రామలింగేశ్వరరావు మృతదేహం
కృష్ణాజిల్లా, పెనమలూరు: తల్లి ఎప్పుడో మృతిచెందింది. తండ్రి, కుమారుడు కలిసి ఉంటున్నారు. ఆ తండ్రి కూడా అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తండి మృతిచెందిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా వారం రోజుల పాటు ఇంటిలోనే ఉంచి పూజలు చేశాడు కుమారుడు. రెండు నెలల క్రితం కానూరులో జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న కుమారుడు కూడా గురువారం అనుమానాస్పదస్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని కుటుంబంలో ఎవ్వరూ లేకుండా పోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. కానూరు వృద్ధుల ఆశ్రమం రోడ్డులో విశ్రాంత ఇంజినీర్ కొండూరు కోటేశ్వరరావు, కుమారుడు రామలింగేశ్వరరావుతో కలిసి జీవిస్తున్నాడు. కోటేశ్వరరావు రెండు నెలల క్రితం ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. మానసిక స్థితి సరిగాలేని అతని కుమారుడు రామలింగేశ్వరరావు (45)తండ్రి చనిపోయినా ఎవ్వరికీ చెప్పకుండా మృతదేహానికి పసుపు, కుంకుమ రాసి కాళ్లకు స్కేటింగ్ షూస్ వేసి ఇంట్లోనే వారం రోజుల పాటు శవాన్ని ఉంచుకున్నాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తండ్రి కోటేశ్వరరావు మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నేటికీ కోటేశ్వరరావు ఎలా మృతిచెందాడనేది తెలియరాలేదు.
ఇప్పుడు రామలింగేశ్వరరావు కూడా...
తండ్రి కోటేశ్వరరావు మరణం తరువాత రామలింగేశ్వరరావుకు చికిత్స చేయించేందుకు మేనమామలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ అతనిని విశాఖపట్నం తీసుకువెళ్లారు. అక్కడ అతనికి చికిత్స చేయించారు. ఈనెల మొదటివారంలో రామలింగేశ్వరరావు కానూరు వచ్చాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈ నెల 7న మేనమామలు వచ్చి రామలింగేశ్వరరావును చూసి వెళ్లారు. మరలా గురువారం మేనమామలు ఇంటికి వచ్చి చూడగా రామలింగేశ్వరరావు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment