సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సీఐ వాసవి, (అంతరచిత్రం–ఫైల్) రాజకుమారి మృతదేహం
కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : పెళ్లై 26 ఏళ్లు గడిచినా ఆ అభాగ్యురాలు ఒక్కరోజూ సంతోషంగా గడిపింది లేదు.. మూడు ముళ్ళు వేయించుకున్నందుకు పెళ్లైన రోజు నుంచి కన్నుమూసే క్షణం వరకు భర్త వేధింపులను భరిస్తూనే వచ్చింది.. కట్టబెట్టిన పాపానికి భర్తను వదిలేయమని కన్నవాళ్ళు ఎన్నిసార్లు ప్రాధేయపడినా వివాహ బంధానికి విలువనిచ్చి దశాబ్దాలపాటు అతనితోనే అడుగులు వేసింది.. చివరికి అదే దుర్మార్గుడి పైశాచికానికి ఆ అభాగ్యురాలు బలైపోయింది. ఈ హృదయ విదారకమైన ఘటన ఈ నెల 1వ తేదీన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో చోటు చేసుకోగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ అమాయకురాలిని విచక్షణారహితంగా కొట్టి చంపిన ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.దీనికి సంబంధించిన వివరాలను గురువారం టౌన్ సీఐ కె. వాసవి మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
వ్యసనాలకు బానిసై..
మచిలీపట్నం రామానాయుడుపేటకు చెందిన కురుచేటి త్రివిక్రమశ్రీనివాసప్రసాద్ వెండి వ్యాపారం చేస్తుంటాడు. ఏలూరుకు చెందిన శివనాగకనకరాజకుమారి (40)తో 1996లో పెద్దల సమక్షంలో పెళ్లైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు నిఖిల్ విజయవాడలో సీఏ చదువుతున్నాడు. కుమార్తె మౌనిక పంజాబ్‌లో ఎంబీఏ చదువుతోంది. ఇదిలా ఉండగా పెళ్ళైన నాటికే వ్యసనాలకు బానిసైన శ్రీనివాసప్రసాద్.. రాజకుమారిని నిత్యం వేధిస్తూ ఉండేవాడు. రోజూ మద్యం సేవించి ఆమెతో ఘర్షణ పడుతుండేవాడు. మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుండేవాడు. అది నచ్చని రాజకుమారి తల్లితండ్రులు ప్రవర్తన మార్చుకోవాలని అతనిని పలుమార్లు వేడుకున్నారు. అనేకమార్లు పంచాయితీలు పెట్టారు. అయినా మార్పు రాలేదు. అతని పైశాచికాన్ని భరించలేక, కూతురు జీవితాన్ని కాపాడుకోవాలనే తపనతో ఆ తల్లితండ్రులు భర్తను వదిలేసి వచ్చేయమని పలుమార్లు బతిమలాడారు. అయినా ఆమె 26 ఏళ్లుగా భరిస్తూ అతనిని అంటిపెట్టుకునే ఉంది.
పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు.
శ్రీనివాసప్రసాద్ వేధింపులు భరించలేని రాజకుమారి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది, రక్షణ కల్పించాలని వేడుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. దీంతో కొంత కాలం శ్రీనివాసప్రసాద్ భార్యతో సజావుగా మెలిగాడు. తిరిగి సైకోలా ప్రవర్తించటం మొదలుపెట్టాడు.
పరువు తీశావంటూ కక్ష సాధింపు చర్యలు
పోలీసులకు ఫిర్యాదు చేయటంతో శ్రీనివాసప్రసాద్ ఆమెపై మరింత కక్ష పెంచుకున్నాడు. చదువుల నిమిత్తం పిల్లలు ఇద్దరు వేర్వేరు చోట్ల ఉండటం, రెండు నెలల క్రితం అతని తల్లి కాలం చేయటంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న భార్యపై శ్రీనివాసప్రసాద్ వేధింపులు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణకు దిగాడు. ఆమెను విచక్షణారహితంగా చితకబాదాడు, అతని దెబ్బలకు ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రెండు గంటల పాటు ఇంట్లో శవాన్ని ఉంచిన అతను సాయంత్రం 5 గంటల సమయంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్ళగా రాజకుమారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో శవాన్ని ఇంటికి తీసుకువచ్చి మెట్లపై జారి పడి చనిపోయిందంటూ పిల్లలకు, బంధువులకు చెప్పి నమ్మించాడు.
అనుమానంతో కేసు పెట్టిన కుమారుడు..
తల్లి మరణవార్త విని చలించిపోయిన కొడుకు అఖిల్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ముందు రోజు వరకు బాగానే ఉన్న తల్లి ఒక్కసారిగా చనిపోవటం ఏంటనే అనుమానం వచ్చింది. పైగా తండ్రి ప్రవర్తనపై అనుమానం ఉన్న అఖిల్ తల్లి శవాన్ని పరీక్షగా చూశాడు. ఆమె ఒంటిపై రక్తపు గాయాలు కనిపించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రిపై అనుమానం వ్యక్తం చేశాడు. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాసప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు సీఐ వాసవి తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ సమావేశంలో మచిలీపట్నం, ఆర్‌పేట ఎస్సైలు దుర్గాప్రసాద్, హబీబ్‌బాషా, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment