![Man Cheated By Unknown Rs 15 lakh By Promising Medical Seat In Vijayawada - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/13/man.jpg.webp?itok=m9hHeTB2)
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితుడు కట్టా నాగమోహనరావు
అతనో ఉపాధ్యాయుడు, తన కొడుకు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థితిలో ఉండాలని కోరుకున్న ఓ తండ్రి కూడా. అయితే ఆ తండ్రి ఆశను ఓ మోసగాడు అడ్డంగా వాడుకున్నాడు. నీ కొడుక్కి ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానంటూ నమ్మించి లక్షల్లో సొమ్ము కాజేశాడు. భవిష్యత్తులో కొడుకు డాక్టర్ అవుతాడన్న ఆనందంలో అసలు మోసాన్ని గ్రహించలేని ఆ తండ్రి మాయగాడి ఉచ్చులో పడి దశలవారీగా లక్షలకు లక్షలు అతని ఖాతాలో జమ చేశాడు. ఆ తర్వాత అసలు మోసం తెలిసి ఆవేదనతో అక్కడే కుప్పకూలాడు. మోసం చేసిన అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకుని దర్యాప్తుకు రంగం సిద్ధం చేశారు. వివరాలిలా ఉన్నాయి.
సాక్షి కోనేరుసెంటర్ (విజయవాడ) : పెడనకు చెందిన కట్టా నాగమోహనరావు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతని కుమారుడు ఇంటర్ పూర్తి చేసి ఇటీవల ‘నీట్’ రాశాడు. 406 మార్కులు సాధించాడు. ఊహించిన స్థాయిలో మార్కులు రాకపోవటంతో ఎంబీబీఎస్ సీటు రాలేదు. అయితే కలకత్తా నేషనల్ మెడికల్ కళాశాల నుంచి పంకజ్‌కుమార్‌శర్మ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను మెడికల్ కళాశాలలోని ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో డెప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నానని నాగమోహన్‌రావుకు చెప్పాడు. రూ.15 లక్షలు ఫీజు చెల్లిస్తే సీటు కేటాయిస్తామంటూ నమ్మించాడు. దీంతో నాగమోహనరావు దశలవారీగా అతను చెప్పిన 062422010028920 బ్యాంక్ అకౌంట్‌లోకి సొమ్ము జమ చేశారు.
మొదటిగా గత నెల 17వ తేదీన రూ.45 వేలు, 21న రూ.4.50 లక్షలు, 27న మరో రూ.4.50 లక్షలు, 30వ తేదీన మరో రూ.5 లక్షలు జమ చేశాడు. దీంతో పంకజ్‌కుమార్‌శర్మ తన కుమారుడికి సీటు కేటాయించినట్లు చెప్పాడు. ఈ నెల 6వ తేదీన కళాశాలలో ప్రారంభమయ్యే తరగతులకు పంపాలని చెప్పాడు. నాగమోహనరావు తన కుమారుడిని వెంటబెట్టుకుని కలకత్తాలోని నేషనల్ మెడికల్ కళాశాలకు వెళ్లి సీటు కోరగా పంకజ్‌కుమార్‌శర్మ అనే వ్యక్తి అక్కడ ఎవరూ లేరని తేలింది. గతంలో ఇలానే కొంత మంది అతని చేతిలో మోసపోయినట్లు యాజమాన్యం నాగమోహనరావుకు చెప్పారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న నాగమోహనరావు తిరిగి మచిలీపట్నం వచ్చేశాడు.
దర్యాప్తు చేపట్టిన చిలకలపూడి పోలీసులు
జరిగిన మోసంపై నాగమోహనరావు బుధవారం రాత్రి చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంకజ్‌కుమార్‌శర్మ అకౌంట్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన ఆధారాలు చూపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment