనను పెళ్లి చేసుకోమని లేకుంటే తన కుటుంబ సభ్యులను కూడా చంపుతానంటూ బెదరించాడు. ఈ పరిస్థితిలో ఝన్నీ పొలం వద్ద పురుగుల మందు తాగి తిరిగి బైక్‌పై వస్తూ కిందపడిపోయింది. అటుగా వెళుతున్న వారు చూసి ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది.

తన కుమార్తె మరణానికి నంభూరి గోపి వేధింపులే కారణమంటూ మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్‌ షాకీరున్నీసాబేగం, సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ సోమేశ్వరరావు పంచనామా చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో సంచలనం రేపింది. యుక్తవయస్సుకు వచ్చిన కూతురు బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరై రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement