
శైలజ(ఫైల్)
సాక్షి, కలిదిండి(కైకలూరు): లైంగిక వేధింపులతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని పోతుమర్రు పంచాయతీ గొల్లగూడెంలో దళితవాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పంచాయతీలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఎఫ్‌ఏగా పనిచేస్తున్న చిన్నం శ్రీకాంత్ (28), భార్య శైలజ(25) ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు.
ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న గ్రామానికి చెందిన కురేళ్ల రమేష్ కన్ను శైలజపై పడింది. ఆమెను లైంగికంగా వేధించ సాగాడు. స్వగ్రామం కలిదిండి శివారు ఇందిరాకాలనీకి చెందిన శైలజ ఈనెల 11న కలిదిండి వచ్చి, తిరిగి ఇంటికి వెళ్లడానికి రోడ్డుపై నిలబడి ఉండగా తన ఆటో ఎక్కమని శైలజను రమేష్ ఒత్తిడి చేశాడు.
దీంతో అవమానానికి గురైన శైలజ భర్తకు చెప్పి కలిదిండి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్న విషయానికి తనపై కేసు పెట్టిందని కక్ష పెంచుకున్న రమేష్ 12న రాత్రి 8 గంటల ప్రాంతంలో భర్త ఇంట్లో లేని సమయం చూసి శైలజ కాళ్లు చేతులు కట్టివేసి వేధించాడు. భర్త శ్రీకాంత్ ఇంటికి వచ్చే సమయానికి శైలజ సృహలో లేదు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున ఆరోగ్య పరిస్థితి వికటించడంతో పోలీసులను పిలిపించారు. తనను రమేష్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేశాడని అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. అనంతరం మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. శైలజకు బాబు(5), పాప(3) ఉన్నారు. కలిదిండి ఎస్‌ఐ వై.సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.