
సాక్షి, కృష్ణా : గుడివాడలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తు ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో వీఆర్‌లోకి వెళ్లిన సబ్ ఇన్‌స్పెక్టర్‌పై అతని కోడలు గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం పడమటలో నివాసం ఉండే శిరీషా, భాస్కర్‌కు 2013లో వివాహం అయింది. భార్య, భర్తలు ఇద్దరు హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగులు. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లి సమయంలో కట్నం కింద ఐదున్నర లక్షలు, 15 సవర్ల బంగారం, అర ఎకరం పొలంతో పాటు, అడపడుచు కట్నం కింద రెండు లక్షలు ఇచ్చారు. తన బాబును చూడనివ్వటం లేదని, పైగా తన బ్యాంకు అకౌంట్‌నుంచి లోన్‌లు తీసుకుని, తనను వేధిస్తున్నారని శిరిషా విజయవాడలో ‘స్పందన’ కార్యక్రమంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ సూచన మేరకు గురువారం పటమట పోలీసులకు అమె ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.