
సాక్షి, అమరావతిబ్యూరో : తనఖా పెట్టిన ఆస్తిని తమ తండ్రికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఫైనాన్స్ వ్యాపారి గగారిన్‌పై కక్ష కట్టారు మద్దాల సోదరులు సురేష్, సుధాకర్. తమ తండ్రిని మోసం చేసి రూ.కోటి విలువైన భవనాన్ని స్వాధీనం చేసుకున్నాడని వారు రగలిపోయారు. అతనితో గొడవలు పడ్డారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయినా ఆస్తి తగాదా తీరలేదు. దీంతో ఫైనాన్స్ వ్యాపారిని అంతమొందిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారు భావించారు. గవర్నర్‌పేటలో అతను ఉంటున్న కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 22న రెక్కీ నిర్వహించారు. 23వ తేదీ మధ్యాహ్నం 1:40 గంటల ప్రాంతంలో ఇద్దరు సోదరులు బైక్‌పై మూన్‌మూన్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. రవితేజ ఫైనాన్స్ సంస్థ కార్యాలయానికిచేరుకున్న మద్దాల సురేష్ అక్కడ ఉన్న గగారిన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. అనంతరం అతని సోదరుడు కూడా మరోమార్గంలో అక్కడి నుంచి జారుకున్నాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గగారిన్ మృతి చెందాడు. నగరంలో సంచలనం కలిగించిన ఈ కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లోని సౌత్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఏసీపీ జీవీ రమణమూర్తి వివరించారు.
తనఖా తెచ్చిన తంటా..
మొగల్‌రాజపురానికి చెందిన మద్దాల ప్రసాద్ అనే వ్యక్తి బ్యాంకు రుణం తీసుకుని శిఖామణి సెంటర్‌లో ఓ భవనం నిర్మించారు. సకాలంలో రుణం చెల్లించలేకపోవడంతో బ్యాంకు ఆ భవనాన్ని 2016లో వేలానికి పెట్టింది. ఇదే సమయంలో ఆ భవనాన్ని బ్యాంకు తనఖా నుంచి విడిపించేందుకు మధ్యవర్తి ద్వారా మద్దాల ప్రసాద్ ఫైనాన్స్ వ్యాపారి గగారిన్‌ను కలిశాడు. గగారిన్ వద్ద సంబంధిత ఆస్తిని తనఖా పెట్టాడు. ఈ నేపథ్యంలో గగారిన్ రూ.40.75 లక్షలకు సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ ఒప్పంద పత్రాలపై ప్రసాద్‌తో సంతకాలు పెట్టించాడు. ఆ తర్వాత ప్రసాద్‌కు తెలియకుండా గగారిన్ తన భార్య పేరుమీద ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇది తెలిసి ప్రసాద్ కుమారులు మద్దాల సురేష్, సుధాకర్ తండ్రిని నిలదీశారు. తాను ఇంటిని విక్రయించలేదని.. గగారిన్‌కు కేవలం తనఖా పెట్టి రూ.30 లక్షలు తీసుకున్నానని కుమారులకు వివరించాడు. ఈ క్రమంలో ఆ భవనం తమదంటే తమదంటూ గగారిన్, ప్రసాద్ కుమారులు పలుమార్లు గొడవ పడ్డారు. ఇరువురు ఒకరిపై ఒకరు మాచవరం పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కక్ష కట్టి కడతేర్చారు..
ప్రసాద్ కుమారుల్లో సురేష్ బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో నివసిస్తుండగా.. అతని సోదరుడు సుధాకర్ శిఖామణి సెంటర్‌లో ఉన్న వివాదాస్పద భవనంలోనే ఉంటున్నాడు. ఈ భవనం విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలు ఇటీవల తారస్థాయికి చేరాయి. సుధాకర్, సురేష్ ఇళ్ల వద్దకు వెళ్లి గగారిన్ బెదిరించాడు. సురేష్ భార్య ఈ విషయంలో గగారిన్‌పై హనుమాన్ జంక్షన్ పరిధిలోని వీరవల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తమ విలువైన ఆస్తిని మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా దౌర్జన్యానికి దిగుతున్న గగారిన్‌పై సోదరులు ఇద్దరు కక్ష కట్టారు. గగారిన్‌ను తుదముట్టించాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్రణాళిక రూపొందించుకుని 23వ తేదీ మధ్యాహ్నం సురేష్ కొబ్బరిబోండాలు నరికే కత్తి, పెట్రోల్ డబ్బాను తీసుకుని తిప్పనగుంట నుంచి బయలుదేరి గవర్నర్‌పేటలోని మూన్‌మూన్ ప్లాజా వద్దకు చేరుకున్నాడు. సుధాకర్ అప్పటికే అక్కడికి చేరుకున్నాడు. మధ్యాహ్నం 1:40 గంటల ప్రాంతంలో గగారిన్ ఉంటున్న రవితేజ ఫైనాన్స్ సంస్థ కార్యాలయంలోకి సురేష్ వెళ్లి అక్కడ ఉన్న గగారిన్‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. మంటల్లో చిక్కుకున్న గగారిన్ రక్షించాలంటూ బిగ్గరగా కేకలు వేస్తూ ప్లాజా నుంచి రోడ్డుపైకి వచ్చాడు. ఇదే సమయంలో సురేష్ కూడా పారిపోతూ బైక్ తాళాల్ని సోదరుడు సుధాకర్‌కు ఇచ్చి వెళ్లిపోయాడు. పారిపోయే క్రమంలో సురేష్ బ్యాగ్‌లో ఉన్న కత్తి కింద పడింది. స్థానికులు తీవ్రగాయాలైన గగారిన్‌ను ఆంధ్రా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గగారిన్ ఈ నెల 26వ తేదీ మృతి చెందాడు. అత్యంత రద్దీగా ఉండే గవర్నర్‌పేట ప్రాంతంలో అలజడి సృష్టించిన ఈ కేసును ఛేదించేందుకు సూర్యారావుపేట ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా గురువారం ఓల్డ్ గవర్నమెంట్ ఆస్పత్రి వద్ద ఉన్న సురేష్, సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా హత్యానేరాన్ని ఒప్పుకున్నారని ఏసీపీ రమణమూర్తి వివరించారు. నిందితులను అరెస్టు చేసిన ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.