
కారులో తరలిస్తున్న గంజాయిని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ తదితరులు
పెదకాకాని (పొన్నూరు) : ఎవరికీ అనుమానం రాకుండా కారులో రాష్ట్రం దాటిస్తున్న గంజాయి అక్రమ రవాణా గుట్టును గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు రట్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి నుంచి తమిళనాడు రాష్ట్రంలోని మధురైకు 300 కిలోల గంజాయితో బయలు దేరిన కారును నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కారుతో పాటు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టు మంగళగిరి డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.12 లక్షల వరకూ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పెదకాకాని పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రామకృష్ణ వివరాలు వెల్లడించారు.
తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి బైపాస్ నుంచి ఓ వాహనంలో గంజాయి సరఫరా అవుతున్నట్టు పెదకాకాని సీఐ పి.శేషగిరిరావుకు సమాచారం అందింది. దీంతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో కాపు కాసి తనిఖీలు చేయగా ఏపీ 03 పి 0333 నంబరు గల కారులో ఒక్కోటి రెండు కిలోల బరువు కలిగిన 150 గంజాయి ప్యాకెట్లు గుర్తించారు. కారుతో పాటు యజమాని, డ్రైవర్‌గా ఉన్న కేపీ రాజా, సెంగుత్తవాన్ బాలును అదుపులోకి తీసుకున్నారు. కారునంబరు వాస్తవానికి టీఎన్ 25 యూ 8989 కాగా గంజాయితో బయలుదేరే ముందు కత్తిపూడిలో నంబరు ప్లేట్ మార్చి నకిలీ నంబరు ప్లేటు బిగించారు. గంజాయి తరలించేందుకు కేపీ రాజా లక్ష రూపాయలు కిరాయి మాట్లాడుకున్నట్టు విచారణలో తేలింది. ఈ గంజాయిని విశాఖపట్నం జిల్లా కేడీ పేట సమీప ప్రాంతాల్లో సేకరించి అక్రమంగా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ గంజాయి తరలింపులో కీలక పాత్రధారులు మధురైకి చెందిన రాజేంద్రన్, విశాఖపట్నం జిల్లాకు చెందిన నూకయ్యనాయుడుగా గుర్తించారు. త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులు సెంగుత్తవాన్ బాలు, కేపీ రాజాలను గురువారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ పి.శేషగిరిరావు, ఎస్‌ఐ ఆరోగ్యరాజు, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుల్ యానాదిలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో సీఐ పి.శేషగిరిరావు, ఎస్‌ఐలు సత్యనారాయణ, ఆరోగ్యరాజు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment